
వరికి గిట్టుబాటు ధర కింటాకు 3200 చెల్లించినప్పుడే నిజమైన రైతుకు లబ్ది చేకూరుతుందని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ రిటైర్డ్ తహసిల్దార్, న్యాయవాది ఎల్.భద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఎలా?అనే అంశం మీద సూర్యాపేట అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మూడు సమావేశాల్లో విస్తృతంగా చర్చించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు అందజేస్తున్నామన్నారు. వేసవిలోనే ప్రభుత్వం ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించాలన్నారు. వేసవిలోనే రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే తయారు చేసి,ఉచితంగా రైతులకు పంపిణీ చేసి భూసారాన్ని కాపాడాలన్నారు. తన స్వంత భూమిపై గాని,కౌలుకు తీసుకున్న భూమిపై గాని పెట్టుబడి పెట్టి సాగుచేసి లేదా సాగుచేపించి ఆ భూమిలో పండిన పంటను అమ్ముకునే అధికారం ఉన్న వ్యక్తినే రైతుగా గుర్తించాలని, వారికే కిసాన్ కార్డులను మంజూరు చేయాలని,ఇలా చేస్తే కౌలు రైతుల సమస్య కూడా పరిష్కారం అయినట్టే అన్నారు. కిసాన్ కార్డులు ఉన్నవారికే పెట్టుబడి సాయం(క్రాప్ లోన్),పంటల బీమా,పంట నష్ట పరిహారం ,సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు,కలుపు మందులు,పురుగు మందులు అందించాలన్నారు. ఒక ఎకరానికి రూ.40000 చొప్పున పెట్టుబడి సాయం(క్రాప్ లోన్)బ్యాంక్ ల ద్వారా అతి సులభంగా మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ దుకాణాల ద్వారానే యాబై శాతం సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు,కలుపు మందులు,పురుగు మందులు అందించాలని,అప్పుడే కల్తీ నిరోదించబడుతుందన్నారు. ప్రీమియం చెల్లింపుతో సంబంధం లేకుండా సాగు చేసిన పంటలు అన్నింటికి భీమా సౌకర్యం కల్పించాలన్నారు.పంట నష్ట పరిహారం ఎకరానికి రూ.20000 చెల్లించాలన్నారు. ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్ లు ఉచితంగా అందించాలన్నారు. రైతులు దాన్యం నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు నిర్మించాలన్నారు. రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని,మిల్లర్లు కొనకుండా చూడాలన్నారు. ఐకెపి సెంటర్ లో ధాన్యం కాంటా అయిన తరువాత ధాన్యం తడిసిన అది ప్రభుత్వ భాద్యతే అవుతుంది అన్నారు. వరికి కింటాకు రూ.3200 గిట్టుబాటు ధర చెల్లించాలి. అపరాలు,కూరగాయలు, నూనెగింజల సాగుకు ఆటంకంగా పరిణమించిన కోతుల బెడదను ప్రభుత్వమే నివారించాలన్నారు. కోతులకు సంతానోత్పత్తి నిరోధక టీకాలు వేయాలని, సామాజిక వనాలలో పండ్ల మొక్కలను పెంచాలన్నారు.రైతు బంధు పథకం 5 ఎకరాల లోపుకు పరిమితం చేయాలన్నారు.ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో వేదిక కో-కన్వీనర్ రేపాక లింగయ్య, ఏఐటియుసి నాయకులు దంతాల రాంబాబు,వేదిక సభ్యులు అబ్దుల్ కరీం,చామకూరి నర్సయ్య,ఆవుల నాగరాజు,కోటయ్య తదితరులు పాల్గొన్నారు.