ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ముఖంలో నెత్తురు చుక్క లేదు. నిన్నటి దర్పం, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కానరాలేదు. ఆయన మూడోసారి ప్రధానమంత్రి కాలేనేమోనన్న భయం ఉన్నదని అనుకోలేము. తాము, తమ మిత్రులు కలిపి చావుతప్పి కన్ను లొట్టబోయినా మేజిక్ ఫిగర్ దాటారు. అయినా ప్రధానిలో ఎందుకంత నిర్వేదం? మరోవైపు ఏపి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి ఛాయలు కనుచూపుమేరలో కనిపించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ నేత ప్రజలకు ముఖం కూడా చూపించకుండా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ మూడు సందర్భాలకూ ఒక సారూప్యత కనపడుతున్నది. అహంభావం, ఏకపక్ష ధోరణులను ప్రజలు అంగీకరించలేదు. కేవలం సంక్షేమ చర్యలతో శాశ్వత ఓటు బ్యాంకుగా మారడానికి ప్రజలు సిద్ధంగా లేరు. బీజేపీ విషయంలో కూడా మతం పేరుతో శాశ్వతంగా మోసపోవడానికి సిద్ధపడలేదు. వారి సమస్యలకు పరిష్కారం కోరుకుంటు న్నారు. పోరాడేందుకు హక్కులు కావా లంటున్నారు. శ్రామికులు ఐక్యంగా పోరాడాలను కుంటున్నారు. అందుకు ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను కోరుకుంటున్నారు.
గత ఎన్నికలలో ఒంటరిగానే మెజారిటీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిత్రులు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయ గల స్థితిలో లేదు. సొంతగానే 370 సీట్లు సాధించాలనీ, ఎన్‌డిఏగా 400 దాటాలని కన్న కలలు కల్లలయ్యాయి. తాను ఆడింది ఆటగా సాగాలనుకున్న ప్రధానికి పగ్గాలు పడ్డాయి. మోడీ నాయకత్వంలో జరిగిన ఏ ఎన్నికలలోనూ ఇంతటి ఎదురు దెబ్బ చవిచూడలేదు. బీజేపీకి 65 సీట్లు తగ్గాయి. తన మంత్రివర్గ సహచరులు 13మంది ఓడిపోయారు. తమకు ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో మోడీ దిగ్భ్రమకు లోనయ్యే ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. చివరకు తనకే వారణాసిలో మెజారిటీ అట్టడుగుకు జారిపోయింది. 2019లో 4,79,505ఓట్లు మెజారిటీ నుంచి ఇప్పుడు 3లక్షలకు పైగా తగ్గి కేవలం 1,52,513 ఓట్లు మాత్రమే ఆధిక్యత లభించింది. అంతేనా! అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజక వర్గంలో, పైగా 80శాతం హిందువులున్న చోట కూడా బీజేపీ ఓడిపోయింది. ”సీతయ్య ఎవరి మాటా వినడు” అన్నట్టు అహంభావం ప్రదర్శించే ప్రధాని ఈ ఫలితాలతో నిశ్చేష్టుడైపోవడంలో ఆశ్చర్యమేముంది? పేలవంగా ప్రసంగించడం సహజమే కదా!
