ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి

A resolution should be passed against NEP– తెలంగాణలో అమలు చేయబోమని ప్రకటించాలి
– 48 వేల పోస్టుల భర్తీకి డీఎస్సీ వేయాలి
– అనుమతిలేని యూనివర్సిటీలపై చర్యలేవీ?
– పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి
– దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు : విలేకర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు వీపీ సాను, మూర్తి, నాగరాజు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
విద్యను సంపన్న వర్గాలకే పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశాల సందర్భంగా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంతో పాటు తెలంగాణలో అమలు చేయబోమని కేంద్రానికి తేల్చి చెప్పాలన్నారు. నూతన విద్యావిద్యా విధానంలో తీసుకొస్తున్న డిటెన్షన్‌ పద్ధతి ద్వారా డ్రాపౌట్స్‌ పెరుగుతాయని చెప్పారు. విద్యార్థులకు నష్టం చేకూర్చే ఎన్‌ఈపీని రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్‌ పోస్టుల్ని భర్తీ చేసే విధంగా డీఎస్సీ వేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియంలో 22 వేలు, తెలుగు మీడియంలో 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ రూ.5177 కోట్ల నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. కేజీ టు పీజీలో భాగమని చెబుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించకుండా అద్దెభవనాల్లో అరకొర సౌకర్యాలతో నిర్వహిస్తున్నారన్నారు. సొంత భవనాల్ని నిర్మించాలని ప్లీనరీ సమావేశం డిమాండ్‌ చేస్తుందన్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా విద్యార్థుల నుంచి ఫీజులు దండుకుంటున్న ప్రయివేట్‌ యూనివర్సిటీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల పేరిట పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారన్నారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్లీనరీ సమావేశాల్లో వివిధ ఆంశాలపై 29 తీర్మానాలు ఆమోదించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
సంఘ విద్రోహ శక్తులైన ఏబీవీపీ గుండాలు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై దాడులుకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐకి వస్తున్న ఆదరణను చూసి ఒర్వలేకనే ఏబీవీపీ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి, కరీంనగర్‌లో దాడులు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పూజ, సహాయ కార్యదర్శి మిశ్రీ, కిరణ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్‌, నల్లవల్లి రమేష్‌ పాల్గొన్నారు.