దర్ద్‌ రహిత భారతం ‘దర్ద్‌’ స్వప్నం

Pain free India is the dream of 'pain'ఈ దేశమంటే/ భిన్నత్వంలో మనల్ని కలిపి కుట్టిన ఏకత్వం. ఈ దేశమంటే మట్టికాదు, మతమంతకంటే కాదు, ఈ దేశమంటే మనందరి అస్తిత్వం (చాంద్‌ఉస్మాన్‌, దర్ద్‌)

భారతదేశం ఒంటిస్తంభపు మేడ కాదు. బహుళత్వానికి నిలయం. భారతీయ జీవితం, దాని సారమైన భారతీయ సంస్కృతి బహుళత్వ శిల్పాలు. అందుకే భారతీయ సంస్కృతిని భిన్నత్వంలో ఏకత్వం అని నిర్వహించుకున్నది. ఈ బహుళత్వానికి చారిత్రక కారణాలున్నాయి. అనేక కులాలు, మతాలు, భాషలు, వేషాలు, ఆహారాలు, వివాహ పద్థతులు సహజీవనం చేస్తున్న దేశం మనది. ఇవన్నీ భారతీయ జీవితంలోని చారిత్రక పరిణామంలో క్రమంగా ప్రవేశించాయి. ఈ వైవిధ్యాన్ని భారతదేశం ఆమోదించింది. వాటి మధ్య వైరుధ్యాలుంటే, ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవటం సరైన పద్థతి. ఈ వైవిధ్యాన్ని తుడిపేసి లేదా తొక్కిపెట్టి, ఒంటి స్తంభపు మేడ కడతామనడం, అందుకనుకూలంగా మాట్లాడడం, చర్యలకు దిగడం అప్రజాస్వామికం, నిరంకుశత్వం. రాజ్యాంగ ఉల్లంఘన కూడా.
”చెట్టాపట్టాల్‌ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయి/ అన్నదమ్ముల వనెను జాతులు మతములన్నీ మెలగవనెలోయి/ మతం వేరైతేను యేమోరు మనసు లొకటై మనుషులుంటే” అని గురజాడ 1910 లోనే ప్రబోధించి మతసామరస్యాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుండి అనేకమంది కవులు మత సామరస్య ప్రచారం చేశారు. ప్రజలూ సామరస్యంగానే వుంటున్నారు. పాలకులు రాజకీయ అవసరాల కోసం మత ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారు. ఇది భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. మత సామరస్యం ఇప్పటి భారతీయ అవసరం. ఏ రకమైన ఆధిపత్యమూ లేని దేశమే ఆధునిక దేశం. భారతదేశం అనేక ఆధిపత్యాలతో సతమతమవుతున్నది. దాని నిర్మూలనకు ఉద్యమాలు సాగుతున్నాయి. ఆధిపత్యాలలో మతాధిపత్యం ఒకటి. ఎంతో వెనక్కి పోకుండా గత ఈ మూడు దశాబ్దాలలో మతాధిపత్యం భారతదేశంలో సృష్టించిన విధ్వంసం చూసినా మత సామరస్యం విలువ ఎంతటిదో తెలుస్తుంది. ఈ రకమైన ఆధిపత్య వాదులు తెలుసుకోవలసిందేమిటంటే దేనినీ శాశ్వతంగా అణగదొక్కలేం అన్నది. బంతిని ఎంత కిందికి విసిరేస్తే అది అంత పైకి లేస్తుందన్నది వాస్తవం. ఈ అణగదొక్కే నిరంకుశత్వం మీద నిరసనగా వచ్చిందే ‘దర్ద్‌’ కవిత్వ సంకలనం.
మూడు దశాబ్దాలుగా పుంఖానుపుంఖాలుగా వస్తున్న ముస్లిం అస్తిత్వ వాద కవిత్వానికి ‘దర్ద్‌’ కొత్త చేర్పు. గత పదేళ్లుగా ముస్లింలకు ఆధిపత్యవాదుల నుండి ఎదురౌతున్న సవాళ్లను ప్రతిఘటిస్తూ వచ్చింది ముస్లిం వాద కవిత్వం. దర్ద్‌ ఆ క్రమంలో వచ్చిందే.
