– జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
జైపూర్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదిగా పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి మ్యూజియంలో కోహ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని కోహ్లీ విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టినట్లు వెల్లడించారు. 35 కిలోల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు రెండు నెలల సమయం పట్టింది. ఈ మ్యూజియంలో ఇప్పటికే 44 మైనపు విగ్రహాలను ఏర్పాటుచేశారు. వీటిలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, అమితాబ్ బచ్చన్, మదర్ థెరీసా, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ వంటి పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి.