ఈ తరం కోసం కవితా ఉద్యమం

A poetry movement for this generation1943 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం, సకల సాహిత్య ప్రక్రియలను ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసింది. మహౌన్నతమైన ఆ వారసత్వాన్ని స్వీకరించిన అరసం గుంటూరు జిల్లా శాఖ, సాహిత్యం ద్వారా సామాజిక అభ్యుదయాన్ని కాంక్షిస్తూ నిరంతర కృషిని కొనసాగిస్తూనే ఉంది.
సమాజంలో నేడు నెలకొన్న పరిస్థితులలో మహా సంస్థలు, మహనీయులు నెలకొల్పిన విలువలు పతనమవుతున్నాయి. మంచి అనే ప్రతిదీ వెనుకబడిపోతుంది. సాహిత్యానిదీ అదే దుస్థితి. ఈ విషమ పరిస్థితులలో సాంస్కృతిక పునర్వికాసం అవసరాన్ని గుర్తిస్తూ అరసం విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ”ఈ తరం కోసం కథాస్రవంతి” శీర్షికన ప్రముఖ కథకుల ప్రసిద్ధ కథలతో ఇప్పటికీ 51 కథా సంపుటాలను ప్రచురించారు. ఇవి అశేష పాఠకుల ప్రజాదరణను పొందాయి. ఈ పుస్తకాల సెట్టును స్కూళ్ళు, కాలేజీలు- ఇతర పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారిలో మంచి కథలు- కథకుల గురించి పరిచయం, ఆసక్తి కలగడానికి ఆస్కారం ఏర్పడింది. వివాహాది శుభకార్యాల్లో ఈ పుస్తకాల సెట్టును అతిథులకు బహుమానాలుగా ఇవ్వడం అనే మంచి సంప్రదాయం ఏర్పడడం సంతోషకరమైన విషయం.
సాహిత్య ప్రక్రియలలో పాఠక లోకం అభిమానాన్ని పొందిన ప్రక్రియ వచన కవిత. పోరాటాలే స్ఫూర్తిగా చైతన్యవంతంగా కొనసాగిన చరిత్ర వచన కవితకుంది. నేడు ‘ఈ తరం కోసం కవితా స్రవంతి’ శీర్షికన అభ్యుదయ ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన కవుల మేలైన కవితలతో సంపుటాలను ప్రచురించాలని అరసం నిర్ణయించింది.
నేటి కవులు పాత విలువలను తిరస్కరిస్తున్నారు. పాత విశ్వాసాలను ప్రశ్నిస్తున్నారు. పాత విషయాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటుకు ప్రతీక వచన కవిత అని నిర్ధారించారు నండూరి రామమోహనరావు. వచన కవితకు శిష్ట్లా రూపురేఖలిస్తే, శ్రీశ్రీ భావజాల బలాన్ని సమకూర్చారు. కుందుర్తి ప్రజాస్వామ్యీకరణ గావించారు.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా యువకులు కవిత్వం పట్ల మక్కువ చూపుతూ రచనలు చేస్తున్నారు. ఇది సంతోషించదగిన విషయం. అయితే ఎక్కువ మందిలో అధ్యయనం, అవగాహన, సిద్ధాంత నేపథ్యం కొరవడటం కనిపిస్తుంది. మార్గదర్శకులు, దార్శనికులు అయిన ప్రసిద్ధ కవుల కవిత్వ అధ్యయనం ద్వారా, యువకవులు అభివృద్ధి పథంలో అభ్యుదయ మార్గంలో కొనసాగాలన్న ఉద్దేశంతో అరసం ఈ కవితా సంపుటాల ప్రచురణకు పూనుకున్నది.