వారణాసిలో వాతలను, అయోధ్యలో ఓటమిని ఎట్లా అర్ధం చేసుకోవాలి? ఈ రెండూ నిరంతరం భక్తిపారవశ్యంలో మునిగిన జనంతోనూ, ఆధ్యాత్మిక వాతావరణంలోనూ ఉంటాయి. పైగా ఏడు దశలలో జరిగిన పోలింగ్ ప్రక్రియలో ప్రధాని మోడీ విడతకొక్క నాటకానికి తెరలేపారు. ప్రపంచవ్యాపితంగా మోడీ ఘనత వికసిస్తున్నదనీ, ఇది వికసిస్తున్న భారతదేశమనీ, రెండు దశల పోలింగ్‌లో ఎంత ప్రచారం చేసుకున్నా జనం పట్టించుకోలేదు. మూడవ దశ పోలింగు నుంచి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. మతపరమైన విభజనతో 80శాతంగా ఉన్న హిందువులను తన ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. మరో రెండు దశలు దాటిన తరువాత మత సామరస్యానికి తానే ప్రతీకగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. బాల్యం నుంచి ముస్లిం కుటుంబాలతోనే కలిసిపోయి జీవించినట్టు చెప్పుకున్నారు. ఆరవ దశకు తానే దేవుడిని అన్నారు. ఏడవ దశ తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోయానన్నారు. నలభైఅయిదు గంటల ధ్యానం కూడా మతపరమైన పోలరైజేషన్‌కు ఉపయోగపడుతుందన్నది ఆయన ఎత్తుగడ. ఊసరవెల్లిని మోడీ మాత్రం మరపించారు. ఇన్ని జిత్తులు ప్రదర్శిస్తేగానీ ఆమాత్రం ఫలితాలు రాలేదు. అయినా అయోధ్యలో, వారణాసిలో వచ్చిన ఫలితాలతో మోడీకి, ఆయన భక్తులకు నిద్ర పట్టక పోవచ్చు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడవల్సింది లేదు. ప్రజలలో అత్యధికులు భక్తులే. మోడీ పుట్టకముందునుంచీ, బీజేపీ ఆవిర్భవించకముందు నుంచీ, ఆర్‌ఎస్‌ఎస్ అంకురించకముందునుంచీ భక్తులే. సమస్యలు పెరిగినపుడు, పట్టించుకునే దిక్కు లేనపుడు దేవుడే దిక్కు అని జనం నమ్మకం. తాతల తండ్రుల నుంచీ కుటుంబంలో నేర్చుకుంటున్నది అదే. కానీ ఆధునిక సమాజంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుకుంటారు. పాలకులూ, పార్టీలు కూడా సమస్యల పరిష్కారానికి దేవుడినీ, మతాన్ని ఆశ్రయించమని ఉచిత సలహాలు ఇస్తే, ఆపాటికి అధికారంలో మీరు ఎందుకున్నారని ప్రశ్నిస్తారు. తమ బాధ్యతల నిర్వ హణలో విఫలమయినప్పుడే పాలకులు దేవుడివైపు, మతంవైపు ప్రజల దృష్టి మరలిస్తారని అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదు. మతం గురించి చెప్పడానికి వారికి మతగురువులు ఉన్నారు. ఆధునిక వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీనుంచి ప్రజలు ఆశిస్తున్నది అది కాదు.
ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకున్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు కావాలనుకున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే ప్రయత్నాలను అంగీకరించలేదు. అందుకే మోడీ ఒల్లు జలదరించే తీర్పునిచ్చారు. 50రోజులు తనకు అధికారమిస్తే లీటరు పెట్రోలు రూ.50కే అందిస్తానని మోడీ 2014లో చెప్పారు. ఇప్పుడు 50 రోజులు కాదు, 3650 రోజులు గడిచాయి. పెట్రోలు రూ.50 కాదు, రూ.110కి పెరిగింది. డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మాట మరచిపోయారు. మద్దతు ధర చట్టబద్ధం చేసేందుకు సిద్ధంగా లేనని తెగేసి చెప్పారు మోడీ. కార్మికులు, వ్యవసాయ కార్మికులన్న మాటలే ప్రధానికి నచ్చవు. మహిళలపైన పెరిగిన లైంగిక దాడులు సైతం సంస్కారమనేలా దాని అర్థాన్ని మార్చేశారు. కుల దురహంకార దాడులు సహజం అనిపించారు. ఇవన్నీ ఇహలోకపు సుఖాలనీ, వీటిని త్యజించాలనీ భావించి ఆధ్యాత్మిక చింతనతో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరిక.
