గణతంత్రం.. జనతంత్రం అయ్యేదెన్నడూ..?

Republic.. Janatantra will never happen..?సంపాదించుకున్న స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా దక్కాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని నిర్మించారు ఆనాటి మహనీయులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశంలో ప్రజాస్వామిక పాలనా యుగం ప్రారంభమై నేటికి 76 ఏండ్లు పూర్తయ్యింది. ప్రజల పాలన ప్రారంభమై ఏడున్నర దశాబ్దాలు పూర్తయినా, ఇంకా మన దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఏ రకంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవల్సిన తరుణం ఇది. రాజ్యాంగాన్ని బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతున్న కాలంలో నేడు మనమీ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం.
గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభువులుగా ఉండే ఒక పాలనా వ్యవస్థ. అప్పటివరకూ రాచరిక, వలసవాదుల పాలనలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న భారతీయులు రాజ్యాంగాన్ని నిర్మించుకోవటం ద్వారా ప్రజాస్వామ్య పాలనలోకి అడుగు పెట్టారు. బ్రిటీషు పాలనకు ముందు భారత పరిపాలన రాజుల చేతుల్లో ఉండేది. రాజరికంలో ప్రజాష్టానికి ఏ మాత్రం విలువ లేదు. పాలన కేవలం కొన్ని వర్గాల చేతుల్లో ఉండేది. వారు చెప్పిందే చట్టం, చేసిందే ధర్మం. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజద్రోహం నేరాన్ని ఎదుర్కొవాల్సి వచ్చేది. ఆంగ్లేయుల ప్రవేశంతో దేశంలో వ్యాపార సంస్థల పాలన, వలసవాదుల పాలన ప్రారంభమయ్యింది. ఇక్కడ కూడా ప్రజల అభీష్టాలకీ, హక్కులకీ ఏ మాత్రం విలువ లేదు. కేవలం వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగేది. కొద్ది మంది ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న వలసవాద పాలనపై అలుపెరుగని పోరాటం చేసి భారతీయులు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు.
సంపాదించుకున్న స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా దక్కాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక పాలనా యుగం ప్రారంభమయి నేటికి 76 ఏండ్లు పూర్తయ్యింది. ప్రజల పాలన ప్రారంభమై ఏడున్నర దశాబ్దాలు పూర్తయినా, ఇంకా మన దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందలేదంటే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఏ రకంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం పారిశ్రామిక వర్గాల ఆర్ధిక ఆకలి తీర్చడానికే దేశంలోని సమస్త వనరుల్ని, వ్యవస్థల్ని ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. కేవలం ఒక్క శాతం మంది ప్రజలు సాధిస్తున్న అభివద్ధినే దేశాభివద్ధిగా ప్రచారం చేస్తున్నాయి. వీటి నుంచి ప్రజల దష్టిని మరల్చడానికి మతం, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. తమ పాలనను పటిష్టం చేసుకోడానికి కొన్ని మతతత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మెజారిటీ పేరుతో కేవలం ఒకే మతం, ఒకే వర్గానికి చెందిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన హాక్కులని అడగటం కూడా దేశ ద్రోహంగా పరిగణించబడుతున్న కాలంలో ప్రజలే రాజ్యాంగ రక్షకులుగా మారాలి.
రాజ్యాంగం అంటే కేవలం అక్షరాలు, పేజీలతో నిర్మితమైన గ్రంథమే కాదు, రక్త మాంసాలతో జీవిస్తున్న కోట్లాది మంది భారతీయుల జీవితాలకు, హక్కులకు పెట్టనికోటగా నిలిచే రక్షణ కవచం. ప్రజల ఆకాంక్షలకు, హక్కులకు మన రాజ్యాంగం సంపూర్ణ భరోసాను ఇచ్చే మాగ్నా కార్టా. భావప్రకటనా స్వేచ్ఛతో పాటు, తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవించటం వంటి అనేక ప్రాథమిక హక్కుల్ని తన ప్రజలకి అందిస్తుంది. రాజ్యాంగం ఆధారంగా తమను తాము పరిపాలించు కోడానికి ప్రజలు అనేక ప్రజాస్వామిక వ్యవస్థలను రూపొందించుకున్నారు. ఆ వ్యవస్థల్నే నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతున్న కాలంలో నేడు మనమీ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న ఈ సంక్షుభిత కాలంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన తరుణమిది.
సరిగ్గా 76 ఏండ్ల కిందట ఇదే రోజు, మన రాజ్యాంగం దేశ ప్రజలందరి చేత ఆమోదించబడిరది. ప్రజలు తమకు తాముగా రచించుకున్న రాజ్యాంగాన్ని తమకే సమర్పించుకుంటూ ‘భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారమున్న సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకోవడానికి, దేశ పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసాలు కలిగి ఉండటంలోను, ఆరాధించటంలోనూ స్వేచ్ఛను, హోదా అవకాశాల్లో సమానత్వానికి, వ్యక్తిగత గౌరవం, ప్రజలందరి మధ్య ఐక్యత, సౌభ్రాతత్వం, దేశ సమగ్రతల సాధనకై ఏకగ్రీవంగా తీర్మానించుకుని ఈ ఇందుమూలంగా ఆమోదించుకుని, అన్వయించుకుని, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని ప్రకటించారు. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే 2015 నుంచి ఈ రోజును భారతీయ రాజ్యాంగ దినోత్సవం, లేదా సంవిధాన్‌ దినోత్సవ్‌ పేరుతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.
భారత రాజ్యాంగం 1947 జనవరి 26న ఆమోదం పొందినప్పటికీ, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు 1858లోనే అడుగులు పడ్డాయి. 1857లో సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన అంతమై బ్రిటీషు రాణి పాలన ప్రారంభమైంది. ఆ కాలంలో అనేక భారత ప్రభుత్వ చట్టాలకు రూపకల్పన చేశారు. వీటిని కౌన్సిల్‌ చట్టాలు అంటారు. 1861లో వచ్చిన ఒక కౌన్సిల్‌ చట్టం ఆధారంగా భారతదేశ శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయలకు చోటు లభించింది. ఈ చట్టం ద్వారా బెనారస్‌ మహారాజు, పాటియాలా మహారాజు, దినకరరావు అనే ముగ్గురు సభ్యులు కౌన్సిల్‌లోకి అనధికార సభ్యులుగా నామినేట్‌ అయ్యారు. ఈ చట్టాల ఆధారంగా 1892లో గోపాలకష్ణ గోఖలే, ఫిరోజ్‌ షా మెహతా, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌బిహారీ ఘోష్‌ వంటి వారు సభ్యులుగా కౌన్సిల్‌లోకి ప్రవేశించారు. 1909 భారత్‌ కౌన్సిల్‌ చట్టం నుంచి 1919 వరకూ జరిగిన అనేక సంస్కరణలు, చట్టాల ఆధారంగా మన దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు బ్రిటీషు ప్రభుత్వం 1917 ఆగస్టు 20న ఒక ప్రకటన చేసింది. 1927లో భారత వ్యవహారాల కార్యదర్శి ‘లార్డ్‌ బిర్కెస్‌హెడ్‌’ 1927 నవంబర్‌లో బ్రిటీష్‌ ఎగువ సభలో మాట్లాడుతూ ‘అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా’ అని జాతీయ నాయకులకు సవాలు విసిరారు. ఈ సవాలుకి ఒక కారణం ఉంది. నిజానికి భారతదేశం ఏక శిలా సదశ్యం కాదు. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ఆచార వ్యవహారాలు, విభిన్న సంస్కతులకు చెందిన సాముహిక ప్రతినిధి. కానీ రాజ్యాంగ నిర్మాణం ప్రారంభమైతే ఈ భిన్నత్వానికి రాజ్యాంగ రూపకల్పనలో చోటు లభిస్తుందా లేదా అన్న సంశయమే ఈ సవాలులోని అంతరార్ధం. ఈ సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్‌ 1928 ఆగస్టు 10న రాజ్యాంగ రచనకు మోతిలాల్‌ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన ఒక ఉప సంఘాన్ని నియమించింది. దీనికి ముందుగా 1927 మే 17న బొంబేలో జరిగిన కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశంలో మోతిలాల్‌ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్నే ‘నెహ్రూ రిపోర్టు’ అంటారు. ఆ తర్వాత 1935లో కాంగ్రెస్‌ భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని డిమాండు చేసింది. ఆ తర్వాత కేబినేట్‌ సిఫార్సుల మేరకు ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946లో ఎన్నికలు జరిగాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ఈ పరిషత్తులో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలని నాటి జాతీయ నాయకులు తీర్మానించారు. దీంతో ఆగస్టు 29న రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రత్యేక డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డాక్టర్‌ అంబేద్కర్‌ చైర్మెన్‌గా నియమితులయ్యారు. అంబేద్కర్‌ నేతత్వంలోని డ్రాఫ్టింగ్‌ కమిటీ సుమారు 60కి పైగా దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను పరిశీలించింది. సుదీర్ఘమైన అనేక చర్చలు, సమావేశాలు, తీర్మానాల అనంతరం ఈ కమిటీ రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీనికి సుమారు రెండేండ్ల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచదేశాల రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌తో దాదాపు మూడేండ్ల పాటు రచించిన రాజ్యాంగం అనేక విశిష్టతలను కలిగి ఉంది. దీన్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో రచించారు. రాజ్యాంగానికి సంబంధించిన డ్రాఫ్టింగ్‌ కాపీని రచించటంలో డాక్టర్‌ అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించారు. సుమారు 114 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిరది. అయితే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. నాటి నుంచి భారతదేశం సంపూర్ణ సార్వభౌమాధికారంతో సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన, ఉన్నతమైన రాజ్మాంగంగా అభివర్ణించవచ్చు. ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగాల్లో అతి పెద్ద రాజ్యాంగం మనది. అందుకే హెచ్‌.వి. కామత్‌ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు. భారతదేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారవ్యవహారాలు, భిన్న వర్గాలు ఒక్కటిగా మనుగడ సాగిస్తున్న ఒక సమాఖ్య వ్యవస్థ. ఈ వైవిధ్యంతో పాటు దేశంలో శతాబ్దాలుగా సాగుతున్న మానవ హక్కుల హననం, కుల వివక్ష, లింగ వివక్ష, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలకు పరిష్కారాలను చూపించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించటం వల్లే 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్‌తో కూడిన ఒక అతిపెద్ద రాజ్యాంగం ఆవిష్కతమయ్యింది. ప్రస్తుతం 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలకు రాజ్యాంగం పరిష్కార మార్గాలను చూపించింది.
1948 నవంబర్‌ 19న రాజ్యాంగ నిర్ణాయక సభలో డాక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ ‘మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ‘ఒక మనిషికి ఒకే ఓటు’ కల్పించటంతో పాటు, ఒక నిర్ధిష్ట కాలంలో ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఓటర్లకు ఉండాలి. మన రాజ్యాంగంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏ పద్ధతిలో అయినా సరే కొంతమంది వ్యక్తుల నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికే. రాజకీయ ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించేదిగా ఉండాలన్నదే రాజ్యాంగం అంతిమ లక్ష్యం’ అని అన్నారు. అదే నిర్ణాయక సభలో 1949 నవంబర్‌ 25న మాట్లాడుతూ ‘మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా కూడా మార్చాలి. సామాజిక ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాలను జీవన సూత్రంగా అంగీకరించేదే సామాజిక ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అన్న మూడు సూత్రాలను విడివిడిగా పరిగణించకూడదు. వీటికి ఒకదానితో ఒకటి విడదీసి చూడటం అంటే ప్రజాస్వామ్య ప్రయోజనాల్ని కాలరాయటమే అవుతుంది. ఈ మూడు సూత్రాల ఆలంబనతో నడిచే రాజకీయ ప్రజాస్వామ్యమే ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాలను ఒకేసారి సాధిస్తుందన్నారు.
ఏ సామాజిక, ఆర్ధిక అభివద్ధినైతే రాజ్యాంగం తన ప్రజలకు వాగ్ధానం చేసిందో, ఆ వాగ్ధానం నేటికీ నెరవేరకపోవటం ఒక విషాదం. నేటికీ దేశంలోని అనేక వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే అది అతిశయోక్తి కాదు. ప్రభుత్వ నివేదికల ప్రకారమే ఇది అక్షర సత్యం. రాజ్యాంగం ప్రజలందరికీ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పించింది. మత స్వేచ్ఛ, నచ్చిన విశ్వాసం కలిగి ఉండటం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానతా సాధన వంటి సూత్రాలను ప్రతిపాదించింది. నేటి పాలకులు వీటిని వేటినీ నేడు పట్టించుకోవటం లేదు. దేశంలో అనేక ఏండ్లుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు ఆర్థిక, సామాజిక స్వావలంబనను సమాధి చేశాయి. ప్రజలకి మేలు చేకూర్చే ప్రభుత్వరంగాలను పరాధీనం చేసి కార్పొరేటు విధానాలకు పట్టం కట్టాయి. చివరికి బ్యాంకింగ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి కీలక రంగాలనూ కార్పొరేట్లకు కట్టబెట్టడమే పాలనా పద్ధతులుగా మారిపోయాయి. ఆర్ధిక సమానత్వం, సామాజిక సమానత్వం నేటికీ ఈ దేశంలో సాధించలేదంటే దాన్ని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల వైఫల్యంగానే భావించాలి. పెట్టుబడిదారులే పార్టీలను, తద్వారా ప్రభుత్వాలను నడిపించటం ప్రజాస్వామ్యంలో ఈ శతాబ్దపు మహా విషాదం.
