కమ్మని చారు లాంటి కవిత

కార్తీకరాజు ‘అలికిడి’ అనే పేరుతో ఓ కవితా సంపుటి ప్రచురించాడు.మంచి గాయకుడు.పాటలు కూడా రాశాడు.అతను రాసిన ‘కలం సవ్వడి’ కవితలోకి ఓ సారి పయనిద్దాం.
కవులు కవిత్వం రాస్తున్నప్పుడు ఎదుర్కునే పరిస్థితులు ఎన్నో.కలం ముందుకు సాగాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు. కొంత మంది ప్రకతితో మమేకమయిపోతేనే రాస్తారు.కొంతమంది ఒంటరిగా ఇంట్లోనే కూర్చొని రాస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ,ఒక్కో అలవాటు ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో నుండే ఈ కవిత పుట్టుకొచ్చింది. శీర్షికలోనే కలం చేస్తున్న సప్పుడేంటో అర్థమయి పోతుంది. చిన్న కవితే కానీ ఇందులో కవిత్వాన్ని గట్టిగా రాయాలంటే ఏమి అవసరమో తెలియజేసే విషయసారం ఉంది.
కవిత్వం రాయడానికి మనసు సహకరించాలి. సాధారణంగా ఉదయం పూట రాస్తే కవికి కవిత రాయటం ఎంతో సులువు అవుతుంది. సూర్యుడు రాకముందే మొదలుపెడితే సూర్యుడు వచ్చేలోగా ముగింపు దొరికే అవకాశాలు ఉంటాయి.ఈ కవి కవితను ఇందులో ఉదయమే మొదలు పెట్టాడు. ఉదయం అనే మాటతో కవితను ఎత్తుకున్నప్పుడు సూర్యుడు అనేవాడు ప్రతి కవికి అడ్డుతగులుతాడు. కానీ ఇక్కడ ఏ కవి ఎంతలా తనను సముచితంగా కవితలోకి ఒదిగింపచేస్తే ఆ కవిత విజయం సాధించినట్టే.ఎత్తుగడ ఇందులో బాగా కుదిరింది.
వస్తు నిర్వహణలో కవి ఏం చెప్పాలో, ఎంత చెప్పాలో అన్నది ముఖ్యం. ఈ కవితలో కవి తగ్గాల్సిన చోట తగ్గి కవితను నెగ్గించడంలో సఫలమయ్యాడు. ఈ కవితలో కవి చెప్పే విషయం ‘ఇరానీ టీ తాగినప్పుడు కవిత్వం బాగా రాయొస్తుందని’. ఈ విషయాన్ని కవిత్వం చేయడానికి కవి వాడుకున్న పరికరాలు సరిగ్గా సరిపోయాయి. సాధారణ వాక్యాలుగా చెప్పకుండా ప్రతి వాక్యాన్ని కవిత్వం చేయడంలో విజయవంతమయ్యాడు.
1. ఉదయభానుడు కాంతి రేఖలకింద
2. చేతివేళ్ళ మధ్య నిలిచిన కలం
3. కాగిత కాన్వాస్‌ మీద
ఇలా రాసిన కవితా వాక్యాల్లో కవిత్వ భాష పండింది. ఎంత సాధారణంగా రాసినా వాక్యాల్లోనయినా కవిత చేయడానికి ఏదో ఒక శిల్పాన్ని సాధించాల్సిందే. ఇక్కడ కవి వాడుకున్న శిల్పం కవితాపాదాల్లోకి మెరుపును తెచ్చింది.
పైన తీసుకున్న ప్రతీకలు పాతవే కదా అనిపిస్తుంటుంది. అలాంటి సందర్భాలు అందరు కవులకు ఎదురుపడేవే. ఏ కంటెంట్‌ను కవి వాక్యాల్లోకి పట్టుకొచ్చాడో అది సరిగ్గా సరిపోతే చాలు. ఇక్కడ కవి కంటెంట్‌కు తగ్గట్టుగానే కవితను రాబట్టాడు.
ముగింపులో చాలా పరిస్థితులు ఎదురవుతాయి. ఎలా ముగించాలి. ఏ వాక్యమయితే కుదురుద్ది అని. కొన్ని సార్లు కవికి తెలియకుండానే సులువుగా ముగింపు వాక్యాలు వచ్చి కూర్చుంటాయి. ఇలాంటి కవితల్లో చాలా వరకు వాటిని సాధించొచ్చు. ఇక్కడ ‘కవిత్వ చిత్రం’ గీయాలి అన్న కవి తపన బలంగా తెలుస్తుంది.
పది వాక్యాలతోనే కవి మేలిమి కవితను కూర్చాడు. ఈ కవిత మీద కవి ఎంతో శ్రద్ధ పెడితే తప్ప రాయలేడు. కార్తీకరాజు కవిత్వంలో ఆ శ్రద్ధ కనిపిస్తుంది.
కలం సవ్వడి
తొలిపొద్దు వేళ
ఉదయభానుడి కాంతిరేఖల కింద
పొగలుగక్కుతున్న కమ్మని ఇరానీ చారు
గొంతు దిగుతుంటే
నా చేతి వేళ్ళ మధ్య నిలిచిన కలం
ఉవ్విళ్ళూరుతోంది
కాగిత కాన్వాస్‌ మీద
అక్షర విన్యాసం చేస్తూ
కాలాన్ని పట్టి కుదిపేసే
ఓ కవిత్వచిత్రాన్ని గట్టిగా గీయాలని..
– కార్తీక రాజు

 


డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551