అద్దంలా పగిలిన కవిత్వ హృదయం

అద్దంలా పగిలిన కవిత్వ హృదయంనీటి దీపం (2019), ఇన్బాక్స్‌ (2020) తరువాత తండా హరీష్‌ గౌడ్‌ ఈ ‘గాలిలేని చోట’ ప్రచురించాడు. కవిత్వ కృషిలో నిరంతరాయత కలిగి ఉన్న కవి హరీష్‌. అతన్ని క్రమంగా చదివిన వాళ్ళకి అతని కవిత్వంలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పుస్తకంలోని ‘పద్యం నా లైలా, పద్యం నా అనార్కలి, పద్యమే నా ప్రేయసి’ లాంటి కవితా వాక్యాలు గత పుస్తకాల్లో కనబడవు. కవిలో మెరుగైన కళాత్మక లక్షణానికీ పుస్తకం చేర్పునిచ్చింది. హరీష్‌ కవిత్వంతో బాటు వ్యాసమూ రాస్తున్నాడు గానీ, కవిత్వంలో సౌందర్య వివేచనకి ప్రాధాన్యతని పెంపొందించాడు. హరీష్‌ కవిత్వం వస్తునిర్ణాయకంగా ఉంటుంది. పెరిగిన రూప పరమైన శ్రద్ద, అవగాహన క్రితం కంటే ఈ కవిత్వాన్ని భిన్నం చేస్తాయి. పునరుక్తులు చాలా స్వల్పం. కవితలన్నీ భావ శబ్దలతతో పరమ సరళంగా ఉంటాయి. హరీష్‌ కవితా వస్తువుల్ని ఎంచుకోవడంలో నిస్సంకోచంతో బాటు నిర్దిష్టత నిర్వహిస్తాడు. మానవ స్వభావాల్ని, అందులో వచ్చే అనేక మార్పుల్ని కరోనా నేపథ్యంలో ‘స్విచ్చాఫ్‌’ లాంటి కవితల్లో తెలియజెబుతాడు కవి. అసలు పుస్తకం శీర్షికే ‘ఆక్సిజన్‌ నా ఖరీదు పెరిగిపోతుందని గల్లా ఎగరేస్తుంద’నే గాలి లేని చోట బ్రతుకుతున్న మనుషుల గురించి ఆలోచన కలిగిస్తుంది. ఆ మేరకు వ్యవస్థలో అనేక రూపాలుగా ఊపిరాడని తనం ఎలా పెరిగిపోతున్నదో కవి ఈ పుస్తకంలో కవితలుగా మన ముందుకు తీసుకు వస్తాడు. వివక్షకు గురై మరణించిన దళిత మరియమ్మ గురించి (ఆమె ఏం చేసిందని), రెజ్లర్ల సమస్య మీద (హెచ్చరిక), హిజాబ్‌ గురించి (అస్తిత్వ పతాక)… ఇలా అనేక వర్తమాన సామాజిక విషయాల పట్ల కవి గమనింపు ప్రశంసార్హమైనది. ఆఫ్గన్‌ యుద్ధ సమస్యలు, బిల్కిస్‌ బానో సంఘటన, సందర్భవశాత్తుగా గమనించే దేశపు కుళ్ళు రాజకీయాలపై కూడా కవితలుంటాయి. హరీష్‌ కవిత్వ వస్తువు ప్రగతిశీల దృక్పధానికి కట్టుబడి ఉంది. తన వయుక్తిక భావనల మూలంలో కూడా సజీవమైన ఒక జీవితాన్వేషణ ఉంది. ఆ జమిలీనే మనల్ని కవి నూతన భావజాల లక్ష్యానికి గురిచేస్తున్న భ్రమని కలిగిస్తుంది.
వస్తు సమగ్రత గురించి ఆలోచిస్తే విశాలమైన దళిత బహుజన స్పృహ ఉన్నప్పటికీ, కవి సామాజిక అవగాహన విషయంలో ఉపరితల విన్యాసమే ఎక్కువగా కనిపిస్తుంది గాని, తగు లోతుల్లోకి మరింతగా వెళ్ళవలసి ఉంది. అసమానతల్ని పెంచి పోషించే ఆర్ధిక సాంఘిక పర్యవసానాల పట్ల వర్తమాన కవుల వెలుగు చాలా విలువైనది. అవసరం కూడా. పాలకవర్గ సంకీర్ణ స్వభావాల్ని సరిగ్గా అంచనా వేయగలిగిన కవి కనుకనే ప్రజాస్వామిక కాలం కోసం తహ తహ లాడుతాడు హరీష్‌. స్త్రీ కేంద్రకంగా రాసిన కవిత్వంలో చెప్పలేనంత స్వేచ్చా పిపాస ఉంటుంది.
