కష్టజీవులకు అండ ఎర్ర జెండా

కష్టజీవులకు అండ ఎర్ర జెండా– నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసేది ఎర్రజెండానే
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి
– దేవుని ఎర్రవల్లిలో రెపరెపలాడిన సీపీఐ జెండా
నవతెలంగాణ-చేవెళ్ల
కష్టజీవులకు అండ ఎర్ర జెండా అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి పెంటయ్య అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి హాజరై, సీపీఐ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని అధిక ధరలకు కళ్లెం వేయాలని పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌ ధరలను జీఎస్టీలోకి తీసుకురావాలనీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనీ, పేదరిక నిర్మూలన కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఆరోగ్యారంటీల అమలు పూర్తిగా అమలు కావటం లేదని రైతు భరోసా రైతు రుణమాఫీ, పెంచుతామన్న పింఛన్లు వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అధికారులు గ్రామంలో పర్యటించాలని సీజనల్‌ వ్యాధులు విష జ్వరాలు డెంగీ వంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. ప్రభులింగం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సుధాకర్‌గౌడ్‌, బీకెఎంయూ జిల్లా అధ్యక్షులు జె.అంజయ్య, మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎండీ. మక్బూల్‌, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల, లలిత, విజయమ్మ, వెంకటమ్మ, యాదగిరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.