నవతెలంగాణ – నెల్లికుదురు
మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన ప్రముఖ రాష్ట్ర స్థాయి డప్పు కళాకారుడు పెరుమాండ్ల బాబు (డప్పు బాబు) జాతీయస్థాయి గౌతమి నంది మయూర పురస్కారం -2024 ‘బంగారు నంది’ అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో గౌతమేశ్వర గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన బంగారు నంది పురస్కార సభలో విశ్వవిఖ్యాత ఎస్వీఆర్ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.డప్పు బాబు ప్రముఖ కళాకారుడు దివంగత సాయి చందు టీంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తో పాటు గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా సాయి చందు కు ప్రధాన అనుచరుడిగా కూడా డప్పు కొట్టి ఎన్నో వేదికలను పంచడమే కాకుండా తన ప్రతిభ కనబరిచారు. బాబు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థలో పనిచేస్తున్నాడు. కడు పేదరికంలో జన్మించిన బాబు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు అవార్డు తీసుకోవడం పట్ల సొంత గ్రామం శ్రీరామగిరి గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.