– బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు
– సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
విజయవాడ,న్యూఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అదేవిధంగా సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేటీకి వాయిదా
టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నేటీ(మంగళవారం)కి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో, చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూత్రా, అభిషేక్ సింగ్ మను వాదనలు వినిపించారు. 2021 సెప్టెంబర్ 7లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, అందువల్ల 17ఏ వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి తీసుకోవాలని అన్నారు. కానీ గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసు దర్యాప్తు 2018కి ముందే ప్రారంభం అయిందని, కనుక 17ఏ వర్తించదని అన్నారు. సుదీర్ఘ వాదనల తరువాత విచారణను నేటీ (మంగళవారం)కి వాయిదా వేసింది.