రాజ్యాంగం అందించిన హక్కుల గురించి కనీస అవగాహన లేని ప్రజలు ఈ దేశంలో ఇంకా సగం మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య, ఆరోగ్యం ప్రభుత్వాలకు సంబంధించిన ప్రధాన బాధ్యతలు, కానీ వాటి నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో దూరంగా జరిగాయి. విద్యా, ఆరోగ్య రంగాలు ఫక్తు వ్యాపార వస్తువులుగా మారిపోయి, ప్రయివేటు సంస్థల పాలిట కామధేనువులుగా మారిపోయాయి. విద్య, ఆరోగ్య రంగంలో ప్రయివేటు శక్తుల ప్రవేశంతో నాణ్యమైన విద్య భారతీయులకు అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ రెండు రంగాల్లో ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారమే గ్రామీణ భారతదేశంలో నూటికి 40శాతం మంది నిరక్షరాస్యులు. వీరికి కనీసం వారి పేరు కూడా రాయటం రాదు. అంటే భారత రాజ్యాంగం గురించి వీరికి పూర్తిగా తెలియదనే అనుకోవాలి.
దేశంలో అక్షరాస్యతా శాతం 77.7 శాతం ఉంటే దానిలో పురషులలో 82 శాతం కాగా, మహిళల్లో కేవలం 65 శాతం మాత్రమే ఉన్నారు. కోట్లాది మంది భారతీయులు దుర్భరమైన పేదరికంలో మగ్గుతున్నారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 127 దేశాల్లో ప్రజల స్థితిగతులను పరిశీలించి తాజాగా విడుదల చేసిన జాబితాలో భారత్‌ 105వ స్థానంలో ఉంది. 127 దేశాలకు సంబంధించిన జాబితాలో 105వ స్థానంలో భారతదేశం ఉందంటే పేదరికం, ఆకలి ఏ స్ధాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ర్యాంకులను భారత ప్రభుత్వం తిరస్కరించ వచ్చు కానీ, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వాలు అందిస్తున్న చౌక డిపో బియ్యం మీదే ఆధారపడి బతుకుతున్నారన్నది తిరస్కరించ లేని వాస్తవం. రోజువారీ అవసరాలకు కూడా సరిపడినంత సొమ్ముని సంపాదించుకోలేని స్థితిలో దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారు. సుమారు 70 శాతం మంది శ్రమతో నిర్మితమైన సంపద కేవలం ఒక్క శాతం మంది వ్యక్తుల ఖజానాలో చేరుతుంది.
ఆదిమ కాలంలో సామాజిక ఆచారాలుగా చెలామణీ అయిన అనేక సంప్రదాయాలను సాంఘిక దురాచారాలుగా ప్రకటించి భారతీయ సమాజాన్ని నాగరిక సమాజంగా భారత రాజ్యాంగం నడిపించింది. సరిగ్గా దీనికి విరుద్ధంగా తిరిగి ప్రాచీన సమాజం ఆదిమ అవశేషాలను ఆధునిక సమాజంలో పునర్నిర్మించే పనిలో కొన్ని రాజకీయ పార్టీలు శరవేగంగా కషి చేస్తున్నాయి. ఈ కుట్రను అడ్డుకోకపోతే రాజ్యాంగం కేవలం కొన్ని వర్గాల ఆకాంక్షలకు మాత్రమే భరోసా నిచ్చే యంత్రంగా మారిపోతుంది. దేశంలోని ప్రజలందరి పక్షాన నిలబడి వారి జీవితాలకు రక్షణగా నిలిచే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన తరుణమిది. దేశంలో అనైక్యతకు, అభద్రతకు దారి తీస్తున్న పాలక వర్గాల కుట్రలకి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా మరొక స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమయినదని అనిపిస్తుంది. చైతన్య వంతమయిన ప్రజా సమూహాలు, ప్రజా సంఘాలు ఉమ్మడిగా పోరాడితేనే రాజ్యాంగం ప్రజలకి రక్షణగా నిలుస్తుంది. అప్పుడే ఈ గణతంత్రం సామాన్యుని రాజుగా నిలబెట్టే జనతంత్రం అవుతుంది.
డా|| కె.శశిధర్‌
94919 91918