– రాష్ట్రాన్ని హీటెక్కిస్తున్న నేతల వ్యాఖ్యలు
– దుర్భాషలు, దుందుడుకు మాటలతో కవ్వించే యత్నం
– ఎవ్వరి నోటా విన్నా గేట్లెత్తేస్తాం.. కూల్చేస్తాం.. పడగొట్టేస్తాం మాటలే
– రాజకీయంగా పైచేయి సాధించేందుకు పాట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎండలతోనేగాదు.. నేతల హాట్‌హాట్ కామెంట్లతోనూ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తేదీకి ఇంకా నెలకుపైగా గడువున్నప్పటికీ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం మాత్రం ఇప్పటికే షురూ అయ్యింది. దుర్భాషలు, దుందుడు మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వాగ్ధాటి తీవ్రమైంది. గేట్లెత్తేస్తాం.. కూల్చేస్తాం.. పడగొట్టేస్తాం.. ఖాళీచేసేస్తాం.. ఖతంచేసేస్తాం వంటి మాటల్ని నేతల నోటి నుంచి నిత్యం వినాల్సి వస్తోంది. ఇలా ఎవరికి వారు రాజకీయంగా పట్టు సాధించేందుకు పాట్లుపడుతున్నారు. సోషల్ ఇంజినీరింగ్‌తో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కామెంట్లతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ విమర్శలు, ప్రత్యారోపణల పర్వం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే…చల్ బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే..కాదుకాదు బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే అనే మాటలతో ఇంతకూ ఏ పార్టీ దేనితో మిలాఖత్ అయ్యిందో అనేది అర్థం కానంతగా జనాన్ని అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది. లోగుట్టు పెరుమాండ్లకే ఎరుక. రాజకీయ విమర్శల దాటిలో ప్రజాసమస్యలు, కీలకమైన అంశాలు మరుగునపడిపోతున్నాయనే చర్చ మొదలైంది.
‘మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కల్వకుంట్ల తారకరామారావు పొలిటికల్ కామెంట్ గేమ్‌కు తెరలేపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిచేదాన్ని బట్టి ఆగస్టు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్చులుంటానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బోటాబోటి మెజార్టీ (కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఎక్కువ) ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పైచేయి సాధించేందుకు చాపకింది నీరులా సైలెంట్‌గా మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. లేదు..లేదు..చేర్చుకోం అంటూనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీతో మొదటికే మోసం అన్న భయంతో గేట్లు ఎత్తేసింది. బీఆర్‌ఎస్ కీలక నేతలకు గాలం వేసి మరీ హస్తం ఖాతాలో వేసుకుంటున్నది. బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తామంటూ కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టుగానే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా గులాబీ నేతలు ఫంక్చర్ అయిన కారు(అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను) దిగి చేయి పట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దానం, కేకే, కడియం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ సమయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి తమతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనికి కౌంటర్‌గా బీజేపీ మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ మంత్రులు తమతో ఐదుగురు టచ్‌లో ఉన్నారనీ, తమ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిని టచ్‌చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి బాంబు పేల్చారు. ఇంతకీ ఆ ఐదుగురు మంత్రులెవ్వరూ? కోమటిరెడ్డి లాంటోళ్లు ఐదుగురున్నారని చెబుతూ మహేశ్వర్‌రెడ్డి తన మాటల్లోనే వెంకట్‌రెడ్డి ఒకరని చెప్పకనే చెప్పారు. ఇంకా ఆ నలుగురెవరు? అందులో ఉన్నదెవరు? నిజంగా పొంగులేటి బీజేపీతో టచ్‌లోకి వెళ్లారా? ఇలా లీడర్ల ఒక్కోమాట ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసింది. బీజేపీ స్ట్రాటజీలో భాగంగానే ఏలేటి వ్యాఖ్యలు చేశారనే చర్చా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.
బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనని అవసరమున్నప్పుడల్లా ఒకదానికొకటి సహకరించుకుంటాయనీ, అందుకే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందనే విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెడుతున్నది. తామేం తక్కువ కాదంటూ ఓడిపోయే స్థానాల్లో బీసీలకు, గెలిచే స్థానాల్లో రెడ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఇస్తోందనే ఆరోపణలను ఎక్కుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని బీఆర్‌ఎస్ పార్టీ చూస్తోంది. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పలు సందర్భాల్లో రాజకీయంగా పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాయనీ, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని బీజేపీ ఆరోపిస్తున్నది. అంతిమంగా మూడు పార్టీలూ ప్రజా సమస్యలు, విభజన హామీలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఇలా కీలకాంశాలను మరిచి రాజకీయ వాదులాటల్లో మునిగిపోయారనే విమర్శలొస్తున్నాయి. సోషల్ ఇంజినీరింగ్‌లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఈ విషయంలో బీఆర్‌ఎస్ కాస్త వెనుకపట్టు పట్టినట్టు కనిపిస్తోంది.