మనిషి జీవితానికి శారీరక, మానసిక అంగవైకల్యం తీరనిలోటు. అలాంటి వారి జీవన విధానం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవిస్తే గాని అర్థం కాదు. వాటన్నిటినీ తట్టుకొని కొంతమంది అత్యున్నత ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. పదిహేనేండ్ల వయస్సులోనే తీవ్రమైన జ్వరంతో శక్తి క్షీణించి, రెండు కాళ్ళు పనిచేయక అచేతనుడయ్యాడు రాసమొళ్ళ చంద్రయ్య. కుటుంబ పోషణ కొరకు చదువుకు దూరమయ్యి చిన్నప్పుడే కులవృత్తి చేపట్టారు. ఉన్నత చదువులు చదవకపోయినా తన దగ్గర ఉన్న మిత్రులు, పిల్లలు, పత్రికలు, హితైషులు, దూరదర్శన్, చరవాణి వంటి సహాయంతో సమాజాన్ని చదివి సాహిత్యంలో రాణిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా, అప్పాయి పల్లికి చెందిన కవి ఆయన.
ఈ కవి స్వయంగా అంధుడు కావడం వల్ల తాను పడిన ఆవేదనను, ఆర్తిని కవితా రూపంలో మలిచి, ‘దివ్యాంగుల మణిపూసలు’ పేరుతో వెలువరించారు. వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసల ప్రక్రియలో వచ్చిన ఈ రచన తొలి దివ్యాంగుల పుస్తకం కావడం విశేషం. మూడు వందలకు పైగా మణిపూసలను కేవలం దివ్యాంగులు అనే ఒకే ఒక వస్తువును స్వీకరించి, రాయడమనేది కవికున్న ప్రతిభకు నిదర్శనం. చూపు లేని కొందరు వివిధ రూపాల్లో తమ మేధో సంపత్తిని చూపెడుతున్నారు. వారి హక్కులను కాపాడుకోవడం కొరకు పోరాటం చేస్తున్నారు. ఆ మార్గంలో రాసమొళ్ళ చంద్రయ్య దివ్యాంగుల అస్తిత్వం కోసం కవితా మార్గం ఎంచుకున్నారు. సమాజంలో అవిటి వారిని చిన్నచూపు చూడటం తగదంటూ వారి జీవిత వ్యథలను చెప్పిన తీరు హృద్యంగా ఉంది. ఇందులో వారి సాధక బాధకాలను వివరించే ప్రయత్నం చేశారు. సమాజంలో వికలాంగుల పట్ల ఉన్న వివక్షతను తన కలంతో తీవ్రంగా ఖండించి, వారి జీవితాల్లో చైతన్యపు వెలుగులు నింపడానికి తన వంతు కృషి చేశారు. ఈ గ్రంథంలోని కొన్ని మణిపూసలు పరిశీలిద్దాం!
‘భయంకరపు వ్యాధి వున్న/ తన దేహము కదలకున్న/ స్టీఫెన్ హాకి భయపడక/ చేసె పరిశోధనలన్న!’. అన్ని అవయవాలు చచ్చు పడిపోయిన స్టీఫెన్ హాకింగ్ ఏమాత్రం నిరాశ చెందకుండా తన వైకల్యాన్ని లెక్కచేయకుండా మానవాళికి గొప్ప పరిశోధనలు అందించాడని, అతడి జీవితాన్ని వికలాంగులు ఆదర్శంగా తీసుకుని బాధ పడకుండా ముందుకు సాగాలన్నారు. ఇలా ప్రముఖ వికలాంగుల పేర్లను ప్రస్తావిస్తూ వారు సాధించిన విజయాల గురించి తన మణిపూసల్లో ఎంతో చక్కగా వివరించారు.
‘కనబడే వికలం కన్న/ మదిలో వైకల్యమున్న/ మహాప్రమాదకరము/ దీన్ని ఎరిగి మసలుమన్న!’ ఈర్ష్య, అసూయ ద్వేషాలు, కుళ్లుబుద్ధి వున్న వాళ్లకు చెంప పెట్టు లాంటిది ఈ కవిత. మంచి మనసు లేని వాడే అసలైన వికలాంగుడనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. కనబడే వైకల్యం కన్నా మన మనసులో కనబడని మనోవైకల్యం మహా ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నాడీ కవి.
‘మూగవాళ్ళ రోదన/ చెప్పలేని భావన/ శ్రమించి పనిచేసిన/ కడుపునిండ వేదన!’. ఇలా ఎందరో మాటలు రాని మూగవాళ్ళ అంతరాత్మను, జీవన స్థితిగతులను, బతుకు దెరువును, ఆవేదనలను వర్ణించారు.
‘తల్లికి తండ్రికి సేవలు/ చేయలేని మా రాతలు/ కన్నీళ్ల తోడ వారే/ చేస్తారు మాకు సేవలు!’. తల్లిదండ్రులకు సేవలు చేయాల్సిన స్థితిలో నేను వారితో సేవలు చేయించుకుంటున్నానని కవి వేదనాభరితమైన హృదయంతో అల్లిన ఈ కవితని చదివితే ఎవరికైనా కనీళ్ళు వస్తాయి.
‘పాటపాడి మెప్పిస్తం/ ఆటలాడి ఒప్పిస్తం/ ప్రేక్షకుల నుల్లాసంగ/ ఉంచుడేను మా లక్ష్యం!’. కొంత మంది పొట్టకూటి కోసం శారీరక లోపం ఉన్నప్పటికీ పాటలు పాడుతూ ఇతరుల సంతోషం కొరకు పాటుపడుతున్నారంటారు. మరికొందరు కుంచెతో చిత్రాలు వేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, బట్టలు కుడతారు, నృత్యం వంటి అనేక పనులు చేస్తూ దేశాభివృద్ధిలో భాగమవుతున్నారు. శ్రామికులుగా, కళాకారులుగా, రచయితలుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారు. అయినా సమాజంలో చాలా మందికి వికలాంగులంటే చిన్న చూపే. వారికి కావాల్సింది జాలి కాదని, వారిలో దాగివున్న తెలివితేటల్ని వెలికి తీసేందుకు ఆదరణ, ఆచరణ కావాలని కోరుతున్నారు.
‘మా తనువు వంపు దేహము/ మా హృదయం పూలవనము/ చెరగిపోని మానవత/ మాకున్నది ప్రేమ గుణము!’. వికలాంగుల పట్ల సమాజం చూస్తున్న తీరును, చూడవలసిన తీరును స్వయంగా తన హృదయ స్పందనతో రాసిన కవిత్వం ఇది. సరళమైన పదాలతో అక్షరమే ఆయుధంగా చేసుకుని వారి మనోవేదనను ప్రపంచానికి తెలియజేసి, వారి ఆత్మగౌరవాన్ని చాటారు. ఇందులో కొన్ని మణిపూసలతో దివ్యాంగుల బాధలు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. అవి పాఠకులకు కంటతడి పెట్టిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.
కందుకూరి భాస్కర్, 9441557188