– భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ భీమసేన
నవ తెలంగాణ- రాయపోల్
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న లాంటి గొప్ప వ్యక్తులు యుగానికి ఒక్కరూ మాత్రమే పుడతారని అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని,సమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నకు ఘన నివాళి అర్పించడం జరిగిందని భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ భీమసేన అన్నారు. మంగళవారం అల్వాల్ లో గద్దర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామిక, కార్మిక, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన యుద్ధనౌకను ప్రజలందరూ స్మరించుకునేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఆశయాల మార్గంలో జీవితాంతం దళిత బహుజన బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్య చేయడమే లక్ష్యంగా పోరాటం చేశారు. అణచివేత అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు గద్దర్ అన్నారు. గ్రామాలలో కొనసాగే వెట్టిచాకిరి విముక్తి కోసం అడవి బాటపట్టి పేద ప్రజల పక్షాన పోరాటం చేశారన్నారు.గద్దర్ అన్న తన మాట- పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన గొప్ప కళాకారుడు. దేశవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజల కోసమే తన ఊపిరి ఉన్నంతవరకు ఉద్యమించిన ప్రజా ఉద్యమ కారుడు గద్దర్ అన్నను స్మరించుకోవడానికి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రాజు, జిల్లా నాయకులు ఆస బాబు, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్ట్ మన్నె గణేష్ తదితరులు పాల్గొన్నారు.