మంత్రగాళ్లే తత్వవేత్తలుగా
గుంటనక్కలే మహా నాయకులుగా
అతుకులు, అనుకరణలే కళలుగా
పరఢవిల్లే జాతిని చూసి
నా మిత్రులారా జాలిపడండి!
కలల్లో చీదరించుకొనే కాంక్షలకే,
మెలుకువలో లొంగిపోయే జాతిని
పశుబలంతో విర్రవీగే వాణ్ణే
రారాజుగా కీర్తించి,
విజేతల కిరీటపు ధగధగల్లో
సౌందర్యాన్ని తిలకించి పరవశించి
పాదాక్రాంతమయ్యే జాతిని చూసి
జాలిపడండి.
శవయాత్రలో తప్ప గొంతెత్తలేని జాతిని
శిథిలాలలో తప్ప వైభవాలను
చాటుకోలేని జాతిని
శిరస్సులు తెగిపడే
ప్రాణాంతక సందర్భాన తప్ప,
తిరగబడలేని జాతిని చూసి
జాలిపడండి.
తాను నేయని బట్టల్ని తొడిగి
షోకులెల్లే జాతిని
తాను పండించని ,పంటల్ని
తెగమెక్కే జాతిని
తను కాయని మధువుల్ని తాగి
తూగులాడే జాతిని చూసి
జాలిపడండి.
మూఢ విశ్వాసాలు తప్ప
మతమే లేని జాతిని
జయ జయనాదలతో
స్వాగతించినవాడినే చీత్కరించి
మరొకరిని నెత్తికెక్కించుకొని
కేరింతలు కొట్టే జాతిని చూసి
జాలిపడండి
తలపండిన విజ్ఞులంతా మూగవాళ్లుగా
శక్తివంతులంతా ఊయలలో పసికందులుగా
మిగిలిపోయిన జాతిని చూసి
జాలిపడండి
శకలాలు శకలాలుగా విడిపోయి
ఒక్కొక్క శకలమే ఒక్కొక్క జాతిగా
చలామణీ అయ్యే జాతిని చూసి
నా మిత్రులారా నా సహ యాత్రికులారా
జాలిపడండి
మూలం: ఖలీల్‌జిబ్రాన్
అనువాదం : కలేకూరి ప్రసాద్