ఏనుగు దాడిలో మిర్చి రైతు మృతి

నవతెలంగాణ-చింతలమానేపల్లి
ఏనుగు దాడి చేయడంతో రైతు ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్ర ప్రాణహిత నది సరిహద్దు నుంచి ఏనుగు బూరెపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించింది. రైతు అల్లూరి శంకర్‌(45) మిర్చి తోటలో భార్యతో కలిసి పనిచేస్తున్న క్రమంలో ఏనుగు తోటలోకి వచ్చింది. దాన్ని చూసి శంకర్‌ భార్య అరుస్తూ, కేకలు వేస్తూ పరిగెత్తగా.. ఆయన తోటలోనే మిర్చి చెట్ల కింద అనిగి కూర్చున్నాడు. కానీ ఏనుగు ఒకేసారి ఆయనపై దాడి చేసింది. దీంతో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు చేరవేశారు. డీఎఫ్‌ఓ నీరజ్‌ కుమార్‌, కౌటాల సీఐ సాదిక్‌ పాషా ఆధ్వర్యంలో ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవికి మళ్లించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏనుగు బూరెపల్లి నుంచి రన్వెల్లి, గంగాపూర్‌ ప్రాణహిత చేవెళ్ల కెనాల్‌ వెంబడి వెళ్తూ కర్జల్లి, చింతలమానేపెల్లి గ్రామాల పొలాల్లోకి వచ్చినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా, తమకు సహకరించాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏనుగును మహారాష్ట్ర మళ్లించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.