అరుదైన గౌరవం

A rare honorహీరో రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటో షూట్‌ ఇప్పటికే పూర్తయింది. టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా ఉత్సవం వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ‘టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా’ అని రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. దీంతో హీరో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
క్రిస్మస్‌ కానుకగా..
రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్‌ ప్రోమో అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. నేడు (సోమవారం) పూర్తి వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. తెలుగు, తమిళంలో పాటు ఈ పాట హిందీలో ‘ధమ్‌ తు దికాజా..’ అంటూ అలరిం చనుంది. రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌గా ఈ పాటను ఇండియన్‌ సినీ హిస్టరీలో నెవ్వర్‌ బిఫోర్‌ అనేలా డైరెక్టర్‌ శంకర్‌ తన మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు రామ్‌ చరణ్‌తో కలిసి డాన్స్‌ చేయటం విశేషం. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌.