పోలింగ్‌ కేంద్రాల్లో వసతులపై నివేదిక సమర్పించాలి

– జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాబోయే ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టోరల్‌ అధికారులు వారి విధుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. బుధవారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ సౌత్‌ జోన్‌ ఆఫీస్‌ ఫుల్‌బాగ్‌ చాంద్రాయణగుట్ట కార్యాలయంలో సెక్టరు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెక్టోరల్‌ అధికారులు, పీవో, ఏఆర్‌వో, ఆర్‌వోకు వారధిగా నిలిచి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ప్రతి సెక్టోరల్‌ ఆఫీసర్‌ తనకు కేటాయించిన 10- 12 పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ సందర్శించి పోలింగ్‌ కేంద్రాల్లో గల వసతులపై ఈనెల 16న నివేదిక సమర్పించాలని సెక్టోరల్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవసరమైన మౌలిక వసతులన్నీ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు సమర్పించే నివేదికలను సంబంధిత అన్నేగ్జర్‌లో పంపాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. సమన్వయంతో పని చేస్తేనే ఎలాంటి సమస్యలను తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకటాచారి, ఆర్డివో కె.మహిపాల్‌, రవి, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, యాకుత్‌పురా ఏఆర్‌వోలు, జహురుద్దీన్‌, సెక్టోరల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.