హైబ్రిడ్‌ మోడల్‌కు ప్రతిపాదన

A proposal for a hybrid model– ఛాంపియన్స్‌ ట్రోఫీ వేదికలు మార్చాలంటూ ఐసిసికి బిసిసిఐ విజ్ఞప్తి
ముంబయి: వచ్చే ఏడాది పాకిస్తాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి బిసిసిఐ అభ్యంతరం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్‌ట్రోఫీ షెడ్యూల్‌ ముసాయిదాను పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(పిసిబి) ఇప్పటికే ఐసిసికి సమర్పించింది. అయితే, ఈ షెడ్యూల్‌కు బిసిసిఐ ఆమోదం తెలపలేదు. గత ఆసియా కప్‌ టోర్నీ మాదిరిగానే ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనలను ఐసీసీ ఎదుట బిసిసిఐ ఉంచినట్లు సమాచారం. భారత్‌ మ్యాచ్‌లను వేరే ప్రాంతానికి తరలించి.. మిగతా వాటిని పాక్‌ వేదికగానే నిర్వహించుకొనే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేది లేదని.. భారత్‌ ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాల్సిందేనని బిసిసిఐ పట్టుబట్టినట్లు బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించాయి. ఇప్పటికే టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్‌ను పాక్‌ సిద్ధం చేసింది. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు ముసాయిదా షెడ్యూల్‌లో పాక్‌ లాహోర్‌ స్టేడియాన్ని కేటాయించింది. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ అక్కడే జరుగుతాయని పేర్కొంది. అయితే, భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాక్‌కే వెళ్లకూడదనే కృతనిశ్చయంతో బిసిసిఐ ఉంది. దీంతో భారత్‌ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబారుకు మార్చాలనే కండీషన్‌ను పెట్టింది. ఎనిమిది జట్లతో కూడిన ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. చివరిసారిగా ధోనీ నాయకత్వంలో భారత్‌ 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకొంది. ఇప్పుడు మరోసారి రోహిత్‌ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.
శ్రీలంక షెడ్యూల్‌ ఇదే..
జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు శ్రీలంకతో మూడేసి టి20లతో పాటు మరో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. జింబాబ్వే పర్యటనలో ఉన్న భాగంగా భారత్‌ ఐదు టి20ల సిరీస్‌ ఆడుతోంది. జులై 14తో ఈ సిరీస్‌ ముగుస్తుంది. అనంతరం ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వివరాలను బిసిసిఐ ప్రకటించింది. టి20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలెలో, వన్డే మ్యాచ్‌లు కొలంబోలో జరగనున్నాయి. ఈ పర్యటనకు భారత కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ వ్యవహరించనుండగా.. ఆ టోర్నీలో ఆడే భారతజట్టును బిసిసిఐ ప్రకటించాలి ఉంది.
షెడ్యూల్‌
టి20 సిరీస్‌…
జులై 26 – తొలి టి20
జులై 27 – రెండో టీ20
జులై 29 – మూడో టీ20
వన్డే సిరీస్‌..
ఆగస్టు 1 – మొదటి వన్డే
ఆగస్టు 4 – రెండో వన్డే
ఆగస్టు 7 – మూడో వన్డే