దర్ద్‌ అంటే నొప్పి, బాధ, దు:ఖం. తమను ఆధిపత్య వాదులు అనుమానించడం, అవమానించడం, అణచివేయడం, తమ ఉనికికి ఆధారాలు అడగడం, పాకిస్తాన్‌కు వెళ్లిపొమ్మనడం, అనేక రకాలుగా నిర్భందించడం, దుష్ప్రచారాలు చేయడం వంటి అమానవీయ పరిణామాల వల్ల కలిగిన బాధ దర్ద్‌ సారం. ఈ కావ్యంలో పరోక్షంగా ఆర్యుల రాక నుండి ప్రత్యక్షంగా గుజరాత్‌ గాయం నుండి సరిగ్గా ఇటీవల కొత్త చట్టాలతో ఒత్తిడి చేయడం, దానివల్ల సంభవిస్తున్న పరిణామాలను ముస్లిం కవులు విమర్శనాత్మంగా ప్రతిపాదించారు. తమ సమస్యలను గుర్తించి, వాటికి కారణాలను తెలుసుకొని, వాటికి పరిష్కారాలనూ చెప్పారు దర్ద్‌ కవులు.
దర్ద్‌ కవులు ముక్త కంఠంతో చెబుతున్నది తాము ఈ దేశ మూలవాసులమేనని. తాము ఎక్కడి నుండో వచ్చినవాళ్లం కాదని.
‘మేము ముసల్మానులం/ మూలవాసులం’ (షాజహాను) అన్నది ఈ కావ్య నినాదం. తాము భారతదేశంలో పుట్టి, జీవించి, భారతదేశంలోనే మరణిస్తున్న కోట్లాది భారతీయులలో భాగమని దర్ద్‌ కవులు చెబుతున్నారు.
‘ఈ నేలపైనే పుట్టాను, ఈ మట్టిలోనే కలుస్తాను’ (షైజ్‌వదీఫ్‌), ‘ఈ దేశమూలవాసులం/ ఈ మట్టిలోనే పుట్టి/ ఈ మట్టిలోనే పెరిగి/ ఈ మట్టిలోనే మట్టయ్యేటోళ్లం’ (ఎస్‌.ఖుర్షీద్‌), ‘నా వేషం నా భాష వేరయినా/ నేను ఈ దేశపు మూలవాసిని కానా?’ (జాబిలి చాంద్‌భాష).
‘నా రక్తంలో ఈ దేశం వుంది’ అనగలిగేంత స్థిరచిత్తంతో మాట్లాడుతున్న ‘దర్ద్‌’ కవులు. ఆర్యులు రాకముందు భారతదేశంలో ఉన్నవాళ్లు మూలవాసులు. ఆర్యుల రాకతో, వర్ణ వ్యవస్థ ఆవిర్భావంతో, మూలవాసులు అంటరానివాళ్లయ్యారు. వాళ్లు ఇప్పటి భాషలో దళితులు. ఆర్యులు సృష్టించిన మతం దళితులను అనేక రకాలుగా కట్టడి చేసింది. అవమానిచింది. అదంతా ఒక చరిత్ర. కాలక్రమంలో మధ్యయుగాలలో భారతదేశంలోకి ముస్లిం పాలకులు వచ్చారు. ఇస్లాం మతంలో కులం లేదు. అందువల్ల ఆధిపత్య మతంలో అవమానాలు, అణచివేతలు అనుభవిస్తున్న మూలవాసులు కుల వివక్ష లేని ఆ మతంలోకి వెళ్లారు. అలా మూలవాసులు ముస్లిములయ్యారు. ఈ వాస్తవాన్ని దర్ద్‌ కవులనేకులు ప్రస్తావించారు. అఫ్సర్‌ కంచికచర్ల కోటేశును, అఖ్లాక్‌, షమ్స్‌ తబ్రీజ్‌ అన్సారీలను కలిపి చెప్పడంలో ఈ చరిత్ర ధ్వనిస్తున్నది.
