కవిత్వం ఒక అన్వేషణ. ఆ అన్వేషణలో తనను తాను వెతుక్కునేలా చేస్తుంది. జీవితాన్ని అర్థం చేయిస్తుంది. తప్పును, ఒప్పును వేరు చేస్తూ లెక్కలు కడుతుంది. వాస్తవికతను కోరుకుంటుంది. కవిని ప్రక్షాళన చేస్తుంది. కవిలోని అంత:సంఘర్షణే కవిత్వమయి ముందుకొస్తుంది. అలాంటి కోవకు చెందిన బిల్లా మహేందర్ కవితThe Last Stage ఎంతో ఆలోచింపజేసింది. కవిత నిర్మాణం ఆకట్టుకుంది. ఈ కవితలో ఒక్కో స్టాంజాలో ఒక్కో అంశం గురించి చెప్పినట్టుగానే ఉంటుంది కానీ ముగింపుకొచ్చేసరికి అన్వయం ఎక్కడా తప్పదు. ఇలాంటి కవితలు రాయటంలో ఈ కవి ప్రత్యేకత సంతరించుకున్నాడు. శీర్షిక నుండి, వస్తునిర్వహణ నుండి ముగింపు వరకు ఓ ధారలా కురిసిన కవిత ఇది.
కవితా శీర్షికలోనే ఎన్నో నిగూఢమైన అంతరార్థాలు దాగి ఉన్నాయి. మనిషితనానికి ముగింపు దశ, మంచితనానికి ముగింపు దశ వచ్చిందని గుర్తుచేస్తున్నట్టుగా ఈ శీర్షిక ఉంది. కవి పెట్టిన ఈ శీర్షిక హెచ్చరికలాంటిది. ఇది రాబోయే రోజుల్లోని పరిస్థితులను కళ్ళముందు పరిచే సూచిక కూడా.
జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు ఉంటాయి. బాగా కష్టపడ్డ వ్యక్తికి కాస్త అదృష్టం తోడయితే అత్యున్నత స్థానం చేరుకుంటాడు. వారి వారి విజయాల వెనుక కొంతమంది సహకారం ఉంటుంది. ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ కవి ఎత్తుగడ వాక్యాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరువద్దు అంటున్నాడు. ఆకాశాన్ని చేరుకున్నవాడు ఆధారమయిన నేలను మరువద్దు అంటున్నాడు.
రెండవ స్టాంజాలో బ్రతుకంతా కృత్రిమమైందని, పలకరించేవాడే కరువయి పోయాడని, నలుగురు కలిస్తేనే మాటలు ప్రవహించేవని, నవ్వులు మొగ్గలేసేవని, కష్టాల ముల్లు నాటుకున్న చోట నవ్వులు పూయవని కవి అభిప్రాయపడ్డాడు.
మూడవ స్టాంజాలో డబ్బుకు ప్రతీకగా రంగు కాగితాలను తీసుకొని చెప్పాడు. జీవన విధానాన్ని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియపరుస్తూ డబ్బు దేన్నయినా శాసిస్తుందని తెలిపే కవితావాక్యాలను మనకందించాడు. నాల్గవ స్టాంజాలో రాసిన రెండు లైన్లలో ఎంతో విస్తృతార్థం ఉంది. సంపాదించటం ఒక ఎత్తయితే దానిని కాపాడుకోవడంలో ఉండే భయం అంతా ఇంతా కాదు. ఎత్తయిన భవంతులు కట్టుకోవటం, కార్లలో తిరగటం ఆనందమే. వాటిని కాపాడుకోవడంలో కంటినిండా నిద్ర కరువయిపోతుందని, బతుకు దినదినగండంగా ఉంటుందని ఎద్దేవా చేశాడు.
నేటి జీవనవిధానంలో చాలా వరకు మనుషులు సాటి మనిషిని పలకరించే స్థితిలో లేరని, పెద్ద పెద్ద గాజు బంగ్లాలు కట్టుకోవటం వరకే పరిమితమవుతున్నారని, చిన్న చిన్న ఇళ్ళల్లో నివసించిన రోజుల్లోనే మనుషులు కడుపునిండా మాట్లాడుకునేవారని, మనుషులను గాజుపలకతో పోల్చాడు. కవి చివరి స్టాంజాలో చెప్పినట్టుగా మనుషులు పగిలిపోయే దశలోనే ఉన్నారు. ప్రమాదకర పరిస్థితులకు ప్రతిబింబంగా గాజుపలక ముక్కలవుతుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. కవి చెప్పినట్టు మనుషులిప్పుడు మాటలు కరువయి బీటలు వారిన గాజుపలకలు.
కవిత్వం ద్వారా కవులు మనుషులను అతికించుకుంటూ రావాల్సిన అవసరం చాలా ఉంది.
ముగింపులో జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిందని, ఇకనుంచయినా మేల్కొనాల్సిన అవసరం ఉందని కవి గుర్తుచేస్తున్నాడు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న స్పృహను కలిగిస్తూ, భళ్ళున పగిలి ముక్కలవకముందే జాగ్రత్త వహించాలంటున్నాడు.
The Last Stage
ఆకాశంలో
ఎగరడం నేర్చుకున్నాక
నేల దిగడం మరిచిపోయాను
పెదాల మీద
పల్లేరు మొలిచాక
నవ్వడమే మానేసాను
రంగుల కాగితాలే జీవితమయ్యాక
బతుకులో సారాంశం తప్పింది
ఎత్తైన కోటలు భవంతులు కట్టుకున్నాక
కంటినిండ కునుకే మాయమైపోయింది
బతుకు అద్దాల మేడలో ఇరుక్కుపోయాక
కడుపునిండ మాట్లాడే మనిషే కరువైపోయి
జీవితం ఓ గాజుపలకగా మారింది
ఇక
చేజారి ముక్కలవడమే మిగిలింది!
– బిల్లా మహేందర్
– డా||తండా హరీష్, 8978439551