ఈడీ కస్టడీకి కవిత

A poem to ED custody– నా అరెస్ట్‌ కట్టుకథతో కూడినది..న్యాయపోరాటం చేస్తా : కవిత
– ఉత్తర్వులు విడుదల చేసిన రౌస్‌ ఎవెన్యూ కోర్టు
– స్పెషల్‌ జడ్జి నాగ్‌పాల్‌ ముందు కవితను హాజరుపరిచిన ఈడీ అధికారులు
– సుమారు 3 గంటల పాటు సాగిన వాదనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు రౌస్‌ ఎవెన్యూ స్పెషల్‌ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను మరోసారి తమ ముందు హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే ఇంటి భోజనం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయం (ప్రవర్తన్‌ భవన్‌)లో రాత్రంతా ఆమెను ఉంచారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను రౌస్‌ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో స్పెషల్‌ జడ్జి ఎంకె నాగ్‌ పాల్‌ ముందు హాజరుపరిచారు. కవిత అరెస్ట్‌ కు సంబంధించిన 14 పేజీల రిపోర్ట్‌ను కోర్టుకు ఈడీ అధికారులు అందజేశారు.
దీని ఆధారంగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కవితతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతివ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టును కోరగా, దీనిపై స్పందించిన జడ్జి నాగ్‌ పాల్‌… సీనియర్‌ అడ్వకేట్‌ విక్రమ్‌ చౌదరి, మోహిత్‌ రావు, మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, బీఆర్‌ఎస్‌ న్యాయ సలహావాది సోమ భరత్‌ కుమార్‌కు కోర్టు ఐదు నిమిషాల సమయమిచ్చారు. మధ్యాహ్నం 12:02 నిమిషాలకు వాదనలు ప్రారంభం కాగా దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. మధ్యాహ్నం 1:30 వరకు వాదనలు కొనసాగగా, ప్రత్యేక న్యాయస్థానం లంచ్‌ బ్రేక్‌ ఇచ్చింది. తర్వాత 2 గంటలకు మరోసారి వాదనలు ప్రారంభం కాగా, అరగంట పాటు ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. అనంతరం 2:30 నిమిషాలకు వాదనలను ముగిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం, 5 గంటలకు ఉత్తర్వులు రిలీజ్‌ చేసింది. ఇందులో కవితను 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కవితది అక్రమ అరెస్ట్‌, ఈడీ ఉల్లంఘనలకు పాల్పడింది : సీనియర్‌ న్యాయవాది
తొలుత కవిత తరపు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్‌ అధికార దుర్వినియోగమని ఆరోపించారు. 2023 సెప్టెంబర్‌ 15న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ సందర్బంగా… కవితకు నోటీసులు ఇవ్వబోమని, బలవంతపు చర్యలు చేపట్టబోమని ఈడీ తరపు అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జి) ఎస్‌వి రాజు ధర్మాసనం ముందు చెప్పారన్నారు. ఈడీకి న్యాయవాది ఎస్‌వి రాజు చేసిన వ్యాఖ్యలను దేశం మొత్తం చూసిందని, వార్తా పత్రికలు కూడా రాశాయన్నారు. కానీ మౌఖికంగా చెప్పిన ఈ మాటలను దర్యాప్తు సంస్థలు కవిత అరెస్ట్‌తో ఈడీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందన్నారు.