కులమతాల ద్వారా మాత్రమే మనుషులను గుర్తించే దుర్మార్గ పద్ధతిని అధిక్షేపించి, అందరినీ మనుషులుగా గుర్తించండి అని యాకుబ్‌ గుర్తుచేశారు. ‘మతము ఏదైతేను ఏమోయి?’ అని గురజాడ అన్నట్లు యాకుబ్‌ ‘అవును, ముస్లింగానే పుట్టాను/ అయితే ఏంటి/ నేనూ మనిషినే’ అన్నారు. విశ్వాసాలు, వేషభాషలు ఎవరివి వాళ్లవైనా, అందరిలోనూ ఎర్రరక్తమే ఉన్నది అని యాకుబ్‌ ఎరుక పరిచారు. దర్ద్‌ కవులు ఫ్రెంచ్‌ విప్లవం అందించిన, డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రచారం చేసిన సౌబ్రాతృత్వ భావనను నొక్కి చెప్పారు. ‘నేను మీలో ఒకడిని/ నాలో ప్రవహించే రక్తం/ ఈ దేశపు మట్టి రేణువుల సంగమమే’ (జాబిలి).
మొత్తం భారతీయ ప్రజాశ్రేణుల నుండి తమను వేరుచేసి చూడవద్దన్నది దర్ద్‌ కావ్య ప్రతిపాదన.
‘చరిత్ర రాసుకోలేదు కానీ/ దేశ బలిదానాల్లో/ నా జాతి త్యాగాలెన్నో వున్నాయి గదా’ (అన్వర్‌).
‘ఈ దేశ స్వాతంత్య్ర పోరాటంలో/ ఎందరో ముస్లిములు అపూర్వ త్యాగాలతో/ అసమాన బలిదానాలతో/ మన మాతృభూమి/ విముక్తి పోరాటంలో పునీతులయ్యారు’ (చీకటి మహ్మద్‌రఫీ). అందరితో పాటు దేశం కోసం పాటు పడిన, పాటుపడుతున్న దేశభక్తిని శంకించడం పట్ల దర్ద్‌ కవులు ఆవేదన చెందుతున్నారు. ఇబ్రహీం నిర్గుణ్‌ భారతీయ ముస్లిములు విభిన్న రంగాలలో రాణించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన వారని గుర్తుచేశారు.
‘ఈ మట్టి పేగు బంధంతో ఉరికబంభమెక్కిన అష్ఫా ఖుల్లాఖాన్‌లు/ ప్రపంచ పటంలో దేశానికో గుర్తింపునిచ్చిన అబ్దుల్‌ సలాలు/ వీధుల్ని నిద్రలేపి ఆటైన సఫ్దర్‌ హష్మీలు’
వీళ్ల చరిత్రను విస్మరించి, ముస్లిముల ఔన్నత్యాన్ని శంకించడంలోని అనౌచిత్యాన్ని దర్ద్‌ కవులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ ముస్లిములు, మిగతా ప్రజలతో ఎలా అన్యోన్యంగా కలిసి జీవిస్తారో వర్ణించారు నిసార్‌. ‘పల్లెటూళ్లో ఉండేటి ముస్లిములము/ అరబ్బీ ఉర్దూ రానోళ్లము/ అంతా తెలుగులోనే సదువుకున్నోళ్లము…/ ఎవరింటికెళ్లినా వరసుంటది/ రక్త సంబంధమోలె పల్లె కలిసుంటది’.
మా పుట్టుక, చావు, ఈ దేశంలోనే అనడమే కాదు… ‘మరో జన్మంటూ వుంటే/ ఈ భారతభూమిలోనే జన్మించాలని వుంది’ అన్నారు గౌస్‌ భాషా.
‘మనిషి మాత్రమే నిజమనే/ మనుషులు కావాలిప్పుడు’
ఇటీవల జన గణన కోసం పాలకులు రూపొందించిన రెండు చట్టాలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాలలో పౌరసత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు చూపించే నియమం పట్ల దర్ద్‌ కవులు ఆవేదన చెందారు. పేదరికం, అవిద్య, నిరాదరణలకు గురైన ముస్లిములు భద్రత కోసం నిరంతరం యుద్ధం చేస్తున్న ముస్లిములు, తమ ఉనికికి సంబంధించిన ఆధారాలు చూపించి పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే సాధ్యమేనా అని దర్ద్‌ కవులు ప్రశ్నిస్తున్నారు.
