నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) హైదరాబాద్ విద్యార్థులు అరుదైన ఘనతను సాధించారు. తెలంగాణ ప్రభుత్వం, ఐఆర్‌డీఏఐ సంయుక్తంగా ప్రమోట్ చేస్తోన్న ఈ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు గ్లోబల్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఛాలెంజ్‌ను గెలుపొందారు. అమెరికాలోని సాన్ డియాగో సీఏలో నిర్వహించిన స్పెన్సర్ ఫౌండేషన్, రిమ్స్ యూఎస్‌ఏ స్పాన్సర్ చేసిన రిస్క్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ఈ గుర్తింపును పొందినట్టు ఐఐఆర్‌ఎం హైదరాబాద్ సంస్థ శుక్రవారం తెలిపింది. తొమ్మిది దేశాల నుంచి 38 బృందాలు పోటీపడగా.. ఐఐఆర్‌ఎం విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచారు. భారత్ అదే విధంగా తెలంగాణ నుంచి ఈ ఛాలెంజ్‌లో నిలిచిన తొలి విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొంది. తమ ఫ్యాకల్టీ రూప్ కుమార్ మెంటార్‌షిప్‌లో విద్యార్థులు రాణించగలిగారని ఆ సంస్థ తెలిపింది. ఛాలెంజ్‌లో నిలిచిన విద్యార్థులను ఐఐఆర్‌ఎం డైరెక్టర్ అతను కె దాస్ అభినందించారు.