‘కెక్యూబ్ వర్మ’ కళింగాంధ్రకు చెందిన నికార్సైన రాజకీయ కవి. నిర్దిష్టమైన తాత్విక ఆలోచన గల కవనయోధుడు. పదునుగా, సూటిగా కవిత్వ నిర్మాణం చేయగల నేర్పరి. చిన్న చిన్న పదాలలో పెద్ద భావ ప్రపంచాన్ని ఇమడ్చగల సజనజీలి. ప్రపంచంలో ఎక్కడ ఆధిపత్యవాదులు సామాన్య జనంపై దాడిచేసినా ఆయా దాడులను, పీడనలను ప్రాపంచిక దక్పథంతో పరికించి అంతే ధాటిగా నిరసిస్తూ కవితా వాక్యాలను అల్లుతాడు. పెద్దగా ప్రతీకలు, వర్ణనలు లేని కవిత్వమిది. అయినా ఇతని కవిత్వం ఆకట్టుకుంటుంది. చైతన్యాన్నిస్తుంది. వైప్లవాన్ని సూచిస్తుంది. ఈయన ఇటీవల ‘భూమిని మాట్లాడనివ్వు’ అనే కవితా సంపుటిని వెలువరించారు. అందులోని ఒక కవితే ఈ గాజా.
రష్యా దాడికి ఉక్రెయిన్ జరిపిన ప్రతిదాడిని యుద్ధమంటాం. కానీ ఇజ్రాయిల్ పాలస్తీనాపై జరిపినదాన్ని యుద్ధమనలేం. దాన్ని ముమ్మాటికి దురహంకార నిర్బంధ సైనిక చర్య అనాలి. హమాస్ చేపట్టిన దాడి తప్ప, పాలస్తీనా ఏరోజూ ఎదురుదాడికి దిగలేదు. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షే దాడులకు కారణం. గాజా ఒక పట్టణం కాదు. చుట్టూ గోడ ఉండే ఒక బహిరంగ చెరసాల. అక్కడి ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవు. విముక్తి లేదు. వారిపై దాడులు యధేచ్ఛగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు విలువలేదక్కడ. గాజాపై బాంబుల వర్షం కురుస్తున్నది. గాజా కకావికలమైంది. ఆసుపత్రులు శవాల దిబ్బలైపోయాయి. ప్రజలు కిర్రోమొర్రోమంటూ విలపిస్తున్నారు. దాడుల్లో పిల్లలెందరో మరణించారు. పాఠశాలలు మూతపడుతున్నాయి. భవిష్యత్తు తరం చేజారిపోతున్నది. మైనార్టీ వర్గాలపై మెజారిటీ వర్గాలు చేస్తున్న దాడిని కవి ఈ కవితలో తప్పుబడతాడు. చివరికి మీ ఆటలు సాగవని హెచ్చరిక చేస్తాడు.
ఈ వాక్యాలు చదువుతుంటే హమాస్ ప్రతిదాడి నేపథ్యంలో ఎం.సి.అబ్దుల్ అనే బాలుడు గారీ మెక్ కార్తీ, సియాన్ హెర్న్ అనే పిల్లలతో కలసి రాసుకొని పాడిన పాట గుర్తుకొస్తుంది. ఈ పాటను కొత్తపల్లి రవిబాబు ఇలా అనువదించారు. ”నేను అలసి సొలసి పోయా/ రాత్రంతా నిద్రపోలా/ నిద్రపోతే బాంబులు పిడుగులు/ అదంతా ఒక పీడకల/ అమాయక బాలల్ని అమరులుగా చేసే/ క్రూరులుగా మీరు ఎలా తయారయ్యారు?/ నేను కోరుతున్నా స్వేచ్ఛను/ ఈ ప్రాంతపు ఇరవై లక్షల మంది స్వేచ్ఛను/ కోరుతున్నా! కోరుతున్నా!” ఇలా సాగుతుంది ఈ పాట. ఇది గాజా ప్రజల ఆక్రందనను హదయవిదారకంగా ఎరుకపరుస్తున్నది.
పాలస్తీనాపై దశాబ్దాలుగా మారణహోమం జరుగుతున్నప్పటికీ, ఫీనిక్స్ పక్షిలా గాజా తిరిగి లేస్తుందని ఆశావాహంగా ఈ కైతలో కవి అనడం, గొప్ప ముక్తాయింపు వాక్యంగా అభివర్ణించవచ్చు.
– పిల్లా తిరుపతిరావు, 7095184846
‘గాజా’
ఈ బూడిద గుట్టల మీద
నీ అధికారం ఎన్నాళ్ళు
సాగుతుంది
తిరిగి మరలిపోయిన మనుషులు
తప్పక తలెత్తుకుని వస్తారు
పచ్చని చిగుళ్ళని మొలకెత్తించడానికి
ఆసుపత్రులు తెరచుకుని
మరల పురుళ్ళు పోసుకుంటాయి
బడిగంటలు మోగి
చినిగిన పైజామాలు ఎగదోసుకుంటు
పిల్లలు మరల పలకా బలపం పట్టి
తమ భవిష్యత్తు చిత్రపటాన్ని లిఖించుకుంటారు
ఫీనిక్స్ పక్షిలా
మరలా గాజా లేచి నిలబడుతుంది
నువ్వెన్నిసార్లు బూడిద చేసినా
ఎందుకంటే వాళ్ళు
మనుషులు కదా?
– కెక్యూబ్ వర్మ, 9493436277