”మనిషిని మహోన్నతునిగా మార్చగలిగే మహిమ గల ఏకైక మంత్ర దండం పుస్తకమే” అంటారు డా||పత్తిపాక మోహన్. పుస్తకం తను మాట్లాడకపోయినా మనతో ఎన్నో పదాలు పలికించగలదు. ఊఉ కొట్టిస్తుంది. ఊయలలు ఊగిస్తుంది, ఊరడిస్తుంది. కవ్విస్తుంది, నవ్విస్తుంది, కథలు చెప్తుంది, కమ్మని కలలు కనేలా చేస్తుంది. వాటిని నిజం చేసేందుకు వెంట ఉంటుంది. ఇంతేనా పరిచయం పెంచుకుంటుంటే ప్రియసఖిగా మారుతుంది. తనే ప్రపంచం అవుతుంది. మనతో లోకాన్ని జయించేలా చేస్తుంది. ఒంటరితనంలో వీడిపోని స్నేహమవుతుంది. ఓటమిలో ఓదార్పు అవుతుంది. తన పర బేధం లేదు. కులమత వివక్ష లేదు. అమ్మలా అందరినీ ఒకేలా చూస్తుంది. మనలో మనిషికి ప్రాణం పోస్తుంది. ప్రేమిస్తే తనే ప్రాణం అవుతుంది. కష్టంలో కుంగిపోనివ్వదు. క్షణికావేశాలకు బలికానివ్వని మానసిక పరిపక్వతను ప్రసాదిస్తుంది. ఇన్ని మహిమలున్న పుస్తకాన్ని మంత్రదండం అనడం సబబే కదా మరి!
మన భారత జ్ఞాన సంపద తాళ పత్రాల నుండి మొదలయ్యి నేటి కిండిల్ వరకు వివిధ రూపాల్లో విస్తరించింది. వీటిల్లో పుస్తకాలది ప్రత్యేకమైన స్థానం. అందుకేనేమో ‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు. ఒక పదిహేనేళ్ల వెనక్కు వెళితే ప్రయాణాల్లోనైనా, పార్కుల్లోనైనా, పంచాయతీ బండల మీదైనా మనుషులు పుస్తకాలతో కనపడేవారు. పాకెట్ బుక్ నుంచి పెద్ద పెద్ద గ్రంథాల వరకు చేతుల్లో ఉండేవి. కొన్ని జ్ఞానం కోసమైతే, కొన్ని ఆహ్లాదం కోసం. స్థోమత ఉన్న వారు కొనుక్కుని చదివేవారు. లేని వారు గ్రంథాలయాల్లో గడిపేవారు. అక్షరాలే ఆస్తులుగా అంతస్థులు కట్టుకునేవారు. అటువంటి వారిని సమాజం కూడా ఎంతో గౌరవించేది.
టీవీలు రాక ముందు పుస్తకమే ప్రధాన కాలక్షేప సాధనంగా ఉండేది. ఇంట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చి చేరినా ఒకరి తరువాత ఒకరు వంతులు వేసుకుని చదవాల్సిందే. పూర్తయ్యాక దాని మీద చర్చలు, వాదనలతో పాటు కొత్త రచనలు కూడా పుట్టుకొచ్చేవి. కొత్త పుస్తకం అంటే ఇంటి ఆడపిల్ల అంత అపురూపం. పాత పుస్తకం అంటే పదిలంగా చూసుకునే పెద్దవ్వ. మొత్తానికి పుస్తకం అంటే ఒక బంధం. ఒక భావోద్వేగం. ఒక సాంప్రదాయ పరంపర. తరువాతి తరానికి అందించే తరగని ఆస్తి. మన తాతలు మనకిచ్చిన ఆస్తిని వీలుంటే పదింతలు చేసి తరువాతి తరానికి అందించాలి లేకుంటే కనీసం ఉన్నదైనా పాడుచేయకూడదు. కానీ మనం పైసల రూపంలో ఆస్తిని కూడబెట్టి ఇవ్వడానికి ప్రాణం పెడుతున్నాం. కానీ మనిషికి ప్రాణం పోసి మనీషిని చేసే పుస్తక సంపద మీద ఎందుకో తేలిక భావన. పాత పుస్తకాలు అమ్ముకోవడానికే పనికొస్తాయన్న మన అజ్ఞానానికి పుస్తకం పగలబడి నవ్వుతోంది. అది మనకు వినబడనంతగా డిజిటల్ విద్యలో మునిగి ఉన్నాం.
అద్దంలో చందమామ కన్నా అరచేతిలో గోరింటాకు చందమామ అపురూపం. వీడియోలో అమ్మతో మాట్లాడడం కన్నా వాకిట్లో అమ్మ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే హాయికే ఓటేస్తాం. వర్చ్యువల్ స్నేహాలలో ఎమోజీల కన్నా స్నేహితుడి భుజం మీద చేయి వేసి నాలుగు అడుగులు వేసే అనుభూతి వేరు. స్పర్శానుభూతికి ప్రాధాన్యం ఇవ్వడం మానవ నైజం. పుస్తకాలు ఇచ్చిన జ్ఞాపకాలు, అనుభూతులు డిజిటల్ ప్లాట్‌ఫాం ఇవ్వలేదని నా అభిప్రాయం. మన చిన్నప్పటి రాతలు, గీతలు చూసుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందం. ఈ కథల పుస్తకం తాతయ్య కొన్నాడనో, పాటల పుస్తకం ప్రైజ్‌మనీతో కొనుకున్నాననో ఎన్నో తీపి గుర్తులు. స్నేహితులతో పంచుకుని చదివిన నవలలో, బడి తరువాత గ్రంథాలయంలో గడిపిన గంటలు… ఇలా ఎన్నో జ్ఞాపకాల దొంతరలు మనందరికీ ఉంటాయి. మనిషికి విషయ జ్ఞానంతో పాటు, మానసిక వికాసం, వినయం, విచక్షణా జ్ఞానం, మానవ బంధాలు ఇలా ఎన్నో నేర్పే గురువు పుస్తకం.
