పల్లీలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని పచ్చిగాగానీ, వేయించి గానీ, ఉప్పు పట్టించి గానీ తినవచ్చు. ‘రోజుకో గుప్పెడు పల్లీలు తినండి, ఆరోగ్యంగా ఉండండి’ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. మోనోశాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తింటే గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని మోనో శాచ్యురేటెడ్ కొవ్వు గుండెకు మంచిది. శరీరానికి మలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు పల్లీల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువే. యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీన్లు కణాలు, కణజాల మర్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతాయి. హార్ట్ స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్‌ను తగ్గిస్తాయి. ఇవి మన ఆరోగ్యం మీద బహుముఖంగా పనిచేస్తాయి. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు అభివృద్ధి చెందకుండా కాపాడతాయి. పల్లీలో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా సహాయపడతాయి. పల్లీల్లోని విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పల్లీల్లోని ఫ్యాట్ శక్తిగా మార్పు చెందుతుంది. మెటబాలీజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి బాగా సహాయపడతాయి.
ఒక కిలో మాంసంలో లభించే మాంసకృత్తులు అదే మోతాదు పల్లీల్లో లభిస్తాయి. ఒక కోడి గుడ్డు బరువుకి సమానమైన పల్లీల్లో – గుడ్డు కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి. నేల లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్ అని అంటారు. ఇందులో కొవ్వు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. 70% సాచ్యురేటెడ్, 15% పోలి అన్‌సాచ్యురేటెడ్, 15% మోనో ఆన్‌సాచ్యురేటెడ్స్ ఉన్నాయి
యాంటీఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా పల్లీలు మనల్ని కాపాడుతాయి. శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి పల్లీలు. వీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయ పడుతుంది. పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్ అనే పాలిఫినాలిక్ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తి వుంటుంది.
ప్రతి వందగ్రాముల పల్లీల్లో 8 గ్రాముల విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ఇది చర్మనికి హాని కలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్ కారకాలు పేరుకోకుండా అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి రోజుకో గుప్పెడు పల్లీలను తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.
వీటిని ఉడకబెట్టి తినడం, వేయించుకుని తినడం లేదా పచ్చడి, కూరలు చేసుకుని తినడం… ఎలా అయినా తీసుకోవచ్చు. బెండకాయ, దొండకాయ ఫ్రైలలో పల్లీలు వేసి చేస్తే ఆ కూరలకు అద్భుతమైన రుచి వస్తుంది. అంతేకాదు పల్లీలతో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. పల్లీలను తినడం వలన ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పల్లీల్లో పుష్కలంగా దొరికే ప్రొటీన్లు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి నిత్యం ఆహారంలో పల్లీలను భాగం చేసుకోవడం మర్చిపోకండి.
సీజన్‌తో, టైమ్‌తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తినగలిగే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలామందికి వున్నాయి. ఇవి కేవలం అపోహేనని, పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు.
పల్లీలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట. మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. పల్లీల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు. వీటిల్లో ఫోలిక్ ఆసిడ్, ప్రోటీన్స్, చెక్కర ఉన్నాయి. వీటిని తినడం వల్ల రక్తహీనత దరిచేరదు. అంతేకాకుండా ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండాకాలంలో చలువతో పాటు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలో, అలానే చలికలంలో కూడా వేడిని పుట్టించే ఆహారాన్ని తీసుకోవాలి.
ఓ అధ్యయనంలో.. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారిలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం 27 నుంచి 58 శాతం వరకూ తగ్గుతుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గర్భిణులకు పల్లీలు చేసే మేలు అంతాఇంతా కాదు. వీటిల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. గర్భధారణకు ముందూ తర్వాత ఈ ఫోలిక్ యాసిడ్ అందడం వల్ల.. పుట్టబోయే పాపాయిల్లో నాడీ సంబంధ సమస్యలు చాలా మటుకూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పాపాయిలు పుట్టాక కూడా అలర్జీలూ, ఉబ్బసం వచ్చే ఆస్కారం చాలామటుకు తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తులు చాలా అవసరం. అవి పల్లీల నుంచి సమృద్ధిగా అందుతాయి. వాటిని తరచూ పెట్టడం వల్ల పిల్లల మెదడు పనితీరు చురుగ్గా మారడమే కాదు, ఎదుగుదలా బాగుంటుంది. బరువును అదుపులో ఉంచడంలోనూ ఇవి కీలకంగానే పనిచేస్తాయట. పీచూ, కొవ్వూ, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పల్లీలు కాసిని తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అలా ఆకలి తగ్గి.. శరీరానికి అవసరమైన శక్తి అంది, బరువు తగ్గొచ్చు. వేరుశనగతో ఇన్ని లాభాలు ఉన్నాయి.
రోజూ కొన్ని పల్లీలు తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
భూమి లోపల పండిస్తారు కాబట్టి రసాయనాలు, పురుగుమందులు ఎక్కువుగా ఉపయోగిస్తారు. వీటివల్ల కొన్ని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం వుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యులు సూచించిన మేరకు మాత్రమే వేరుశనగలను తినటం మంచిదంటున్నారు నిపుణులు.
తినేటప్పుడు గమనించదగ్గ విషయాలు:
పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావట. పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. కనుక పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో లిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
పల్లీలను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. కనుక పల్లీలను తినగానే కనీసం ఒక పావు గంట తర్వాత నీళ్లు తాగడం ఉత్తమం.
అలాగే గ్యాస్త్ట్రెటిస్, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్ ఫ్లేవస్ అనే ఫంగస్ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్ అనే విష రసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ, నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్ సోకినట్లున్నా వాడకూడదు.
కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. వేరుశేనగలో ఎలర్జీని కలుగజేసే గుణం ఉన్నందున కొందరిలో వీటిని తిన్న వెంటనే ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. వీరికి వేరుశెనగ నూనె కుడా పడదు.
జాగ్రత్తలు: పల్లీలు అందరికీ పడతాయని కూడా చెప్పలేం. వేయించిన పల్లీలు కొందరిలో అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివాళ్లు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834