నాగలి ఎగరేసిన ప్రశ్న

రాముడే జెండా అజెండా చేసే
ఊదరతో ఊరేగే పాలనలో
బతుకుకు మెతుకే అజెండాగా
ఎత్తినందుకేగా ఈ కర్కశత్వం
మీ పాలన కసిగా ఉసిగొలిపిన
కాఖీల లాఠీ దెబ్బల కాఠిన్యం
ఎంత కాలం ఈ మూర్ఖత్వం?

పచ్చని పొలం పంట సాక్షిగా
ఇప్పుడు గ్రామీణ భారతం
కదం తొక్కి కన్నెర్ర చేసింది
బురద మట్టిని మెతుకు చేసే
రైతు తపమా? రామ జపమా ?
దేశం దేనివైపుందని ప్రశ్నిస్తోంది
మద్దతు ధరే నాగలికి ఊపిరని
లేకుంటే మెతుకు చేతికి రాదని
తలపాగాలు ఘంఠా కంఠంగా
చాటింపేసి చాటుతున్నాయి

ముండ్ల కంచెలు, నీటి ఫిరంగులు
లాఠీ దెబ్బల విషపు గాట్ల సాక్షిగా
ఇది దేశం అజెండా చేయకుంటే
రైతులేని బతుకు జనతకు లేదని
ఇప్పుడిక గుర్తించాల్సింది జనమని
నాగలి కేతనంగా ఎగరేసినపుడే
జనమే జయులై మన్నుతారని
మనుషులై దేశంలో మిగులుతారని
– ఉన్నం వెంకటేశ్వర్లు