ప్రస్తుత కాలంలో డిజిటల్ విద్య చాలా అవసరం. రెండేండ్ల కరోనా కాలంలో పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలిచినవి డిజిటల్ మాధ్యమాలే! వాటితో పాటు అవి తీసుకొచ్చిన అనారోగ్యాలు కూడా చాలానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను దాటాలంటే మన పిల్లలు పుస్తకాలతో సావాసం చేయాల్సిందే! రంగు రంగుల బొమ్మల పుస్తకాలతో బాల్యం మొదలైతే వారి భవిష్యత్తు కూడా ఇంద్రధనుస్సులా ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిల్లల జీవితాలకు అద్భుతమైన రంగులద్దడం తల్లితండ్రులుగా మన బాధ్యత. వారిలో పఠనాశక్తి పెంచడం వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన వారవుతాం. అయితే ఏ వయసులో ఎలాంటి పుస్తకాలను పరిచయం చేయాలి అనేది మాత్రం తెలుసుకోగలగాలి. పాలు తాగే వయసులో పెరుగన్నం పెట్టకూడదు కదా! చదవడం ఇంకా రాని పిల్లలకు బొమ్మల పుస్తకాలు, అప్పుడే చదవడం నేర్చుకుంటున్న పిల్లలకు చిట్టి పొట్టి కథలు, గేయాల పుస్తకాలు… ఇలా వయసు వారీగా వాళ్ళకు నచ్చే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. అందుబాటులో అంటే అలమరాలో పెట్టి చూపుల విందులా కాకుండా రోజుకో పేజీ అయినా వాళ్ళతో కూర్చుని చదివి వినిపించాలి. నడక నేర్చుకుంటున్నపుడు వేలుపట్టుకుంటే చాలు. తరువాత పరుగు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ జీవితానికి, వ్యక్తిత్వానికి ఈ పుస్తకాలన్నీ పునాదులు అవుతాయనడంలో సందేహం లేదు.
పుస్తకాలు కొనడం ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. పది రూపాయల నుండి పుస్తకాలు దొరుకుతున్నాయి. చిట్టి చేతుల్లో బరువైన పుస్తకాలు పెట్టి భయపెట్టద్దు. చిన్న పుస్తకాలే కొందాం. ఆఫర్ లో ఉన్నాయని ఒకేసారి అరవై కొన్ని చదవట్లేదని ఒత్తిడి పెట్టద్దు. ఒక్కొక్కటిగా చదువుదాం. నెలకు ఒక్క పుస్తకం పరిచయం చేసినా చాలు. అలాగే ఎవరికైనా వాళ్ళు ఎంపిక చేసుకుని కొన్న దానిపై మమకారం ఎక్కువ ఉంటుంది. పుస్తకాల షాపుకు గానీ, పుస్తక ప్రదర్శనలు జరుగుతున్న చోటుకు గానీ వాళ్ళను తీసుకెళ్ళి నచ్చినవి తీసుకునే అవకాశం ఇద్దాం. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకు ప్రోత్సాహంగా కానుకగా ఇవ్వండి. ఇన్ని పుస్తకాలు కొంటే పెట్టుకునే స్థలం ఏదీ అంటారేమో? మనింట్లో ఎన్నో ఏళ్ళుగా మూలన పడి ఉన్న పాత సామాను కన్నా ఎక్కువ స్థలం ఈ పుస్తకాలు ఆక్రమించవు. అయినా కుదరదు అంటే.. ఆసక్తి ఉన్నా ఎంతో మంది కొనుక్కునే స్థోమత లేని వారున్నారు. వారికి ఇవ్వండి. మహాప్రసాదంగా తీసుకుని చదువుకుంటారు. పుణ్యం పురుషార్ధం రెండూను!
ఖాళీ లేని ఉద్యోగాలతో ఇంక పుస్తకాలు చదివే సమయం ఎక్కడిది.. పిల్లలకు చదివి వినిపించే ఓపిక ఎక్కడ ఉంటుంది అనుకోవద్దు. వాళ్ళతో మనం గడిపే సమయమే మనం వాళ్ళకు ఇచ్చే వెలకట్టలేని ఆస్తి. పడుకునేటప్పుడు మనం చదివి వినిపించే కథ కోసం వాళ్లెంత ఎదురుచూస్తారో తెలుసా! అమ్మ రాత్రి నా కొత్త పుస్తకంలో కథ చెబుతానంది అంటూ పొద్దున్న మనం చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని ఆశ పెట్టుకుంటారు. చిన్న పిల్లలే కదా వాళ్ళకిచ్చిన మాటను మరువకండి.
– డా. హారిక చెరుకుపల్లి, 9000559913