– దిసనాయకె విజయం
– తొలిసారి అధ్యక్ష పీఠంపై మార్క్సిస్టు నేత
– నేడు ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకె చారిత్రాత్మక విజయం సాధించారు. శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ నిలువునా కుప్పకూలిన తర్వాత మొదటిసారి జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. జనతా విముక్తి పెరమున (జేవీపీ) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి అభ్యర్థి దిసనాయకె అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. సోమవారం ఆయన శ్రీలంక తొమ్మిదో కార్యనిర్వాహక అధ్యక్షునిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
కొలంబో: శ్రీలంకలో ఎర్రజెండా ఎగిరింది. అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో దిసనాయకెకు 42.31 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, ప్రతిపక్ష సామగి జన సందానయ పార్టీ (ఎస్‌జేపీ) అభ్యర్థి సాజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘెకు కేవలం 17.27 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మొదటి రౌండ్‌లోనే పోటీ నుంచి నిష్క్ర మించారు. మొత్తం పోలైన ఓట్లలో విజ యానికి అవసరమైన 50శాతానికి పైగా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 1981 ప్రెసి డెన్షియల్ ఎలక్షన్ యాక్టు ప్రకారం మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రెండవ ప్రాధా న్యతా ఓట్ల లెక్కింపు ద్వారా లభించిన ఓట్లు కలిపారు. కీలకమైన ఈ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత దిసనాయకె తిరుగులేని ఆధిక్యత సాధించినట్టు ఎన్నికల సంఘం చైర్మెన్ ఆర్ ఎల్ ఎం రత్నాయకె ప్రకటించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 70 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.
ఎవరీ దిసనాయకే..?
విద్యార్థి నేతగా మొదలై.. దేశాధినేత వరకు ఎదిగిన దిసనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కి.మీల దూరంలో ఉన్న తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యనభ్యసించిన దిసనాయకే.. తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. తొలుత పెరదేనియా విశ్వవిద్యాలయంలో చేరగా.. రాజకీయ సిద్ధాంతాల కారణంగా ఎదురైన బెదిరింపులతో కెలానియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయినట్టు గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన.. ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు.
రాజకీయ జీవితం ఇలా..
1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమునా (జేవీపీ)లో చేరిన దిసనాయకే.. రాజకీయ జీవితానికి పునాది నిర్మించుకున్నారు. 1998 నాటికి జేవీపీ నిర్ణయాధికార విభాగం పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిసనాయకే.. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో ఆనాడు వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 2005లో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం, ఎల్‌టీటీఈ మధ్య ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరక పోవడంతో తలెత్తిన విభేదాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అవినీతిపై వ్యతిరేక పోరాట గళం
శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకొని సమర శంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. వ్యవస్థాగత మార్పు కోసం నినదించారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే.. జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించడంలో గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు. అంతేకాకుండా తమ పార్టీ మేనిఫెస్టోలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయడంతో పాటు అనేక ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజల్ని తన వైపు ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను.. అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిసనాయకే విజయం సాధించారు.
మార్పు కోసం తీర్పు దిసనాయకె
ఇది మార్పు కోసం ఇచ్చిన తీర్పు అని అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకె అభివర్ణించారు. దిసనాయకెపై శ్రీలంక ప్రజలు ముఖ్యంగా యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. చెల్లింపుల సంక్షోభం, అధిక ధరలు, నిరుద్యోగం, ఉరితాళ్లలా పరిణమించిన ఐఎంఎఫ్ అప్పులు వంటి వాటి నుంచి శ్రీలంకను గట్టెక్కించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. వీటిని ప్రజల తోడ్పాటుతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని దిసనాయకె చెప్పారు. తాము అధికారంలోకి వస్తే శ్రీలంక ప్రజలకు పెనుభారంగా మారిన అదానీ ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేస్తానని, ఐఎంఎఫ్‌తో రణిల్ విక్రమ సింఘె ప్రభుత్వం కుదుర్చుకున్న 290 కోట్ల డాలర్ల బెయిలవుట్ అగ్రిమెంట్‌ను తిరగదోడతానని ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.