అంద‌రికి అండ… ఎర్ర‌జెండా

– ఓటుతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి
– ధనస్వామ్యాన్ని తిరస్కరించండి: రాఘవులు, మధు, తమ్మినేని
– ఉధృతంగా సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం
– జననేతలకు ప్రజల నీరాజనం
సీపీఐ(ఎం) అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు హుషారుగా సాగుతోంది. లింగ, వయో భేదం లేకుండా ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇన్నాళ్లు మాకోసం మీరు కొట్లాడారు…ఇప్పుడు మీకు తోడుగా మేం ఉంటాం అంటూ ఓటర్లే కార్యకర్తలుగా మారి ప్రచారం చేస్తున్నారు. ఎర్రజెండా ఒంటరిపోరును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మద్దతిస్తున్నారు. సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రశాఖ మాజీ కార్యదర్శి పీ మధు, తెలంగాణ శాఖ కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం సహా పార్టీ శ్రేణులంతా సత్తా చాటేందుకు చమటోడుస్తున్నారు. ఆదివారం వీరంతా వివిధ ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల బూర్జువా విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ…అవన్నీ ఒకే తానులో ముక్కలని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్తున్నారు. విధానాల మార్పు లేకుండా సమసమాజ స్థాపన సాధ్యం కాదనే వాస్తవాలను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఆసక్తిగా నిజానిజాలను నిర్థారించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రజెండాలతో కదులుతున్న ఎర్రదండుకు ఘనస్వాగతం పలుకుతున్నారు.