అవిశ్వాసంతో మోడీ సర్కారుకు రాజకీయ సవాలు

మణిపూర్‌ ఘోరదురంతాలపై ప్రకటన చేయడానికి, చర్చ జరపడానికి నిరాకరిస్తున్న ప్రధాని మోడీ వైఖరితో పార్లమెంటు విలువైన కాలం వృథా అయిపోతున్నది. మణిపూర్‌ పుత్రికలపై జరిగిన అమానుషానికి దేశమంతా సిగ్గు పడాలని చెప్పిన మోడీ అదే మాట సభలో చెప్పడానికి సిద్ధం కాకపోవడం ఇంతకు కారణమైంది. చర్చకు మొహం చాటేస్తున్న మోడీని దారికి తేవడానికి, మణిపూర్‌తో సహా దేశ పరిస్థితిని సాకల్యంగా చర్చించడానికి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో ఈ ఎత్తుగడకు బ్రేక్‌ పడింది. నోటీసును ఆమోదించి కూడా చర్చకు సమయం నిర్ణయించకుండా కాలయాపన చేయడంలో బీజేపీ సర్కారు డొల్లతనం వెల్లడైపోయింది. తాము చర్చకు సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు ముందుకు రాలేదని హోంమంత్రి అమిత్‌షా ఆరోపించడం ఇందులో భాగమే. వాస్తవానికి ఈ వ్యవహారంలో రెండవ ప్రధానపాత్రధారి అమిత్‌ షానే, హోంమంత్రిగానూ, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ బాధ్యుడుగానూ ఆయనకు కీలకమైన బాధ్యత ఉంది. మహిళలపై సామూహిక అత్యాచారం మే3-4 తేదీల్లో జరిగితే మరో పదిహేను రోజుల తర్వాత పర్యటనకు వెళ్లింది ఆయనే, ఇప్పుడు తెలిసివస్తున్న సమాచారం ప్రకారం అప్పటికే ఆ దారుణఘటనపై పోలీసు స్టేషన్లలో ఎప్‌ఐఆర్‌ నమోదైంది. బాధితులే వచ్చి ఫిర్యాదు చేశారు. ఒక కల్లోలిత రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత కూడా పరిస్థితి తెలుసుకోలేకపోవడం హోంమంత్రి అసమర్థతకు అద్దం పడుతుంది. నిఘా సంస్థలకు ఆధ్వర్యం వహించే మంత్రికి ఈశాన్య రాష్ట్రంలో ఎగుస్తున్న మంటలు కనిపించలేదంటే ఎలా విశ్వసించడం? అక్కడకు పర్యటనకు వెళ్లినప్పుడైనా ప్రభుత్వం పోలీసుశాఖ నిఘా వర్గాలు చెప్పలేదా? వందల సంఖ్యలో జరిగితే ఇదొక్కటి పట్టుకుంటారేమని నిస్సిగ్గుగా వాదించిన ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ చెప్పలేదా? ఈశాన్య చాణక్యుడుగా చెప్పుకునే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ నివేదించలేదా? ఇంతకన్నా ఆత్మవంచన మరేముంటుంది? అలా అయితే ఇందుకు గాను హోంశాఖ అధికారులు అమాత్యులపై చర్య తీసుకోవద్దా?
