ప్లేఆఫ్స్‌ బెర్త్‌ తృటిలో చేజారే

ప్లేఆఫ్స్‌ బెర్త్‌ తృటిలో చేజారే– 1-2తో భారత్‌పై కివీస్‌ గెలుపు
– బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ టెన్నిస్‌
బీజింగ్‌ (చైనా) : ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో భారత మహిళల జట్టు తృటిలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ చేజార్చుకుంది. గ్రూప్‌ దశలో తొలి మూడు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసిన భారత్‌.. నాల్గో మ్యాచ్‌లో నిరాశపరిచింది. శనివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 1-2తో ఓటమి పాలయ్యారు. తొలి సింగిల్స్‌లో రుతుజ 6-2, 7-6(7-5) వరుస సెట్లలో విజయం సాధించగా.. రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 2-6, 0-6తో లులు సన్‌కు కనీస పోటీ ఇవ్వలేదు. కీలక డబుల్స్‌ మ్యాచ్‌లో అంకిత, ప్రార్థన జోడీ అంచనాలను అందుకోలేదు. తొలి సెట్‌ను 1-6తో చేజార్చుకున్న మన అమ్మాయిలు రెండో సెట్‌లో 1-5తో వెనుకంజ వేసినా వరుస గేములు నెగ్గి 5-5తో సమవుజ్జీగా నిలిచారు. ఈ సమయంలో విశేష అనుభవం కలిగిన న్యూజిలాండ్‌ అమ్మాయిలు ఒత్తిడిలో మ్యాచ్‌ను లాగేసుకున్నారు. దీంతో భారత్‌ 1-2తో కీలక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌ ఫలితం అనంతరం భారత్‌ సహా దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌లు వరల్డ్‌ ప్లేఆఫ్స్‌లో చోటు కోసం రెండో అర్హత జట్టుగా ముందంజ వేసేందుకు సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో ఓవరాల్‌ మ్యాచుల ఫలితాలు కాకుండా.. వ్యక్తిగత మ్యాచుల ఫలితాలతో దక్షిణ కొరియా ముందంజ వేసింది. దక్షిణ కొరియా ఓవరాల్‌గా 11 మ్యాచుల్లో నెగ్గగా.. భారత్‌ 8, న్యూజిలాండ్‌ 7 విజయాలు సాధించాయి. చైనాతో పాటు దక్షిణ కొరియా ప్రపంచ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. వచ్చే ఏడాది సైతం భారత్‌, న్యూజిలాండ్‌లు ఆసియా ఓసియాన గ్రూప్‌-1లోనే పోటీపడనున్నాయి. ఇదిలా ఉండగా, బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, జపాన్‌ తలపడనున్నాయి.