‘ఊరంతా ఒక దారయితే ఉలిపికట్టెది మరో దారి’ అని సామెత. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీ దూసుకుపోతున్నదని ఉర్రూతలూ గించాయి. ఇవన్నీ గాలిమాటలేనని తేలిపోయింది. అంచనాలు తప్పాయా, లేక అంచనాల బేరమా? బేరసారాలే అయితే ఎవరికి లాభం? పోలింగ్ అయిపోయింది. అయినప్పటికీ ఉన్నది లేనట్టుగా చెప్పడం వల్ల రెండు రోజుల్లో వచ్చే లాభమేంటి? ప్రతిష్టాత్మక స్థానం పొందిన సెఫాలజిస్టు ప్రశాంత్‌కిషోర్‌కు కూడా బేరం గిట్టుబాటయిందని జనం మాట. కొంతమందికి నిజంగానే అంచనాలు తప్పి ఉండవచ్చు. బహుశా అందుకేనేమో ఒక సంస్థ యజమాని బహిరంగంగా టీవీ చర్చల్లోనే కంటతడి పెట్టారు. తమ విశ్వసనీయతకు సవాలుగా మారిందన్న బాధతో కావచ్చు. అత్యధిక సంస్థలకు ఈ బాధ లేదు. కావల్సిందేదో గిట్టినట్టే ఉన్నది. లేకపోతే ఐదు రాష్ట్రాలలో, ఉన్న స్థానాలకంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పవలసిన అవసరం ఏమున్నది? తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, బీహార్‌లలో ఉన్న పార్లమెంటు స్థానాలకంటే ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుందని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పాయి. అప్పటికప్పుడు రగిలే ఉద్వేగంలో ఇన్ని లోతులు చూడటం కష్టం. ఇవి అర్ధం కావడానికి ఒకటి రెండు రోజులు పట్టింది. ఈలోపే జరగవల్సింది జరిగిపోయింది. అదానీ, అంబానీల కంపెనీల షేర్లు ఎగిసిపడ్డాయి. షేర్‌మార్కెట్ దూసుకుపోయింది. అదానీ కంపెనీల షేర్లు దుమ్మురేపాయి. అంబానీ కంపెనీల షేర్లు చరిత్రలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వీరికి ఇంకేం కావాలి? వాస్తవ ఫలితాలతో అదే షేర్ మార్కెట్ అమాంతం కుప్పకూలింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి ప్రజలు 31లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. రూపాయి విలువ 45పైసలు మరింత దిగజారింది. ఇది దేశం మీద మరింత భారం మోపింది. మోడీ గెలుస్తున్నాడంటే అదానీ, అంబానీల షేర్లు దూకుడు ప్రదర్శించాయి. ప్రజలు గెలుస్తున్నారంటే అవే షేర్లు కుప్పగూలాయి. అంబానీ, అదానీ, మోడీల బంధం అర్ధం చేసుకోవడానికి ఇంకా ఏం కావాలి?
రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓట్లు, సీట్లు పెరిగాయి. ప్రత్యామ్నాయం గా ఎదిగిపోయామని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ ఇది బీఆర్‌ఎస్ స్వయంకృతాపరాధమే తప్ప బీజేపీ సొంత బలం కాజాలదు. ఆరు నెలల క్రితం శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ పొందిన ఓట్లు ఇప్పుడు 51 లక్షలు కోల్పోయింది. ఆమేరకు బీజేపీ అదనంగా 45లక్షల ఓట్లు పొందింది. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకత్వం కండ్లు తెరిస్తే ఈ మార్పు స్థిరపడకుండా చూడవచ్చు. కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా ఇందుకు కొంత కారణం. బీజేపీ ప్రమాదాన్ని గుర్తించడంలో ఎవరి బలహీనతలు వారు ప్రదర్శించారు. ఏమైనా వామపక్షాల మీద పెరిగిన బాధ్యతను ఈ ఫలితాలు సూచి స్తున్నాయి. ప్రజా ఉద్యమాల ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తున్నాయి.
ఎస్. వీరయ్య