తొలి మ‌హిళ లోకో పైలెట్‌కు అరుదైన ఆహ్వానం

A rare invitation to the first woman loco pilotఇటీవలె జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహిళలకు జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సాధారణ మహిళలు అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వరంలో జరిగిన ‘ఎట్‌ హౌమ్‌ రిసెప్షన్‌’ను హాజరయ్యారు. ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత పూర్ణిమ మహాతో, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపిన మొదటి గిరిజన లోకో పైలట్‌ రితికా తిర్కిలను ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఆమెకు మొదట ఈ-మెయిల్‌ వచ్చింది. కానీ దాన్ని ఆమె నమ్మలేదు. ఏదో ఫేక్‌ మెయిల్‌ అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజుల్లోనే రాష్ట్రపతి భవన్‌ నుండి అధికారిక ఆహ్వానం అందడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆమే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదటి మహిళా గిరిజన అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా నియమించబడిన రితికా టిర్కీ. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ‘ఎట్‌ హోమ్‌’ రిసెప్షన్‌ కోసం ఆమెకు ఆహ్వానం అందించడానికి పోస్ట్‌ ఆఫీస్‌ అధికారుల బృందం వచ్చి తన తలుపు తట్టినపుడు ఆమె నోట మాట రాలేదు. అసిస్టెంట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ (వెస్ట్‌) పరీక్షిత్‌ సేథ్‌ పర్యవేక్షణలో పోస్ట్‌మ్యాన్‌ ద్వారా జంషెడ్‌పూర్‌లోని జుగ్సలైలోని ఆమె నివాసానికి ఈ ఆహ్వానం అందింది. ఒక లోకో పైలెట్‌గా ఉన్న 27 ఏండ్ల రితికా రాష్ట్రపతి నుండి తనను ఆహ్వానం అందుతుందని ఎప్పుడూ ఊహించలేదు.
గౌరవం దక్కింది
‘మొదట్లో నాకు ఈ-మెయిల్‌ వచ్చినప్పుడు, అది ఫేక్‌ మెయిల్‌ అనుకున్నాను. కానీ పోస్టాఫీసు నుండి ఒక బృందం నా తలుపు తట్టినప్పుడు ఆశ్చర్యంతో నోట మాటరాలేదు’ అంటూ రితికా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను పంచు కున్నారు. సాధారణ కుటుం బానికి చెందిన ఒక గిరిజన అమ్మాయికి ఈ అరుదైన అవకాశం అందుకున్న ఆమె తన సమాజానికి మరింత గౌరవాన్ని అందించింది. మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. వాస్తవానికి తను పని చేస్తున్న పురుషాధిక్య రంగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. భారతీయ రైల్వేలలో మహిళలకు ఒక మార్గాన్ని ఏర్పరచడానికి ఉన్న అడ్డంకులను ఆమె అధిగమించింది.
అంకితభావంతో చేయడమే
రాష్ట్రపతి భవన్‌ నన్ను ‘మహిళా సాధకురాలు’గా ఆహ్వానించింది. ప్రతి స్త్రీ స్వతంత్రంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం మహిళలు దాదాపు ప్రతి రంగంలోనూ పనిచేస్తున్నారు. ఇంకెక్కడైనా వారు పని చేయని చోటు వుంటే అక్కడకు కూడా అతి త్వరలో చేరుకుంటారని నేను భావిస్తున్నాను’ అని రితికా అన్నారు. ఈ ప్రపంచంలో ఏ పని తక్కువ కాదు. మనం ఎంచుకున్న పని ఏదైనా దాన్ని పూర్తి అంకితభావంతో చేయడమే మనముందున్న ఏకైక కర్తవ్యం. ఆపై విజయం తప్పకుండా వస్తుంది’ అంటూ ఆమె జతచేశారు.
మొదటి గిరిజన మహిళ
టాటానగర్‌ – పాట్నా మధ్య నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా పనిచేస్తున్న రితిక, ఈ ప్రతిష్టాత్మక పాత్రను పోషించిన మొదటి గిరిజన మహిళ. అంతే కాదు ఇప్పుడు ఆమె కుటుంబానికి, తన రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఎంతో గర్వకారణం. జార్ఖండ్‌లోని ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రితికా రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిఐటి మెస్రా నుండి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బి.టెక్‌ పట్టా అందుకున్నారు.
కొత్త శిఖరాలకు చేరుకుంది
రితికా తండ్రి రిటైర్డ్‌ ఫారెస్ట్‌ గార్డ్‌. రైల్వేలతో రితికా కెరీర్‌ ధన్‌బాద్‌ రైల్‌ డివిజన్‌ కింద బొకారోలోని చంద్రపురాలో ప్రారంభ మైంది. 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యింది. అక్కడే ఆమె పదోన్నతి పొందింది. తన కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా పదోన్నతి పొందే ముందు ఆమె సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకుల సేవలను సంబంధించిన రైళ్లను నడుపుతూ ముందుకు సాగింది. 2024లో ఆమె పదోన్నతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణలో పాల్గొనడానికి వీలు కల్పించింది. అక్కడ ఆమె ఇప్పుడు కీలకమైన సిబ్బంది సభ్యురాలిగా పనిచేస్తున్నారు.
విలువిద్యలో కోచ్‌ పూర్ణిమ విలువిద్యలో కోచ్‌ పూర్ణిమ
విలువిద్య కోచ్‌ అయిన పూర్ణిమ మహతో ‘ఎట్‌ హోమ్‌ రిసెప్షన్‌’లో పాల్గొనడానికి టాటా స్టీల్‌ ఆర్చరీలో కోచ్‌గా ఢిల్లీకి వెళ్లారు. పూర్ణిమ 1994 నుండి టాటా స్టీల్‌లో క్రీడాకారిణిగా ఉన్నారు. 2000లో ఆమె విలువిద్యలో కోచ్‌ అయ్యారు. 2013లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. 2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు పద్మశ్రీని ప్రదానం చేశారు. ఎట్‌ హోమ్‌ రిసెప్షన్‌కు హాజరు కావల్సిందిగా మొదట తనకు మెయిల్‌ వచ్చిందని, ఆ తర్వాత ధృవీకరణ చేస్తూ రాష్ట్రపతి భవన్‌ నుండి ఫోన్‌ కాల్‌ వచ్చిందని పూర్ణిమ పంచుకున్నారు. ‘మొదట నేను నమ్మలేకపోయాను కానీ మెసేజ్‌ చూసిన తర్వాత గర్వంగా అనిపించింది’ అని ఆమె చెప్పారు. ఈ రోజు టాటా స్టీల్‌ మద్దతుతో నాకు విలువిద్యలో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు నాకు కొత్త దిశను ఇచ్చింది. రాష్ట్రపతి నుండి
ఆహ్వానం అందుకోవడం ఒక కొత్త విజయం’
అని ఆమె అన్నారు.