ఇది బ్లాక్‌ డే గా మిగిలిపోతుంది : అడ్వకేట్‌ విక్రమ్‌ చౌదరి
కవిత విషయంలో ఈడీ అధికారులు వ్యవహరించిన తీరు సరికాదని ఆమె తరపు అడ్వకేట్‌ విక్రమ్‌ చౌదరి అన్నారు. ఇది ముమ్మాటికీ దేశ చరిత్రలో ఒక బ్లాక్‌ డేగా మిగిలిపోతుందని తెలిపారు. మరోసారి కౌంటర్‌గా వాదనలు వినిపిస్తూ… ఈడీ అధికారులు రాతలో ఒకటి, మనసులో మరొకటి, చేతల్లో ఇంకోటి చూపుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఒక చార్జిషీటు, మూడు సప్లిమెంటరీ చార్జిషీట్‌లు దాఖలు చేశారని అన్నారు. 2022లో ఇంటికి వచ్చి కవితను విచారించారని గుర్తుచేశారు. సీబీఐ సాక్షి అంటుందని, ఈడీ నిందితురాలు అంటుందని, ఇంతకీ కవిత సాక్ష్యా, నిందితురాలా? దర్యాప్తు సంస్థలే చెప్పాలన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ (పిఎంఎల్‌ఏ) యాక్ట్‌ ప్రకారం… సీఆర్పీసీ సెక్షన్లు వర్తిస్తాయని, ఈడీ అధికారులు మాత్రం సీఆర్పీసీ సెక్షన్లు వర్తించవని విభిన్నంగా వాదిస్తున్నారని అన్నారు.
లిక్కర్‌ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారు : అడ్వకేట్‌ జోసెఫ్‌ హుస్సేన్‌
కవితను చట్ట ప్రకారమే అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తరపు అడ్వకేట్‌ జోసెఫ్‌ హుస్సేన్‌ వాదనలు కొనసాగిం చారు. కవితపై బలవంతపు చర్యలు తీసుకోమని ఎప్పుడూ సుప్రీంకోర్టులో చెప్పలేదన్నారు. జూలై 20, 2023న విజరు మదన్‌ లాల్‌ కేసులో నళిని చిదంబరానికి ఊరట వచ్చిందన్నారు. నళిని చిదంబరం కేసులో పది రోజుల వరకు నోటీసులు ఇవ్వమని చెప్పామ న్నారు. ఆ వాదనలను కవితకు కన్వినెంట్‌గా మార్చుకున్నారని చెప్పారు. అంతేతప్ప ఎక్కడా సుప్రీంకోర్టు వాదనలకు ఉల్లంఘనలు జరగలేదని వాదిం చారు. కవిత విచారణలో వాస్తవాలను అంగీకరించకపోవడంతో అరెస్ట్‌ చేశా మని చెప్పారు. లిక్కర్‌ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారు. విజరు నాయర్‌, అరుణ్‌ రామ చంద్ర పిళ్లై, మాగుంట రాఘవ రెడ్డి, అభిషేక్‌ బోయిన పల్లి, శరత్‌ చంద్ర, బుచ్చిబాబులు కలిసి పేపర్లు తయారు చేశారు. ఇందులో ‘మేడమ్‌ కు 33 శాతం’ వాటా ఉందని బుచ్చిబాబు, రాఘవలు తమ స్టేట్మెంట్‌ లో చెప్పారు. వారి వాట్సాప్‌ చాట్‌లో ఈ అంశాలున్నాయి. మార్చి 11, 2023 లో ఈడీ నోటీసులు అందాక… ఆధారాలు ధ్వంసం చేశారని ఆరోపించారు.
ఇది ఫ్యాబ్రికేటెడ్‌ కేసు…:కవిత
తనపై పెట్టిందని ఫ్యాబ్రికేటెడ్‌(కట్టుకథ) కేసు అని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కవిత అన్నారు. కోర్టు హాల్‌లోకి వెళ్లేముందు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు. కాగా, విచారణ సందర్బంగా కోర్టు హాల్‌లో స్పెషల్‌ జడ్జి నాగ్‌ పాల్‌ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక చైర్‌లో కవితను కూర్చోబెట్టారు. కవితకు మద్దతుగా ఆమె భర్త అనిల్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ న్యాయ సలహదారు సోమ భరత్‌ కుమార్‌, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఏఏజీ రామచంద్ర రావు, ఆమె అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు కోర్టుకు వచ్చారు. కాగా, కోర్టు ఉత్తర్వుల తర్వాత కవితను భారీ సెక్యూరిటీ మధ్య కోర్టు హాల్‌ నుంచి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కవిత పిడికిలి బిగించి ధైర్యాన్ని చూపించారు. అనంతరం రౌస్‌ ఎవెన్యూ కోర్టు నుంచి పోలీస్‌ కాన్వారు మధ్య ఆమెను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.