ఒక ప్రార్ధన

శవం ఎంత రక్తాన్ని కారుస్తుంది
గొర్రెల కాపరి అశ్రద్ధ వల్ల కొండ అంచు నుంచి దూకే
మేక అరిచే శబ్దం ఎలా వుంటుంది?
ఓ దైవమా! ఈ ఏడాది గాయాలపై అద్దటానికి ఒక లేపనం ఇవ్వు.
అత్యాశతో యుద్ధ వేదికలపై ఎందరో శిలువ వేయ బడ్డారు.
వారి స్వస్థలాలైన నదీ ప్రాంతం నుండి ఎంతోమంది
తరిమివేయబడ్డారు ఉప్పునీటి సంద్రం వైపు
ఓ దేవా! దాహార్థులైన వారికి
నా దోసిలితో మంచినీళ్లు ఇచ్చే భాగ్యం కలుగ చేయి.
తాను చూసిన దృశ్యాలకు సిగ్గుపడుతూ ఆ సంద్రం ఎర్రగా మారింది.
ఓ ప్రభూ! దాని అలలను ముద్దిడి వాటిని నీలిరంగులోకి మార్చు.
ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకునే మానవత్వం నేర్పు
ఓ ప్రభూ! పురుగు మందులు వాడని
మామూలు టీ రొట్టెతో కలిపి నాకు ఇవ్వు.
దానిలో కొంత వినయం, కొంత సాంస్కృతిక అహం కలుపు
రక్తంతో తడిసిపోయిన ఎముకలు, ఆస్తిపంజరాలతో వున్న
ఈ భూమిపై గల అమాయకులు, బలహీనులకు కూడా ఇవ్వు.
ఓ దేవా! ఈ ఏడాదైనా అహింసా బీజాలు మొలకెత్తించు
పిల్లలను మతవాదులుగా చేయవద్దు
వారిని కారుణ్యం, వాత్సల్యం వున్న వారిగా తీర్చి దిద్దు.
భూమి పై ఈ స్వర్గం కోసం ప్రజలు వెదికేటట్లు చేయి. ఆమెన్‌!
ఇంగ్లీషు: సాగరి ఛాబ్రా, తెలుగు: కొత్తపల్లి రవిబాబు