డా||బాణాల శ్రీనివాసరావు ‘కుంపటి’ కవిగా చాలా మందికి తెలుసు. దీనిని బహుజన అస్తిత్వనేపథ్యంలో తమ కంసాలి వత్తికి ప్రతీకగా రాశారు. ఇది చాలామందికి చేరువయింది. ఈ దీర్ఘకవితను వివిధ కోణాల్లో పరిశీలించి పలువురు విమర్శకులు వ్యాసాలు రాశారు. ‘పర్యాయపదం’ వీరు రచించిన మొదటి కవితా సంపుటి. ఇటీవల వారు వెలువరించిన ‘రాత్రిసింఫనీ’ లోని ‘సంజీవనిలాంటి పాదం’ అనే కవితను ఈ వారం వర్తమాన కవిత్వం కాలమ్ లో భాగంగా పరిశీలిద్దాం.
ఈ కవిత నిస్తేజంతో నిండిన వాళ్ళలో ప్రేరణను నింపేదిగా ఉంది. కవిత్వం ఏం చేస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికితే శివారెడ్డి గారన్నట్టు మంచి మనిషిగా మారడానికో సాధనంగా నిలుస్తుంది. కవిత్వంలో బలముంటే కవి చెప్పిన విషయం నేరుగా ఆ పాఠకుడికి చేరుతుంది. ‘కవి ఏం చేయాలి’ అనే ప్రశ్న వేసుకుంటేనే ఏ కవి అయినా నిలబడతాడు. కవిత్వం నిలబడుతుంది. ఇందులో బాణాల శ్రీనివాసరావు రాసిన కవిత వాక్యాలు కవిత్వాన్ని నిలబెట్టేవి. శీర్షికలో కవిత్వం ప్రాణవాయువని తెలుపుతూ ‘సంజీవని’ అనే పదాన్ని ప్రయోగించాడు. నిజమేనా అని పునరాలోచించుకున్నప్పుడు ఏ ఒక్కరిని ప్రభావితం చేసినా సరిపోతుంది కదా. ఒక్కరు వందలుగా సాగిపోవచ్చు కదా అనే అభిప్రాయం అడ్డుపడి చేసే పనిని పురమాయిస్తుంది. ఇక్కడ కవి ఆ ఆలోచననే కేంద్రంగా చేసుకున్నాడు. బలమైన వాక్యాలు ప్రయోగించి ప్రేరణను కలిగించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాడు. మనిషిలో విలక్షణతను గుర్తించాల్సిన బాధ్యత సాటి మనిషిలో ఉంది. ప్రోత్సాహమిస్తూ లక్ష్యాలను చేరుకునేట్టు చేసేవారు లేకపోలేదు. వాళ్ళను లోకం తలుస్తుంటుంది. అందులో ముందువరుసలో ఉండేవాడు కవి. ఎత్తుగడలో ఈ కవి వాడినహొ ‘ఒక్క వాక్యం చాలు’ అనే కవితా పాదం కవిత్వం మనిషినిహొ ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది. చీకట్లు నిండిన మనిషిలో వెలుగులు నింపేదే కవిత్వమని చెప్పకనే చెబుతుంది. కవిత్వం బువ్వ పెడుతుందా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ కవితా పాదాలు చదివితే కవిత్వం ఏం చేస్తుందో అర్థమవుతుంది. రెండవ స్టాంజాలో కవి ఊహ బలీయమైనది. జీవన అనుభూతులతో ముడిపెట్టాడు. మనిషి ఎప్పుడూ ఒంటరితనానికి లోనవుతూనో, తనను తాను కోల్పోయిన స్థితిలోనో జ్ఞాపకాలను నెమరువేసుకోవాలి. జరిగిన దాంట్లోంచి తీయని అనుభూతులను ఏరుకోవాలి. అప్పుడే ఆ మనిషి సజీవంగా ఉంటాడు. అలాంటి మనిషిని కవి ఇందులో పరిచయం చేశాడు. కవిగా తాను ఆ మనిషిని తనకు తననే కొత్తగా పరిచయం చేస్తానడంలోనే తన కవితా వాక్యం ఏం చేయబోతుందోననే సూచన చేస్తున్నాడు. బాల్యస్మతులను పట్టివ్వడానికి సాంద్రమైన అక్షరాన్ని కానుకగా ఇస్తానంటున్నాడు. కవిగా తాను ఏం చేస్తున్నాడో చెబుతూ ఇతర కవులకు చేరేలా కవిత్వ నిర్వచనాలను రచిస్తున్నాడు.
జీవిత పార్శ్వాన్ని పట్టి చూపుతూ అమ్మ ప్రేమను, నాన్న బాధ్యతను గుర్తుపట్టేలా వాక్యం రాయాలంటున్నాడు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే సంఘటన ఏంటంటే నాన్న పిల్లవాడిని సరిదిద్దాలనే ప్రయత్నంలో కొడతాడు. చివాట్లు పెడతాడు. అప్పుడు అమ్మ ఓదార్పునిస్తుంది. అలాంటి జ్ఞాపకాలను గుర్తుచేసే వాక్యాన్ని ఈ కవి రాసి ఆ వాక్యమే ఆ మనిషినిహొ తీర్చిదిద్దుతుందనే ఆకాంక్షను వెలిబుచ్చాడు. జీవించటంలోని గొప్పతనాన్ని తెలుపుతూ ప్రేమ పరిమళాల్ని పంచాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. అనుబంధాలు, అనురాగాన్ని మానవీయతలో పోతపోసే తొలకరి వాక్యాన్ని ఈ కవితాపాదాల్లో నింపాడు. స్వార్థంతో నడుస్తున్న ఈ మానవచక్రం ప్రేమను నింపుకోగల కవిత్వం రాయాలని కవి ఆర్జీ పెడుతున్నాడు. మనిషి భూత, భవిష్యత్తు, వర్తమానంలో ఎప్పుడైనా, ఎక్కడైనా సమతూకంగా ఉండాలి. ఒకదాని మీద స్వారీ చేస్తూ ఇంకోదానిని విస్మరించకూడదు. ఆ విషయాలు ప్రతిబింబించేలాహొ కవి ఈ కవిత్వం ద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని హితవు పలికి జీవనసారాన్ని వాక్యాల్లోకి నింపి తాగిస్తున్నాడు. మనిషి తనకో ప్రత్యేకతను సంతరించుకొని జీవించాలని, చరిత్రలో నిలబడేలా ముందుకు వెళ్ళాలని ముగింపులో దిశానిర్దేశం చేశాడు.
ఎత్తుగడలో ప్రశ్నగా మొదలయిన వాక్యాల దొంతర, బలీయమైన సందేశాత్మక సమాధానంతో ముగిసింది. వాక్యం, కవిత్వం ప్రాధాన్యత సమాజాన్ని, వ్యక్తి జీవితాన్ని సరైన మార్గంలో పెట్టడానికి, మళ్ళీ తనను తాను మరిచిన మనిషిని పునరుజ్జీవింపచేయడానికి ఔషధంలా వ్యవహరిస్తుందనే కవితా పంక్తులు స్మరించుకోదగినవి. ఈ కవి ‘ఒక్క వాక్యం చాలు’ అన్నాడు కానీ లోతు కెళ్ళి చూస్తే ‘ఒక్కడు మారినా చాలు’ అనే అర్థం బలంగా ధ్వనిస్తున్నది.