దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల రాబోతున్న పెను ప్రమాదాన్ని తన గురువుల ద్వారా ముందే తెలుసుకుంది. పర్యావరణం పట్ల చిన్నతనం నుండే అవగాహన పెంచుకుంది. దీనికి కుటుంబం కూడా ఆమెకు సహకరించింది. ఇక చదువు, అధ్యయనం మొత్తం అవైపే సాగింది. ఉన్నత విద్య పూర్తి చేసి తిరిగొచ్చిన ఆమెకు మన దేశంలో నీటి శుద్ధి ఎంత అవసరమో గ్రహించింది. దీని కోసమే డిటిటల్ పానీ అనే సంస్థను ప్రారంభించి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కృషి చేస్తోన్న మాన్సీ జైన్ పరిచయం…
పాఠశాలలో చదివే రోజుల్లో గణితం, సైన్స్, సాహిత్యం నుండి మాన్సీ చాలా నేర్చుకుంది. పట్టణాభివృద్ధి, వనరుల కొరతతో ముడిపడి ఉన్న సవాళ్ల గురించి ఆమె మొదటిసారిగా తెలుసుకున్నది కూడా అప్పుడే. ‘మాకు అప్పట్లో గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయన భవిష్యత్తులో పర్యావరణం ఎదుర్కోబోయే సమస్య గురించి మాకు వివరించారు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. కుటుంబ నేపథ్యం కూడా ఆమె ఆలోచనల్లో ఓ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎందుకంటే ఆమె తండ్రి పర్యావరణం గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నగరాల్లో పేరుకుపోతున్న వ్యర్థాల గురించి వారింట్లో నిత్యం చర్చలు జరుగుతుండేవి.
చురుగ్గా పాల్గొనేది
పాఠశాలలో మాన్సీ పర్యావరణ మండలి నాయకురాలిగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఆ రోజుల్లోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, గురుగ్రామ్ కోసం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడంపై పరిశోధన చేసింది. తన పాఠశాల, సమీప పరిసరాల్లో రీసైక్లింగ్ డ్రైవ్‌లను నిర్వహించింది. అంత చిన్న వయసులోనే పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించింది. అనతి కాలంలోనే నగరాల్లో పర్యావరణ పరిరక్షణపై ఆమె దృష్టి పడింది. ‘భారతదేశం అంతటా పట్టణీకరణ వేగవంతమైంది. ఫలితంగా వాతావరణం కూడా అనేక మార్పులకుగురౌంతుంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది’ అని మాన్సీ అంటుంది.
పర్యావరణ సమస్యలపై
పర్యావరణం పట్ల ఉన్న అభిరుచి ఆమెను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ పర్యావరణ ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించింది. అలాగే వివిధ విభాగాలలో కోర్సులు చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని నేను దృఢంగా బావించాను’ అని మాన్సీ పంచుకుంటోంది. కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలో, ఇండోనేషియాలోని వరల్డ్‌వైడ్ ఫండ్‌లో వాటర్ రీసైక్లింగ్‌లో పని చేయడం, కళాశాలలో అందుకున్న ఫెలోషిప్‌లు ఆమెకు విభిన్న అనుభవాలను, పర్యావరణానికి సంబంధించిన విభిన్న అంశాలలో మంచి అవగాహన కలిగించాయి.
సొంత మైదానంలో సవాళ్లు
చదువు పూర్తి చేసిన తర్వాత మాన్సీ భారతదేశానికి తిరిగి వచ్చింది. నగరం, దేశం మొత్తం వ్యర్థాల నిర్వహణలో ఎటువంటి పురోగతి సాధించకపోవడం చూసింది. ‘నేను చూసిన సమస్య సాధారణమయింది. పరిష్కారాలు అన్నీ తెలుసు, కానీ ఇది పాలన, విధానకు సంబంధించిన సమస్య’ ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె IDIsight అనే సంస్థలో చేరారు. ఇది డేటా ఆధారిత విధాన రూపకల్పన ద్వారా పేదరిక నిర్మూలనపై పనిచేస్తుంది. అక్కడ ఉన్నప్పుడు పర్యావరణంతో సహా వివిధ అంశాలపై ప్రభుత్వ వాటాదారులతో పని చేసే అవకాశం ఆమెకు లభించింది. ఈ అనుభవంతో పట్టణ పర్యావరణ కోసం పని చేయాలనే ఆమె సంకల్పాన్ని పటిష్టం చేసింది.