‘నేనిక్కడే పుట్టాను/ అన్న ఒక్క నిజం తప్ప/ నేనీదేశ వాసిని అని/ చెప్పడానికి నా దగ్గర/ ఏ పత్రాలూ లేవు’ అని ముహమూద్‌ స్పష్టం చేశారు. అభివృద్ధికి, ఆధునికతకు నోచుకోని సామాన్య ముస్లిముల తరపున సాబిర్‌, స్కైబాబాలు పుట్టుకకు ఆధారాలు చూపాలన్న నియమానికి సూటిగా సమాధానం చెప్పారు.
‘నువ్వు భారతీయుడివేనా/ అంటూ గదమాయిస్తావ్‌/ నాకేమీ దిక్కుతోచక/ పిడికెడు మట్టి తీసి చూపిస్తా’ (సాబిర్‌)
‘ఎవడు గుర్తింపు పత్రాలు అడిగినా/ గుప్పెడు మట్టి తీసి చూపిస్తాను/ ఈ మట్టి బిడ్డను నేను’ (స్కై బాబా)
పాత్రికేయుని గుడ్డలు విప్పి మత నిర్థారణ చేసిన దుర్మార్గాన్ని దర్ద్‌ కవి తీవ్రంగా గర్హించారు. ముస్లిములు ఎదుర్కొంటున్న వివక్షల విషయంలో మాట్లాడవలసిన ముస్లిమేతర లౌకిక వాదులను నోరు విప్పమని కోరుతున్నారు స్కైబాబా. ‘స్నేహితులుగా వున్నవాళ్లు/ మతం విషయం వచ్చేసరికి/ మౌనం వహించడం పట్ల/ మౌనం నన్ను బాధిస్తున్నది’ అని ఆవేదన పడ్డారాయన. గుర్తింపుల విషయంలో ముస్లిములకు, ఆధిపత్య వాదులకు మధ్య వున్న తేడాను ఆయన ప్రస్తావించారు… ‘వారు చూపమన్న ఆధారాలు ఇద్దరమూ చూపలేకున్నా/ నువ్వు బొట్టు చూపించి వాణ్ణి మచ్చిక చేసుకోవచ్చు/ చూపించడానికి వాడికి కావలసింది నా దగ్గరేముందిరా/ నిన్ను అమితంగా ప్రేమించే నా హృదయంతప్ప’.
ఎం.హెచ్‌.ముజాహిద్‌ ముస్లిమేతర మూలవాసి సోదరుల సహకారం అవసరమైతే తమ పట్ల చూపబడుతున్న వివక్ష, అమానుషాలను ప్రతిఘటించడానికి ఈ దర్ద్‌ కవి సిద్ధమయ్యారు.
‘కలిసిపోరాడితే పోయేదేముంది/ ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రం కూడా/ కెరటమై కాళ్లను ముద్దాడుతుంది’ (ఎస్‌.జవేరియా).
‘ఈ దేశం ఈ దేశ మూలవాసులదే/ మేమంతా ఏకమైన నాడు/ నీ ఆటలు సాగవు గాక సాగవు’ (ఎస్‌.ఖుర్షీద్‌)
ఒకే సమాజంలో నివసిస్తున్న ప్రజాశ్రేణుల మధ్య ఐక్యతను కోరుకుంటున్నది దర్ద్‌ కావ్యం. కవిత్వమంటే ఇదీ. కవిత్వం ఇలాగే వుండాలనే కొలమానాలతో దర్ద్‌ను పరిశీలించడం మాని, ఈ కవుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య భారతదేశం భూస్వామ్య లక్షణాలను విదిలించుకుని శాస్త్రీయ, మౌలిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందాలని దర్ద్‌ కవుల ఆకాంక్ష.
ముస్లిం సాహిత్య ప్రచురణ, ప్రచారాలలో ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తున్న మిత్రుడు, ఈ కావ్య సంకలన కర్త స్కైబాబాకు అభినందనలు.
– రాచపాళం చంద్రశేఖరరెడ్డి