వీడియో తీసిన వారి అరెస్టు
ఈ ఘటనతో పాటు మణిపూర్‌లో జరిగిన మరెన్నో అఘాయిత్యాల బాధాకర వివరాలుౖ ఇప్పుడు బయిటకొస్తున్నాయి. వాటిపై ఏ చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దేశవ్యాపితంగా ఇంతగా ఆగ్రహావేశాలు రగిలించిన ఈ కేసులోనే కేంద్రం చేసిందేమిటి? ఆ రోజు వీడియో తీసిన వ్యక్తిని అరెస్టు చేశారట! జరిగింది షూట్‌ చేసి దేశమంతా అందుబాటులోకి తెచ్చినందుకు కేసు నమోదు చేశారట. ఇదే గాక ఇలాంటి ఘటనలు ఎలా ఎన్ని జరిగాయో దర్యాప్తు చేసే బాధ్యత సిబిఐకి అప్పగించారట! ఏదో సామెత చెప్పినట్టు సిబిఐ, ఐబి రా వంటి సంస్థలు సక్రమంగా పనిచేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? పైగా పంజరంలో చిలకగా పేరు మోసిన సిబిఐ ఇలాంటి వాటిని సమర్థంగా వెలికితీసిన ఉదాహరణ ఒకటైనా ఉందా? అన్ని సందర్భాల్లోనూ మారణకాండ జరిగిన తర్వాతనే కదా సిబిఐ రంగంలోకి వచ్చేది? ఈ విషయమైనా ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పలేదు. సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ద్వారా తెలియజేసింది. మీరు చర్య తీసుకుంటారా లేక మేమే రంగంలోకి దిగాలా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ అక్షింతలు వేశాక అనివార్యంగా ఇచ్చిన జవాబిది. సుప్రీం కోర్టు ఇలా అడగడం కూడా ఇష్టంలేని బద్రిశేషాద్రి అనే తమిళ పాత్రికేయుడు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో సిజెఐపైనే అవాకులకు దిగారు. ప్రధాన న్యాయ మూర్తికి ఒక తుపాకి ఇచ్చి పంపిస్తే ఘర్షణలను నివారిస్తారేమో చూడాలని అపహాస్యం చేశారు. అది పర్వతమయమైన సంక్లిష్ట ప్రాంతం. అక్కడ హత్యలు జరుగుతాయి. హింసాకాండ మనం ఆపలేం అని తేల్చిపారేశాడు. దీనిమీద కవి అరసు అనే అడ్వకేట్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఎందరో రచయితలు పాత్రికేయులను నిరంకుశంగా అరెస్టు చేసిన బీజేపీకి ఇది మాత్రం మహాపరాధమైపోయింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వెంటనే తీవ్రంగా ఖండిం చేశారు. అంటే అక్కడ ఆదివాసులపై దాడులను, ఈశాన్యంలో అంతర్యుద్ధాన్ని ఆపకపోగా దేశప్రధాన న్యాయమూర్తినే అపహాస్యం చేసిన వ్యక్తిని విచారించ కూడదన్నమాట. ప్లాటినం తరహా ఖనిజాలతో పాటు అపార సంపదలకు నిలయమైన ఆ ప్రాంతాన్ని బడా కంపెనీల పాలు చేయడానికే కావాలని కల్లోలం సృష్టించి నట్టు కూడా మీడియా సంస్థలసు పేర్కొంటున్నాయి.
వంకర వాదనలతో పక్కదారి
