ముచ్చటగా మూడోసారి ఎగరనున్న గులాబీ జెండా

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగర నుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంకలనం చేసిన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై విశ్లేషణ ”కాంగ్రెస్‌ చేసిందేంది?” అనే పుస్తకాన్ని సోమవారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎంత స్థితప్రజ్ఞత కలవారో గతంలో రెండుసార్లు ఎన్నికల్లో రుజువు అయ్యిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అభివద్ధి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ఆత్మలాంటిదని, కాంగ్రెస్‌ ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినా గులాబీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ కన్నీళ్ళను తుడిచి బీడు భూములపై గంగమ్మను ప్రవహింపచేస్తున్న కేసీఆర్‌ ను తెలంగాణ తన గుండెల్లో దాచుకుంటుందని అన్నారు. కాంగ్రెసు మోసాలను కళ్ళకు కట్టినట్లుగా పుస్తకాన్ని వెలువరించిన జూలూరు గౌరీశంకర్‌ను ఈ సందర్భంగా కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణలో విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మల చేతివత్తులను ఆధునీకరించి వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.