కవిలోని కవిత్వ చైతన్యానికి అనుపమానమైన నిజాయితీ కారణం కావడం చేత ప్రతి కవితకూ చదివించే లక్షణం చక్కగా అమరింది. హరీష్‌ కి పెరిగిన అలంకారిక శ్రద్ద, అతని ఊహలకి సరికొత్త అల్లికని సమకూర్చి పెట్టింది. ప్రతీకలు బాగుంటాయి. చెప్పదలుచుకున్న విషయానికి న్యాయం చేసిన ప్రతీకలు ఎక్కువ. ‘జ్ఞాపకాల చేప పిల్లలు, తిరోగమనం, మచ్చల పెట్ట, కవి’ లాంటి కవితలు అతని భావుకతకి అద్దం పడతాయి. బహుతక్కువ అన్వయ దోషాలుంటాయి (నాలుగోరకం మనిషి). నైరూప్యం లేకపోయినప్పటికీ కొన్ని కవిత్వ సంకేతాల ప్రయోగం కవిలోని చమత్కారశీలతని తెలియజేస్తాయి. అన్నీ గంభీరమే. లేశమాత్రం కూడా ఇమడని రస ప్రయోగం ఉండదు. అపహాస్యమూ, ఎగతాళీ లాంటివి కనబడవు. కానీ అతని కోపాన్ని, విస్పష్ట వ్యంగ్యాన్నీ ‘నేర్చుకోవాలిక’ ‘ఇంతకీ తప్పిపోయింది’ ‘సోకంటే’ ‘వాళ్ళకంతే తెలుసు’ లాంటి కవితల్లో తెలుసుకోవచ్చు. ఈ కవిత్వంలో ఉన్న కథనశైలి కి ‘అమ్మమ్మ ప్రేమ కన్న’ ‘ఒక్కప్పుడు అడవి ఉండేది’ సాక్ష్యాలుగా నిలబడతాయి. విలువైన బాల్యాన్ని, అమాయకమైన పిల్లల కోసం కవి పడ్డ తపనని మనం ఎంతో సున్నితంగా ఆలోచిస్తే తప్ప ఆయా కవితల్ని అర్ధం చేసుకోలేం. ‘న్యూ టైం టేబిల్‌’ ‘ఉచ్చు’ కవితలు ఆ కోవలోవే.
‘దిష్టి చుక్కలు, మూలుగు రాగం, మరో చెట్టు పుట్టుక, ఎర్రని పెదాల వెనుక’ కవితలు కవి తన కవిత్వ మనుగడను శాసించిన విధంగా ఉంటాయి. ఇటువంటివి మరిన్ని రాయవలసి ఉంది. చెల్లె గురించి రాసిన ‘పండగెట్టైతది’ తల్లితండ్రుల గురించిన ‘అమ్మ కావ్యం’ ‘దిక్సూచి’ కవితల్లోని కుటుంబ సంబంధాల విలువలు మన హృదయాల్ని కదిలిస్తాయి. కవి మానవ సంబంధ హేతువులన్నింటినీ ప్రకృతి ప్రేమలో ఎందుకు వెతుక్కోవాలో ఒడుపుగా గుర్తిస్తాడు (‘నదితో మాట్లాడాలి). మొత్తంగా హరీష్‌ ఈ కవితలన్నింటిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం చాలా నచ్చుతుంది. ఎంత శిల్ప వ్యామోహాన్ని ప్రదర్శించినప్పటికీ అతనిలో ఉండే సహజమైన నిరాడంబర శైలి వల్ల ఈ కవితల్ని మనం గుండెలకు హత్తుకుంటాం. మన తాదాత్మ్యతలో అంతర్గతంగా తన సులభ శైలీ విన్యాసం ఉంటుంది. కవితలో వినిపించే సౌందర్య స్వరం పరమ లౌకికమైనదిగా ఉండటం చేత హరీష్‌ బాధ్యత తెలిసిన కవి. నేల విడువని కవిత్వ ప్రేమికుడు. వదిలేసుకోవడంలో అనేక సూక్ష్మాలు తెలిసిన ఆరిందాలా మాటాడతాడు హరీష్‌ గౌడ్‌. కానీ తన కవిత్వాన్ని ఎవరూ అంత తేలిగ్గా వదల్లేని తనంలోకి మాత్రం మనల్ని తప్పక నెట్టివేస్తాడు.
– శ్రీరామ్‌ పుప్పాల, 9963482597