అరుదైన అవార్డుల వేడుక

అరుదైన అవార్డుల వేడుకతెలుగు సినిమా అభివద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండిస్టీ అవార్డ్స్‌ 2024 కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ వెల్ఫేర్‌ ఫోరమ్‌ చైర్మన్‌ నాగబాల సురేష్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజన్‌ వివికె హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత వి.వి.విజరు కుమార్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఎలక్షన్‌ కమిషనర్‌ పార్థసారథి ఐ.ఎ.ఎస్‌. ముఖ్య అతిథిగా హాజరై అవార్డ్‌ విన్నర్స్‌ని అభినందించడం విశేషం. నాగబాల సురేష్‌ మాట్లాడుతూ,’తెలుగు టి.వి. కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు విజన్‌ వివికె హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత విజరు ముందుకొచ్చి వివిధ విభాగాల కార్మికులకు వాళ్ల వెంచర్‌ నుంచి 101 ప్లాట్లను కేటాయించారు. తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ వెల్ఫేర్‌ ఫోరమ్‌ పెట్టడానికి కూడా ఆయన సహకారం ఉంది. తెలుగు సినిమా లెజెండ్స్‌ జీవితాలపై డాక్యుమెంటరీస్‌ రూపొందించాను. వాళ్లు తెలుగు సినిమా అభివద్ధికి తమ జీవితాలను త్యాగం చేశారని తెలుసుకున్నాను. ఒక చిన్న కెమెరా పట్టుకుని మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం ఇవాళ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మన ఇండిస్టీకి సేవ చేసిన అలాంటి గొప్పవారిని స్మరించుకోవడం నేటి తరం బాధ్యత. ఆ ప్రయత్నంలో భాగంగానే ఘనంగా ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండిస్టీ అవార్డ్స్‌ నిర్వహిస్తున్నాం’ అని అన్నారు.
‘సినిమా ఇండిస్టీకి మేము ఏం సేవ చేయలేదు. ఒక్కొక్కరం ఒక్కో ఆశతో ఇండిస్టీకి వచ్చాం. అయితే వచ్చాక కుటుంబ జీవితం కోల్పోయాం. ఉదయం ఇంటి నుంచే లొకేషన్‌ వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. 50 ఏళ్లుగా మేము ఇండిస్టీలో ఉంటున్నాం. మనం ఇలాంటి అవార్డ్స్‌ ఇవ్వలేకపోయాం. సురేష్‌, విజరు లాంటి వాళ్లు మొదలుపెట్టినప్పుడైనా సపోర్ట్‌ చేద్దాం. ఇవాళ ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు ఇంటికి వెళ్లి మరీ అవార్డ్స్‌ ఇద్దాం. నెక్ట్‌ ఇయర్‌ అయినా వాళ్లంతా వచ్చేలా చేద్దాం’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.