భిన్న కాన్సెప్ట్‌తో రాక్షస కావ్యం

నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రాక్షస కావ్యం’. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్‌, పింగో పిక్చర్స్‌, సినీ వ్యాలీ మూవీస్‌ బ్యానర్స్‌లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా నవీన్‌ రెడ్డి, వసుందరదేవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. గురువారం ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బలగం దర్శకుడు వేణు యెల్దండి, హీరో తిరువీర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో ఒక భిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఒక కొత్త తరహా సినిమా నిర్మించాం. మా మూవీ ఒక డార్క్‌ కామెడీలా అనిపించవచ్చు. కానీ మంచి హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్‌ మీకు పరిచయం ఉన్నట్లు, కథ మన చుట్టూ జరుగుతున్నట్లు అనిపిస్తుంది’ అని తెలిపారు. ‘నా లైఫ్‌ టైమ్‌లో గుర్తుండే సినిమా అవుతుంది. ఇదొక డిఫరెంట్‌ సినిమా అని చూశాక మీరే చెబుతారు. టీజర్‌ ఎంత బాగుందో సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది’ అని హీరో నవీన్‌ బేతిగంటి అన్నారు. దర్శకుడు శ్రీమాన్‌ కీర్తి మాట్లాడుతూ, ‘పురాణాల్లోని జయ విజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనే ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరించే సినిమా ఇది’ అని చెప్పారు.