కవిత్వం పట్ల ఇష్టం – ఆసక్తి ఉన్న విషయ నిపుణుల్ని సంపాదకులుగా ఎంపిక చేసుకొని, ఒక కవిని వారికి కేటాయించి ఆ కవి రాసిన కవిత్వంలోని మెరుగులను లేదా మంచి కవిత్వాన్ని ఎంపిక చేయాలి. అది కూడా వారి సంపాదకీయ వ్యాసంతో కలిపి 56 పేజీలకే పరిమితం కావాలి. నిజంగా ఇది చాలా కష్టసాధ్యమైన పని. కత్తి మీద సాము లాంటిది. ఉదాహరణకు సి. నారాయణరెడ్డి రాసిన 93 పుస్తకాలలో నుండి 33 వచన కవిత్వ సంపుటాలను పరిశీలించి, ఆ కవిత్వాన్ని ఎంపిక చేయడంతో కాకుండా – సినారే తన చుట్టూ ఆవరించిన వాతావరణాన్ని ఏ తీరుగా కవిత్వీకరించారో కొన్ని ప్రధాన కవితల ఆధారంగా డాక్టర్‌ ఎస్‌.రఘు నిరూపించిన విధానం ప్రశంసనీయం. గురజాడ వస్తువులోనూ, శిల్పంలోనూ, భాషలోనూ, భావనలోనూ విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చాడు అంటూ జీఎస్‌ చలం ‘గురజాడ కవిత’ పుస్తకాన్ని రూపొందించారు. అభ్యుదయ రచనోద్యమానికి సారధి అని కొనియాడబడే పురిపండా అప్పలస్వామి మహౌన్నత వ్యక్తిత్వాన్ని ,సాహిత్య కృషిని వివరిస్తూ చందు సుబ్బారావు ‘పురిపండా అప్పలస్వామి కవిత’ను అందించారు. యువకులు శ్రీశ్రీని చదవాలి. ఎందుకు చదవాలి? అంటూ చర్చిస్తూ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసంతో పాటు ‘శ్రీశ్రీ కవిత’ను పుస్తకంగా తీసుకువచ్చారు. తన జీవితాన్ని ఉద్యమానికి, సాహిత్యానికి అంకితం చేసిన దాశరథి పీడిత ప్రజల పక్షాన నిలబడిన ప్రజాకవి అంటూ నాళేశ్వరం శంకరం ‘దాశరధి కవిత’ను తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించారు. అనుభూతి వాదిగా ప్రశంసించబడే తిలక్‌- నాటి సమాజాన్ని, జనజీవనాన్ని అందులోని వైవిధ్యాన్ని, వ్యవస్థాగత ఫలితాలను తిలక్‌ రసవంతంగా కవిత్వీకరించారంటూ కె.శరత్చంద్ర జ్యోతిశ్రీ ‘బాల గంగాధర తిలక్‌’ కవితను వెలువరించారు.
కన్నీటి లోంచి పెళ్ళుబికిన ధర్మాగ్రహమే కాళోజి కేంద్రాంశం. తాను నమ్మిన దారిలో రాజీపడక సాగిన ఆధునిక ఋషి కాళోజి అంటూ విశ్లేషించిన దర్బశయనం శ్రీనివాసాచార్య ‘కాళోజీ కవిత్వం’లో నుండి ఎంపిక చేసిన వాటిని అందజేస్తున్నారు. అసలు సిసలైన దేశీయమైన, జాతీయమైన వచన కవిగా పేరుపొందిన కుందుర్తి వచన కవితలో చేసిన ప్రయోగాలను వివరిస్తూ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘కుందుర్తి కవిత’లను ఎంపిక చేసి ఇచ్చారు.
ఈ పుస్తకాలు కొత్త తరానికి సరికొత్త కానుకలు. ఒక కవి రాసిన సమగ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేయలేనివారు, రేఖామాత్రంగా ఒక కవి గురించి తెలుసుకునే వారికి శాంపిల్‌గా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఈ పుస్తకాలు మూల గ్రంథాల అధ్యయనం వైపుకు పాఠకుడు మళ్ళేలా దారి దీపంలా నిలుస్తాయి. పాఠకులకే కాదు, కవిత్వం రాయాలనుకునే కొత్తతరంవారికి ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. కొత్తవాళ్లు కవిత్వంలో వస్తువు, శైలి రూపొందించుకోవడానికి ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. గురజాడ ఆశించినట్లు మతాలన్నీ మాసిపోయి, జ్ఞానం నిలిచి వెలగాలంటే యువతరం అంత తప్పనిసరిగా ఈ పుస్తకాలు చదవాలి. చదివించాలి.
– కె.పి.అశోక్‌ కుమార్‌,
97000 00948