– 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
– ఇది బీజేపీ కస్టడీ : కవిత
– కోర్టు ప్రాంగణంలో మాట్లాడడంపై స్పెషల్ జడ్జి సీరియస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మళ్లీ తీహార్ జైలుకి తరలించారు. ఇప్పటికే ఈడీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ కస్టడీకి అనుమతివ్వగా సీబీఐ విచారించింది. కస్టడీ ముగియడంతో సోమవారం సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు మళ్లీ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈసారి సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆమెకు తొమ్మిది రోజులు కస్టడీ విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 23 వరకు ఉండటంతో అప్పటి వరకు ఈ కస్టడీ విధిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 23న చేపడతామని స్పష్టం చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజాకు సీబీఐ తరపున సీనియర్ న్యాయవాది పంకజ్ కుమార్ వాదనలు వినిపించారు. కవిత మూడు రోజుల విచారణతో పాటు, కేసు పూర్వాపరాలు, ఎవిడెన్స్, కేసు పురోగతి, ఇతర అంశాలతో మొత్తం 11 పేజీల రిమాండ్ కాపీని కోర్టుకు సమర్పించారు. జ్యుడీషియల్ కస్టడీ అప్లికేషన్‌లో కీలక అంశాలు పేర్కొంటూ… విచారణ సమయంలో లిక్కర్ స్కాంకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించిన్నట్లు తెలిపారు. కానీ కవిత విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల గురించి కవితను ప్రశ్నించినట్లు తెలిపారు. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజరు నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి కవితను ఇంటరాగేషన్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగా తమను తప్పు దోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం… కవితకు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. అనంతరం ఆమెను పోలీసులు తీహార్ జైల్ కు తరలించారు.
ఇది బీజేపీ కస్టడీ : కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ… ‘ఇది సీబీఐ కస్టడీ కాదు. బీజేపీ కస్టడీ. బయట బీజెపోళ్లు మాట్లాడేదే… లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు. రెండేండ్లుగా అడిగిందే అడుగుతున్నారు. కొత్తదేమి లేదు’ అని అన్నారు.
కోర్టు ప్రాంగణంలో మాట్లాడడంపై స్పెషల్ జడ్జి సీరియస్
కవిత మీడియా స్టేట్మెంట్లపై ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆమె న్యాయవాది మోహిత్ రావును ప్రశ్నించారు. మీడియా అడిగితే ఆమె మాట్లాడారని మోహిత్‌రావు కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన జడ్జి … ‘ఆమె ఏం చెప్పాలనుకున్నా, విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి. ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే, కోర్టు బయట మాట్లాడాలి తప్ప, కోర్టు ఆవరణలో, కారిడార్లలో మాట్లాడవద్దని సూచించారు. ఇదే విషయాన్ని కవితకు చెప్పాలని, మోహిత్ రావుకు స్పష్టం చేశారు.