బృందావన్‌లో యాత్రికుల బస్సు దగ్ధం… నిర్మల్‌ జిల్లా వాసి సజీవ దహనం

నవతెలంగాణ నిర్మల్: తీర్థయాత్రలకు వెళ్లిన ఓ బస్సు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌ క్షేత్రంలో దగ్ధమైంది. ఈ ఘటనలో నిర్మల్‌ జిల్లా కుభీరు మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పతి(63) బస్సులోనే సజీవదహనమయ్యారు. ఆయన భార్య ఎల్లుబాయి, మిగతా యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. యాత్రికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసాకు చెందిన ఒక వ్యక్తి ప్రయివేటు బస్సులో ఈ నెల 1న భైంసా డివిజన్‌ నుంచి సుమారు 50 మంది భక్తులను తీర్థయాత్రలకు తీసుకెళ్లారు.
యాత్రికులు అయోధ్య, కాశీ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి మంగళవారం మథుర నుంచి బృందావన్‌ చేరుకున్నారు. రాత్రి అక్కడి ఓ పెట్రోల్‌ బంకు సమీపంలో బస్సు నిలిపి ఓ ఆలయంలో దర్శనానికి వెళ్లారు. దుర్పతి నీరసంతో బస్సులోనే విశ్రాంతి తీసుకున్నారు. అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానిక అగ్నిమాపకదళం మంటలార్పే యత్నం చేసినా అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. శీలం దుర్పతితో పాటు యాత్రికుల సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
బుధవారం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహానికి భార్య సమక్షంలో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ముథోల్‌ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ కేంద్ర మంత్రి బండి సంజయ్, అక్కడి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి యాత్రికులకు వసతి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం అక్కడి ప్రభుత్వం రెండు మినీ బస్సులు ఏర్పాటు చేసి యాత్రికులను స్వస్థలాలకు పంపింది.