తన విలక్షణ గాత్రంతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు సింగర్ మంగ్లీ. ప్రైవేట్ సాంగ్స్‌తో మొదలైన ఆమె ప్రమాణం సినిమా పాటలతో బిజీగా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్‌లో తన మార్క్ చూపిస్తుంది. అలాగే సొంత యూట్యూబ్ ఛానల్‌లో కూడా రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ సొంతం చేసుకుంది. ‘జార్జి రెడ్డి’ మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘రాములో రాములా’, ‘సారంగదరియా..’ వంటి అనేక పాటలతో విశేష శ్రోతకారదణను సొంతం చేసుకుంది. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారథుల సమక్షంలో ఆమె అందుకున్నారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.