మణిపూర్‌పై మాట్లాడే బదులు అలవాటైన అధ్వాన్న వ్యూహాలన్నిటినీ అమ్ములపొదిలోంచి తీసింది బీజేపీ. బెంగాల్‌, రాజస్థాన్‌లలో మహిళలపై ఇలాంటి ఘటనలే జరిగాయని పోటీ పెడుతోంది. బెంగాల్‌లో జరిగిన ఘటనలను మొన్న ఇదే పేజీలో చర్చ చేశాం. ఆ కుట్రలో బీజేపీకి కూడా వాటా ఉంది. అదలావుంచితే అమానుషాలను నివారించడానికి బదులు ఒకదానికి ఒకటి పోటీ పెట్డడం ఏం రాజనీతి? ఇంకోటి మయన్మార్‌ను చైనాను ఇందుకు కారణంగా నిందించడం. మయన్మార్‌ సైనిక పాలకుల అణచివేత కారణంగా శరణార్థులు వచ్చి తలదాచుకుంటున్న మాట నిజమే. కాని మైతేయి, కుకీ తెగల మధ్య బీజేపీ సృష్టించిన అంతర్యుద్ధానికి వారెలా కారణమవుతారు? ఇక భారత మాజీసైనాధికారి నవరత్నే ఏకంగా చైనానే ఇవన్నిటికీ కారణమని తేల్చిపారేశారు! ఒకవైపున విదేశాంగ మంత్రి జైశంకర్‌ అంతకు ముందు మోడీ చైనానేతలతో చర్చలు జరిపి సంబంధాల మెరుగుదల గురించి మాట్లాడుతుంటూ మాజీ సైన్యాధిపతి ఇలా అనడం దానికి విస్తారమైన ప్రచారం కల్పించంలో విదేశాంగ నీతీ కనిపించదు. బీజేపీకి కేంద్రానికి కావలసింది ఈ గండం నుంచి గట్టెక్కడమే. అందుకు మార్గం ఇతరులపై దాడి చేయడం, చర్చను దారిమళ్లించడం. వాస్తవానికి మణిపూర్‌ అంటున్నా ఈ జ్వాలలు ఈశాన్యమంతటినీ కబళించే ప్రమాదం ఉందని గతవారం ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మిజోరాం ముఖ్యమంత్రి జోమర్తంగా ఇప్పటికే పలురకాల నిరసనలలో, ఆందోళనలలో పాల్గొన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇది తమ భద్రతకు కూడా ముప్పుని హెచ్చరించారు. మిజోరాంలో కుకి, జో, ఉపజాతిప్రజలు అధికంగా ఉంటారు. అక్కడ శరణార్థి శిబిరాలు నిర్వహించడం కూడా బీజేపీ సహించలేకపోతున్నది. వీటన్నిటినీ అస్సాంకు తరలించాలని కేంద్రం ప్రతిపాదించడం అందుకే. అయితే అసాం ముఖ్యమంత్రి హిమంత ఈశాన్య కల్లోలం సూత్రధారులలో ఒకరు. సరిహద్దు రాష్ట్రాలన్నిటితో దానికి తగాదాలున్నాయని గుర్తుచేసుకుంటే ఇదెంత ప్రమాదకరమైన సూచనో స్పష్టమవుతుంది. హిందూ, ముస్లిం తగాదాలను ఇతర జాతి కలహాలను రాజేయడంలో అస్సాంకు దారుణమైన చరిత్ర ఉంది. పాలనాపరంగానూ ప్రజాస్వామిక చర్చలతోనూ సమస్యను పరిష్కరించేబదులు రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడమే బీజేపీ పరమ సూత్రంగా ఉందని ఈ ఉదాహరణలన్నీ విశదీకరిస్తాయి. అత్యాచారానికి గురైన మహిళలను సాటి మహిళలే పట్టించారని మరో విపరీత వాదన కూడా పాలకపార్టీ ప్రచారంలో పెట్టింది. విద్వేషాలు రగిలించిన తర్వాత ఎవరు ఏం చేస్తారో ఎవరు చెప్పగలరు? అందులోనూ మైతేయి ప్రజలను కుకీలపైకి ఉసిగొల్పిన తర్వాత… మైదాన ప్రాంత ప్రజలను కూడా గిరిజనులుగా గుర్తించాలని ఇంపాల్‌ హైకోర్టు బాధ్యతా రహితంగా ఇచ్చినతీర్పును సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఆమోదించాయి. ఆ రాష్ట్రంలోనే గాక మొత్తం ఈశాన్యంలో రాజకీయ మద్దతు పెంచుకోవడానికి ఆడిన నాటకమే ఇంతటి విపత్కర పరిస్థితికి కారణమైంది. ఇప్పుడు మరెవరిపైనో నిందలా?
ప్రతిపక్షాల ప్రతిఘటన, వైసీపీ టీడీపీ వంత
ఒకవైపు ఇంత దారుణమైన నిందలేస్తూనే అమిత్‌ షా ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులైన మల్లికార్జున ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌదరిలకు లేఖలు రాస్తారు. చర్చకు సహకరించాల్సిందిగా లేఖలు రాయడం కన్నా కపటం ఏముంటుంది? ఖర్గే అన్నట్టు ఒకవైపున మోడీ ప్రతిపక్షాలను దేశవ్యతిరేక శక్తులతోనూ. టెర్రరిస్టులతోనూ పోల్చి మాట్లాడుతూ మరోవైపున ఇలాంటి మెత్తటి లేఖలు ప్రయోగిస్తే ఫలితం ఏముంటుంది? ప్రతిపక్షాలు ఇండియా అని తమ కూటమికి పేరు పెట్టుకున్నారు గాని ఇండియన్‌ ముజహిదీన్‌లోనూ, ఈస్టిండియా కంపెనీలోనూ కూడా ఇండియా ఉందని అవహేళన చేసిన మోడీ మాటలు దేన్ని సూచిస్తాయి? నిజానికి చర్చ సంగతి అటుంచి పార్లమెంటులో మణిపూర్‌పై వేసిన ప్రశ్నలకు కూడా ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారు. నేను మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రధాని ప్రగల్భాలు పలుకుతున్నారు. సహజంగా భారతదేశం పెద్దదేశంగా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. అయితే మనకన్నా చైనా ఆరురెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా పెంపొందుతున్నది. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావడమే పెద్ద గొప్ప విషయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకున్న రోజులు ఎవరూ మర్చిపోరు. ఇప్పటికీ కూడా మన ఆర్థిక వ్యవస్థ 3.2 ట్రిలియన్లు దాటలేదు. చైనా 17.3ట్రిలియన్ల దగ్గర దూసుకుపోతున్నది. జీడీపీ గొప్పలు అలా ఉంచి తలసరి ఆదాయంలో మన వెనుకబాటును, అంతులేని అసమానతలను విమర్శకులు మోడీకి సరిగానే గుర్తు చేశారు.
పరిస్థితికి సంబంధించిన పూర్తినిజాలు దేశానికి తెలియడం కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21మంది ఎంపిలు మణిపూర్‌లో స్వయంగా పర్యటన చేస్తున్నారు. దీనివల్ల అక్కడ పర్యటించకుండా దాటేసిన మోడీ తీరుకు అది సమాధానమూ అవుతుంది. ఇంత కీలకమైన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానపాలక పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం అవకాశవాదానికి పరాకాష్ట. ఏపీకీ అనేక విధాల అన్యాయం చేసిన మోడీ సర్కారును నిలదీయడానికి ఈ అవకాశం ఉపయోగించుకునే బదులు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని వైసీపీ నిర్ణయించింది. అమిత్‌షా చెప్పడమే సరైందని ప్రతిపక్షం వైఖరి తప్పని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవచించారు. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపైనా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్‌ మొదట్లో బలపరుస్తామని సూచించారు. అయితే ఎన్‌డీఏలో చేరుతామన్నా చేర్చుకోలేదని, అధికార పూర్వకంగా తమ మద్దతు కోరలేదని ఆపార్టీ కొంత సమయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇంతవరకూ మణిపూర్‌ విషయంలో కేంద్రాన్ని బీజేపీని పల్లెత్తు మాట అన్నది లేదు. కొంత జాప్యం వ్యూహం అనుసరిస్తున్నా టీడీపీ ప్రతిపక్షాలతో ఓటు చేస్తుందన్న అంచనా ఎవరికీ లేదు. కాంగ్రెస్‌తో కలసి వేదిక పంచుకోబోమన్న బీఆర్‌ఎస్‌ మాత్రం వ్యతిరేకంగా ఉంటాననే చెబుతున్నది. ఏది ఏమైనా ప్రభుత్వం పడిపోయే ముప్పు లేకున్నా ఈ అవిశ్వాస పర్వం అయిదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో బీజేపీకి పెద్ద రాజకీయ సవాలుగానే మారింది.
తెలకపల్లి రవి