మహమ్మారి సమయంలో
నిర్దిష్ట సమస్యల కోసం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌పై లోతుగా అధ్యయనం ప్రారంభించింది. కోవిడ్-19 తాకిన వెంటనే నీటి సంబంధిత సమస్యలపై మాన్సీకి ఆసక్తి పెరిగింది. ‘మహమ్మారి సమయంలో నేను నా కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నాను. నీటిని శుద్ధి చేయడం, రీసైక్లింగ్ చేయడం, నిర్వహించడం గురించి మా మధ్య అనేక చర్చలు జరిగేవి’ అని ఆమె చెప్పింది. 2021లో వాయు కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఆ సమయంలో మాన్సీ తన తండ్రి రాజేష్‌తో కలిసి ‘డిజిటల్ పానీ’ స్థాపించింది. నీటి శుద్ధి, రీసైక్లింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. ‘నీటి శుద్ధి కోసం మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, అవి అవసరమైన విధంగా పని చేయకపోవడం గమనించాను. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నిర్లక్ష్యం కారణంగా వ్యర్థ జలాలు పేరుకుపోతున్నాయి’ అని ఆమె అంటుంది.
పరిష్కారాలు రూపొందించడం
సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్, ఆటోమేటెడ్ హార్డ్‌వేర్ సాధనాలను అందించడం ద్వారా నైపుణ్యం లేకపోవడం, మానవశక్తి లభ్యతపై ఆధారపడటం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వంటి సమస్యలను డిజిటల్ పానీ పరిష్కరిస్తుంది. ఉదాహరణకు ఎక్కడైనా ఓ మురుగునీటి శుద్ధి కర్మాగారం పనికిరాకుండా పోతే డిజిటల్ పానీ దానికి అవసరమైన సహకారం అందిస్తుంది. ‘ఇందులో సమస్యలను గుర్తించేందుకు ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. దీనివల్ల నీటి శుద్ధి సౌకర్యాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి వీలుంటుంది. సమగ్ర విధి నిర్వహణ, ఆటోమేషన్ ద్వారా అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ద్వారా అవి కాలక్రమేణా కార్యాచరణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి’ అని ఆమె అంటుంది.
గుర్తించడంతో ఆగిపోరు
‘నీటి శుద్ధి కోసం మేము మా సాఫ్ట్‌వేర్ డిజైన్ పారామితులను ఇన్‌పుట్‌లుగా ఉపయోగిస్తాం. కాబట్టి సమస్యను గుర్తించడం, చెప్పడంతో మాత్రమే ఆగిపోము. కానీ మొత్తం వ్యవస్థను నిర్వహించడం ద్వారా దాన్ని పరిష్కరించడానికి సహాయం చేస్తాము’ అని ఆమె జతచేస్తుంది. డిజిటల్ పానీ ప్రస్తుతం టాటా, రిలయన్స్ లీలా హోటల్స్, ఢిల్లీ జల్ బోర్డ్‌తో సహా దేశంలోని 12 రాష్ట్రాలలో 50 సౌకర్యాలతో పని చేస్తోంది. 2023 నాటికి వారు రూ. 2.2 కోట్ల ఆదాయంతో ముగించారు. ఈ ఏడాది మరింత అధిక లక్ష్యంతో ఉన్నారని మాన్సీ అంటుంది.
ఈ రంగంలో మహిళలు
రిమోట్ లేదా ఇండిస్టియల్ ఏరియాల్లో మెషినరీని ఇన్‌స్టాల్ చేయడం, ఆపరేట్ చేయడం, గ్రౌండ్ అప్ నుండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం వంటి రంగాల్లో మహిళలు పని చేయడం చాలా అరుదు అని మాన్సీ అంటుంది. దీనితో పాటు ఇంజనీరింగ్ చదువులో అధిక సంఖ్యలో మహిళా డ్రాపౌట్‌లు, ఉద్యోగ అవకాశాల్లో అసమానతల వల్ల ఈ రంగంలోకి ప్రవేశించడం మహిళలకు సవాలుగా మారింది. ‘అందుకే ఈ రంగంలోకి ప్రవేశించే ఏ స్త్రీ అయినా ఈ సవాళ్లకు సిద్ధంగా ఉండమని నేను చెబుతాను. కానీ నీటి శుద్ధి సమస్య దేశంలో తీవ్రంగా ఉంది. ఇటువంటి చోట ఎక్కువ మంది మహిళా నాయకులు ఉద్భవిస్తే పరిష్కారాలు మరింత తొందరగా దొరుకుతాయి’ అంటూ ఆమె సలహా ఇస్తుంది.
శుద్ధి చేస్తున్న ‘డిజిటల్ పానీ’
10:58 pm