చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన సినిమా

A rare movie that stays foreverబాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో అభిమానుల సమక్షంలో ఈ చిత్ర విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ‘గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ’ పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ, ‘ఈ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్‌ చేస్తుంటాము. ఈ సినిమా కోసం కూడా ఎంతో రీసెర్చ్‌ చేశాం. ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి ‘డాకు మహారాజ్‌’ పాత్ర పుట్టింది. ‘అఖండ’ ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’, ఇప్పుడు ‘డాకు మహారాజ్‌’ ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమా ‘డాకు మహారాజ్‌” అని అన్నారు. ‘రిలీజైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ అభిమానులు ఫోన్లు, మెసేజ్‌లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబుకి, త్రివిక్రమ్‌కి ధన్యవాదాలు’ అని దర్శకుడు బాబీ కొల్లి చెప్పారు.