
మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన చొప్పరి శ్రీనివాస్ (28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం శ్రీనివాస్ వృత్తి రీత్యా వాల్వ డ్రైవర్ గత నాలుగేళ్ళ క్రితం సంధ్య అనే అమ్మాయిని ప్రేమవివాహం చేసుకొని, గత సంవత్సరం క్రితం విడిపోయినట్లుగా తెలిపారు. అప్పటి నుంచి శ్రీనివాస్ సరిగ్గా పని చేయకపోగా మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లుగా తెలిపారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ప్రాణాపాయస్థితిలో ఉన్న అతన్ని చికిత్స కోసం వెంటనే కుటుంబ సభ్యులు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లుగా నిర్దారించారని పేర్కొన్నారు. మృతుని తండ్రి చొప్పరి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ ఏఎస్ఐ కుమారస్వామి తెలిపారు.