మెదక్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం

A pink flag is sure to fly on Medak soil– కాంగ్రెసోళ్లు ఏం మొఖంపెట్టుకుని ఓట్లడుగుతరు
– ఏ ఒక్క హామీ కూడా అమలు చేసిందిలేదు
– బీజేపీ అభ్యర్థి మంచోడైతే దుబ్బాకలో ఎందుకు ఓడిండు
– పేదల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం :
– మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని కాంగ్రెసోళ్లు ఏం మొఖం పెట్టుకుని ప్రజల్ని ఓట్లు అడుగుతారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరైన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని విమర్శించారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. రూ.2 లక్షల రుణమాపీ, రైతు బంధుకు బదులు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పిందని తెలిపారు. కనీసం రైతులకు బోనస్‌ కూడా ఇవ్వని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్‌, పెంచిన పింఛన్‌ ఇవ్వని కాంగ్రెస్‌ వాళ్లు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుందని, ఇది ప్రజలు గ్రహించాలని కోరారు. చోటేబాయి.. బడే బాయి.. రేవంత్‌రెడ్డి మోడీతో ఏం అన్నాడో ప్రజలు గమనించాలని, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి చేసేందుకు సాయపడాలని కోరడమంటే అదానీకి దోచి పెట్టడమా అని ప్రశ్నించారు. రేవంత్‌ మంత్రివర్గంలో ముస్లీం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదన్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. పంటలెండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మంచొడైతే దుబ్బాకలో ఎందుకు గెల్వలేదన్నారు.
ఆయన పనితీరు బాగలేదనే ప్రజలు 54 వేల ఓట్లు మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేద పిల్లల చదువులు, సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వెంకట్రామిరెడ్డి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రూ.100 కోట్ల నిధులతో పీవీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తానన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తానన్నారు. ప్రజాధరణ చూసే పార్టీ తనకు ఎంపీ టికెట్‌ ఇచ్చిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, నాయకులు ముఖీం పాల్గొన్నారు.