ఓ తల్లి ప్రసవ వేదనకి ప్రతిబింబం

A reflection of a mother's laborఅరవింద్‌ కష్ణ, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ దివి, మేఘన శ్రీనివాస్‌, వినరు కీలక పాత్రల్లో విల్లర్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్‌’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ  విల్లర్ట్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్‌ చేశారు. సోమవారం ప్రదర్శించిన స్పెషల్‌ ప్రీమియర్‌కు రేణూ దేశారు, ఎస్వీ కష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్‌, జ్యోతి పూర్వాజ్‌, సుకు  పూర్వాజ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రేణూ దేశారు మాట్లాడుతూ, ‘రమణ ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది.  కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్‌ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా.  ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. రమణకి ఇది ఆరంభం మాత్రమే. ఆయన్నుంచి ఇంకా ఇలాంటి మంచి  చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. అరకులో పూర్తిగా షూట్‌ చేశాం. నేను  మొదటి ప్రయత్నం చేశాను. చూసిన వారంతా తప్పులు చెప్పండి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకుంటాను’ అని డైరెక్టర్‌, నిర్మాత రమణ విల్లర్ట్‌ అన్నారు.