నిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం

– వాస్క్యులర్‌ సర్జరీ ద్వారా కడుపులో పెద్ద రక్తనాళంకు సర్జరీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అరుదైన వ్యాధికి నిమ్స్‌ వైద్యులు ఆధునిక వైద్య చికిత్స అందించారు. అత్యంత ప్రమాదకరమైన అయోర్టా (కడుపులో పెద్ద రక్త నాళం ఉబ్బటం) వ్యాధికి సంబంధించి వాస్క్యులర్‌ శస్త్ర చికిత్సను నిమ్స్‌ వైద్యులు విజయవంతంగా పూర్తి చేసి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చింతగుంట్ల గమానియేలు 20 ఏండ్లుగా హైదరాబాద్‌లో చెప్పుల షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి గతేడాది డిసెంబర్‌లో జ్వరం రాగా స్వగ్రామం రేపల్లె వెళ్లి పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. ఎక్కడా జ్వరం తగ్గకపోవడంతో మంగళగిరి ఎన్‌ఆర్‌ఐకు వెళ్ళాడు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు చేసి కడుపులో నరం ఇన్‌ఫెÛక్షన్‌కు గురైందని, వెంటనే హైదరాబాద్‌ కార్పొరేట్‌ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్‌కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దాంతో అతను పలువురు విలేకరుల చొరవతో నిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ సంకీర్తన అన్ని పరీక్షలు చేయించి వాస్క్యులర్‌ సర్జరీకి రిఫర్‌ చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాస్క్యులర్‌ సర్జరీ హెడ్‌ డాక్టర్‌ సందీప్‌ మహాపాత్ర, వైద్యులు, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ ప్రజ్ఞ, డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ వెంకట్‌ వైద్య బృందం 13 గంటలపాటు శ్రమించి రోగి కడుపులో ఇన్‌ఫెÛక్షన్లకు గురై ఉబ్బిపోయిన పెద్ద రక్తనాళంను శుభ్రం చేసి బైపాస్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కేవలం రూ. 2 లక్షల ఖర్చుతో సర్జరీని నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద చేసినట్టు డాక్టర్‌ సందీప్‌ మహాపాత్ర శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రోగి బంధువులు నిమ్స్‌ వైద్యలకు కృతజ్ఞతలు తెలిపారు.