– మెలొనీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన జ్వాల
రోమ్: ఇటాలియన్ జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లేబర్(సీజీఐఎల్) పిలుపుమేరకు వేలాదిమంది నిరసనకారులతో రోమ్ లోని పియాజ్జా శాన్ జియోవన్నీ సెంటర్ నిండిపోయింది. మితవ్యయ విధానాలకు పాల్పడటం, రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేయటంవంటి జార్జియా మెలొనీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో కార్మిక సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు, శాంతి సంఘాలు, యువజన సంఘాలవంటి 100 గ్రూపులు పాల్గొన్నాయి. ఈ నిరసన ప్రదర్శనలో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున్న పాల్గొనటానికి కారణం అనేక విభాగాలకు చెందిన ప్రజల డిమాండ్లను బహిరంగంగా పొందుపరచటమేనని సీజీఐఎల్ నాయకుడు మరిజియో లాండినీ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే డిమాండ్ అందరికీ సంబంధించినది కావటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిరసనకారులు చేసిన డిమాండ్లలో ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగ భద్రత, పత్రికా స్వేచ్చ పరిరక్షణ వంటివి ఉన్నాయి. శాంతి సంఘాల కార్యకర్తలు కూడా ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటాలియన్ రాజ్యాంగం యుద్ధాన్ని బహిరంగంగా నిరసిస్తుంది. వివిధ దేశాల మధ్య శాంతి, న్యాయమైన సంబంధాలు కలిగిన ప్రపంచ క్రమాన్ని నెలకొల్పటానికి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి. అయితే ప్రధాని మెలొనీ ప్రభుత్వ విధానాలు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. శాంతిని ప్రోత్సహించటానికి, ఇటలీలో ప్రజా సేవలను బలోపేతం చేయటానికి బదులుగా మెలొనీ ప్రభుత్వం ఆయుధాల మీద, యుద్ధం మీద వ్యయం చేస్తోంది. ఆరోగ్యాన్ని, విద్యను సరళీకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోంది. దీనితో ప్రజలకు ఆహారం, ఇతర అవసర సేవలకోసం జీవన పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ డిమాండ్ల సాధనకు అనేక వామపక్ష సంస్థలు సాధారణ సమ్మెకు పిలుపునివ్వాలని కోరాయి. పారిశ్రామిక సమ్మెతోసహా తాను ఏ చర్యను మినహాయించటంలేదనీ, ఇతర కార్మిక సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం ప్రకటిస్తామని లాండినీ స్పష్టం చేశారు.