– కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: సైన్స్ పరిరక్షణకు పెద్దఎత్తున ప్రజా ఉద్యమం జరగాలని, పక్షపాతాలు, విద్వేషపూరిత ఆలోచనలు, మూఢ నమ్మకాలు, ఆచారాలకు వ్యతిరేకంగా సరికొత్త పోరాటానికి తెరలేపాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. తిరువ నంతపురంలోని లైఫ్ సైన్స్ పార్క్‌లో గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ కేరళను ఆయన ప్రారంభించారు. సైన్స్‌ను పరిరక్షించేందుకు పోరాడేందుకు, అవగాహన కల్పించేందుకు ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం హక్కు కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు. నిజమైన దేశభక్తులు ఆ బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 శాస్త్రీయ మేధస్సును అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని గురించి మాట్లాడుతుందని, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కొందరు శాస్త్రీయ మేధస్సును నాశనం చేసే అహేతుక ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ తరుణంలో కేరళ తన రాజ్యాంగ బాధ్యతలను చేపడుతోందని, అందుకు గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ మంచి ఉదాహరణని అన్నారు. కేరళలోని ప్రతి మూలన సైన్స్ ప్రచార వ్యవస్థలను అమలు చేయడం, వాటిని సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేరళ 36వ సైన్స్ కాంగ్రెస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో లౌకిక విలువలపై దాడి జరుగుతోందన్నారు. సమాజంలో మతోన్మాదాన్ని సృష్టించేందుకు రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మతం, కులం, వర్గం, ప్రాంతం, భాష, సంస్కృతి పేరుతో మన ఐక్యతను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. సైన్స్ స్పృహ, సైన్స్-ఆధారిత సమాజాన్ని తప్పుదారి పట్టించడం స్వార్థ ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు కష్టమని, అందుకే సమాజంలో సైన్స్ వేళ్లూనుకోకుండా నిరోధించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు. చెడు ఆలోచనలు, ద్వేషపూరిత ఆలోచనలు, మూఢ నమ్మకాలు, చెడు పద్ధతులను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో అభద్రతాభావం సృష్టించేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. అధికారంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి పరిణామ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని అన్నారు. చాలా కాలం క్రితం ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఉండేదని, ఆవు ప్రాణవాయువు అని, ఆక్సిజన్‌ను పీల్చివేసేదని కొందరు చెప్పారని తెలిపారు. దేశ ప్రగతికి సైన్స్ కాదు మతమే మార్గమని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ దశలోనే మనం శాస్త్రీయ అవగాహన, హేతుబద్ధమైన ఆలోచనను పెంపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పురోగతికి అనుగుణంగా సాంకేతికతను వివేకంతో సమీకరించి, రాష్ట్ర, దేశ అభివృద్ధికి తగిన రీతిలో వినియోగించుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ దృక్పథమని చెప్పారు. దేశాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించడంతో పాటు సమాజంలో శాస్త్రీయ అవగాహన పెంపొందించే మహత్తర కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. అబద్ధాన్ని బహిర్గతం చేసే తార్కిక, శాస్త్రీయ వివరణను అందించడం సైన్స్‌తో సంబంధం ఉన్నవారి సామాజిక బాధ్యత అని అన్నారు.