నార్సింగిలో రెచ్చిపోయిన పోకిరి ముఠా

– యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన
– ప్రశ్నించినందుకు తల్లిదండ్రులపై కత్తులతో దాడి
– పోలీసులకు బాధితుల ఫిర్యాదు
– నిందితుల అరెస్టు, రిమాండ్‌
నవతెలంగాణ-గండిపేట్‌

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పోకిరి ముఠా రెచ్చిపోయింది. యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక, దాన్ని ప్రశ్నించినందుకు యువతి తల్లిదండ్రులపై సైతం కత్తులతో దాడి చేసింది. ఈ ఘటన నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన రాముడు కుటుంబం గండిపేట్‌ మండలం మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడ గ్రామం నెమలినగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం అతని కూతురు కాలనీ లో ఉన్న అశోక్‌ కిరాణా షాపునకు వెళ్లింది. అక్కడ సురేష్‌ అనే వ్యక్తి యువతి చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెపై దాడి చేశాడు. హౌలీ పండుగ రోజు తప్పించుకున్నా వంటూ ఆమెపై నీళ్లు పోశారు. అతని నుంచి యువతి తప్పించుకుని ఇంటికి వెళ్లి.. షాప్‌ వద్ద జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు జరిగి న ఘటనపై సురేష్‌ను ప్రశ్నించారు. రెచ్చిపోయిన సురేష్‌, ప్రవీణ్‌ యువతి తండ్రిపై కత్తులతో దాడి చేశారు. ప్రవీణ్‌ తన వద్ద ఉన్న తల్వార్‌తో గొంతు కోసే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన తల్లి, బిడ్డపై కూడా దాడి చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేశారు. స్థానికులు గమనించి గాయపడిన యువతి తండ్రిని ఆస్పత్రికి తరలించారు. పోకిరీ ముఠాపై యువతి తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 307, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.