‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. మనీష్ గిలాడ, అరవింద్ కష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్‌తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. శుక్రవారం ఈ చిత్ర టీజర్ లాంచ్‌ని ఘనంగా నిర్వహించారు. నటుడు, నిర్మాత మనీష్ గిలాడ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మాస్టర్ పీస్ మాస్టర్ క్లాస్‌గా ఉంటుంది. మా అందరి కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ‘మనం వరల్డ్ సినిమాలోని ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం. నాకూ చాలా సూపర్ హీరోల సినిమాలు ఇష్టం. ఆ సూపర్ హీరో క్యారెక్టర్‌కు మన పురణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో ఈ సినిమాను ప్రారంభించాను. ఇందులో మన మైథాలజీ సోల్ ఉంటుంది. భాగవతంలోని జయ విజయుల నేపథ్యంతో హీరో, విలన్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే మా పోస్టర్‌లో మిథ్స్ రీ ఇమాజిన్డ్ అని రాశాం’ అని దర్శకుడు సుకు పూర్వాజ్ తెలిపారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో 1500కు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటాయి. వీటిని మెర్జ్ ఎక్స్‌ఆర్ అత్యద్భుంగా చేసింది’ అని అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్, హీరో అరవింద్ కష్ణ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.